అక్కమ్మా మా చుక్కమ్మా(కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

అక్కమ్మా మా చుక్కమ్మా(కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

అక్కమ్మ మా చుక్కమ్మ (కవిత)
----------------------------------------

అక్కమ్మా అక్కమ్మా
ఏమిటి నీ లెక్కమ్మా
అద్దంలోకి చూస్తున్నావు
ముద్దుగానే నీవున్నావు !

బొట్టు నుదుటన పెట్టి
పట్టు చీర నువు కట్టి
పోతున్నవులే వగలు
లేపునులే అవి సెగలు !

తొంగి తొంగి నువు చూస్తున్నవు
పొంగిపోతు మరి కనిపిస్తున్నవు
ఈ ఎదురుచూపులు ఎవరికోసం
ఆ మరుల తూపుల పరితాపం!

అక్కమ్మా అక్కమ్మా
చక్కని మా చుక్కమ్మా
ఏమిటి నీ కథ చెప్పమ్మా
నీ మర్మం ముసుగు విప్పమ్మా!

వెన్నెల వెలుగుల స్నానం చేస్తూ
కనుల సైగల సుమగంధం పూస్తూ
దూసుకుపోతున్నవులే అక్కమ్మా
నిదురకు కుదరదులే నీ పక్కమ్మా!

పగలే నీవు కలగంటావు
ఆకలి అసలే లేదంటావు
కనులకు నిదురే రాదంటావు
కింద మీద పడి లేస్తుంటావు!

చందన లేపన పూస్తుంటావు
వెన్నెల వేడిగా ఉందంటావు
మంచం పైన దొర్లుతుంటవు
కంచానికి  కరువౌతుంటవు !

ఎవరి కోసమో తపిస్తున్నవు
ఎవరి నామమో జపిస్తున్నవు
ప్రేమ నాటకం నడిపిస్తున్నవు
ప్రేమే దైవం అని అనిపిస్తున్నవు!

అక్కమ్మా అక్కమ్మా
చక్కని మా చుక్కమ్మా
ఏమిటి నీ లెక్కమ్మా
ఇకనైనా చెప్పమ్మా !

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments