రక్త కన్నీరు...! _కొంపెల్లి రామయ్య

రక్త కన్నీరు...! _కొంపెల్లి రామయ్య


రక్త కన్నీరు...!
_కొంపెల్లి రామయ్య (ఖమ్మం)

అమ్మ గర్భవతని తెలిసినంత సమయం పట్టలేదు 
ఆడ శిశువని  తెలియగానే  భ్రూణ హత్య చేయడానికి

భూమ్మీద పడ్డ బిడ్డ ఏడ్చినంత కాలం గడవలేదు
ఆడ బిడ్డ పీక నొక్కి బొందలో పాతి పెట్టడానికి

ఎదుగుతున్న చిన్నారి మైదానంలో సీతాకోక చిలుకలా
ఆనందంగా  ఎగురుతున్నంత సేపు పట్టలేదు 
కామాంధుడు చేతిలో చితికి నిర్జీవ రక్తపు ముద్దగా మారడానికి

అమ్మ కొంగు విడిచి మూలమలుపు తిరిగినంత నిమిషం పట్టలేదు
కామ పిశాచి మత్తు ముసుగులో నోరు నొక్కి
రేపటి అమ్మ తనాన్ని చిదిమి అగ్గిలో బుగ్గి చేయడానికి

ఫేస్ బుక్ లో పరిచయమైంనంత  సేపు కాలేదు
ప్రేమ పేరుతో మోస పోయి ఆర్తనాదం చేయడానికి

అందం చూసి సొల్లు గార్చినంత   క్షణం పట్టలేదు
వావివరసలు మరిచిన మదాంధుల కబంధ హస్తాల్లో కాలి పోవడానికి

తేనె పూసిన మాటల ముత్యాలు పెదవి జారి కర్ణ భేరికి తగిలినంత సేపు పట్టలేదు
అమాయకపు తల్లులు మానవ మృగాలకు బలికావడానికి

గది గోడల మాటున జరిగేవెన్నో...?
ఇది ఒక రావణ కాష్టం ....
ఎక్కడ పడితే అక్కడ
ఎవడు పడితే వాడు
నైతిక విలువలు నాశనం చేస్తూ
కన్న వాళ్లకు గర్భశోకం మిగిలిస్తూ
చంటి పిల్లా  చిన్న పిల్లా ముసలి తల్లా ఎవరైతే ఏమి ఆడదైతే చాలు
నిస్సిగ్గు నీచపు అమానవీయతతో 
గర్భగుడినీ నాశనం చేస్తూనే ఉన్నారు....
మానవతను మంట గలుపుతూ రేపటి అమ్మకు ఘోరీ కడుతూనే ఉన్నారు...
డెబ్బది ఐదు వత్సరాల స్వతంత్ర భారతం లో
సభ్య సమాజ నిర్మాణం జరిగేదెప్పుడు ?
నీచపు పిశాచాల మూలాలు నరికేదెప్పుడు?
చట్టాలు చేసే పాలకులు మదమెక్కిన మత్తు సమాజాన్ని అంతం చేసేదెప్పుడు?
ఇంకెన్నాళ్ళు ఈ రక్త కన్నీరు...?

0/Post a Comment/Comments