మడతమంచం-నానమ్మ - నరేష్ చారి

మడతమంచం-నానమ్మ - నరేష్ చారి

మడతమంచం-నానమ్మ

మడత మంచంపై 
నానమ్మ కూర్చుంటే
సింహసనంపై మహారాణి కూర్చున్నట్టే !
అదృష్టమంటే మడతమంచానిదే 
దర్పమంటే కూడా మడతమంచానిదే !
బహుశా 
మహారాణిని మోస్తున్నందుకేమో !

నానమ్మను మోయడమంటే
చరిత్రను మోయడమే
నానమ్మను మోయడమంటే
సంస్కృతిని మోయడమే
నానమ్మను మోయడమంటే
జ్ఞాపకాల చెట్టును మోయడమే

మంచమంటే మంచంకాదు
మహారాణి ముచ్చట్లన్నీ వినే చెలికత్తె
పెల్లుబుకిన కన్నీటిని తుడిచే పరిచారిక
గత వైభవాన్ని
వర్తమానానికి పరిచయంచేసే చరిత్ర పుస్తకం
మరచిపోతున్న సంప్రదాయాలను
మానవత్వపు విలువలను
కథలు కథలుగా చెప్పే పెదరాసి పెద్దమ్మ

కాలం హారతికర్పూరంలా కరిగింది
బలహీన రాజ్యంపై
బలమైన‌ రాజ్యం దాడిచేసినట్టు
నానమ్మ దేహంపై  వ్యాధులు దాడిచేశాయి
మహారాణిలా వెలిగిన నానమ్మ
వంశ వృక్షంనుండి పండుటాకై రాలిపోయింది
మడతమంచం కూలిపోయింది
అయినా! అది
తీయని జ్ఞాపకమై మదిలో నిలిచిపోయింది

                       - నరేష్ చారి

0/Post a Comment/Comments