- మార్గం కృష్ణమూర్తి
శీర్షిక: బాల మేధావి
అది భాద్రపద మాసం!
వర్ష ఋతువులో రెండవ మాసం
వాతావరణం చల్లగా ఉంది.
అడపదడపా వర్షాలు పడుతున్నాయి ,
చెట్ల ఆకులపైన నీటి బొట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
గాలి వీచి నపుడల్లా కిటికీలో నుండి చల్లని గాలులు వీస్తున్నాయి.
చలి చలిగా ఉంది
ఇద్దరు వృద్ధ దంపతులు. శ్రీ వేణు గోపాల్ గారు , శ్రీమతి సావిత్రమ్మ గారు. ఆ ఇంట్లో ఇద్దరే ఉంటారు.
వీరికి ముగ్గురు కొడుకులు. ఒక కూతురు.
మొదటి అబ్బాయి పేరు "పవన్" , రెండవ అబ్బాయి పేరు "వరున్" మరియు మూడవ అబ్బాయి పేరు "శ్రవన్". కూతురు పేరు "సాహిని".
పిల్లలను డబ్బుతో కాకుండా మనసుతో చదివించాలని , వారికి చిన్నప్పటినుండే ఖర్చులు , భాద్యతలు తెలియజేస్తూ పెంచాలని అనుకున్నారు. వేణుగోపాల్ గారిది ప్రయివేట్ ఉద్యోగం మరియు సావిత్రమ్మ గారు ఇంటి పని మాత్రమే చూసుకునేది కాబట్టి , ఆదాయం అంతంత మాత్రమే ఉండేది. అనుకున్నట్లుగానే , పిల్లలందరినీ , ప్రేమతో , మనసుతో ఆప్యాయంగా పెంచారు. డబ్బును అవసరానికి మాత్రమే యిచ్చేవారు. ఇంటి ఆదాయం , ఖర్చుల గురించి ఎప్పటికప్పుడు పిల్లలకు చెప్పేవారు. ఆ విధంగా అందరిని చక్కగా చదివించారు. పిల్లలను పెద్ద చేసారు . మంచి విద్యావంతులయ్యారు. సమర్ధులైనారు.
చక్కటి ఉద్యోగాలను పిల్లలే సంపాదించుకున్నారు.
తల్లి దండ్రులు , పిల్లల యిష్ట ప్రకారమే పెళ్ళిళ్ళు కూడా జరిపించారు.
పెద్దబ్బాయి "పవన్" భార్య "శ్రీజ" లకు ఒక కొడుకు, ఒక కూతురు.వారు యు.ఎస్. లో సెటిలైనారు.
రెండవ అబ్బాయి "వరున్' భార్య "రమ్య" లకు ఒక్కత్తే కూతురు. వీరు ముంబాయి లో సెటిలైనారు
మూడవ అబ్బాయి "శ్రవన్" భార్య ''కీర్తన" లు హైదరాబాద్ లో సెటిలైనారు. వీరికింకా సంతానం కాలేదు.
యిక కూతురు "సాహిని" సాఫ్ట్ వేర్ ఇంజినీర్ , అల్లుడు "అభ్యదయ్" కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. వీరికి ఒక కూతురు. సహస్ర 6 సం.రాలు ఉంటుంది. మరో వారం రోజులు పోతే బర్తడే వస్తుంది. చాలా తెలివైన అమ్మాయి.
వీరు ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లు తరువాత ఉంటారు.
కరోనా కావడం వలన, కూతురు అల్లుడు ఇంటి వద్ద ఉండే ఆన్లైన్ లో జాబ్ చేస్తున్నారు ఇద్దరూ.
మనుమరాలు , ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక నానమ్మ , తాతయ్య దగ్గరికి వచ్చి ఆడుకుంటది , వీరిని ఆట పట్టిస్తూ ఉంటది.
శ్రీ వేణుగోపాల్ గారు ప్రయివేట్ ఉద్యోగం చేసి రిటైరైనా ఆర్ధికంగా వీరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు పిల్లలు. వెంకటేశ్వర కాలనీలో , ఒక ఫ్లాట్ ను తీసుకుని ఉంచారు. వాస్తవానికి కొడుకులు రమ్మంటున్నారు. కూతురు కూడా తమ వద్ద ఉండమనే చెప్పింది.
కానీ వారే యిష్ట పడటం లేదు. కాళ్ళు రెక్కలాడినంత కాలం , మేము ఒంటరి గానే జీవిస్తామని , పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని అలా చెప్పు కుంటూ వస్తున్నారు.
వీరు కలిసి జీవిస్తున్నా , అతి ప్రేమో లేక మరోకారణమో తెలియదు గానీ , ఎప్పడూ పోట్లాడు కుంటూ ఉండే వారు. తప్పు ఎవరిదీ అనేది నిర్ణయించ లేని పరిస్థితి.
ఒక రోజు సావిత్రమ్మ గారు బాధ పడుతూ కూర్చున్నది.
ఇంతలో ఆన్లైన్ క్లాస్ అయిపోయాక మనుమ రాలు "అమ్మమ్మా!" అంటూ వచ్చింది "సహస్ర".
అమ్మమ్మ పలుక లేదు , నేల ముఖం వేసుకుని బాధతో కూర్చుంది.
"సహస్ర" విషయం కనిపెట్టేసింది. తాతయ్య అమ్మమ్మకు ఏదో గొడవ అయ్యిందని.
"ఏంటి అమ్మమ్మా! , ఎందుకు బాధ పడుతున్నావు, తాతయ్య ఏమైనా అన్నాడా?" అని అడుగుతుంది , ఏమీ తెలియనట్లే .
"అవునురా , ఎప్పుడూ ఏదో ఒకటి అంటాడు , మనసు బాధ పెడుతాడు , ఎంత కాలం ఓర్చు కోవాలి చెప్పు" అని అంటుంది.
"చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమన్నట్లు"
మనుమరాలు ఒక పెద్ద మనిషిలా అనుకుని చెబుతుంది.
నిజంగానే , సహస్ర కూడా పెద్ద మనిషిలాగానే మాట్లాడుతుంది.
"అమ్మమ్మా! , నేను ఒక ఉపాయం చెప్పనా , ఆ విధంగా చేస్తే నీకు బాధ అనేది మనసులో నిలువదు. మనసులో ఏ బాధ లేకపోతే , ఇక సంతోషమే కదా" అని చెబుతుంది.
" ఏంటిదిరా , ఆ ఉపాయం" అని ఆతృతతో అడుగుతుంది, అమ్మమ్మ.
"చూడమ్మమ్మా!, తాతయ్య గాని , మరెవరైనా గానీ నిన్ను ఏమైన అన్నా , తిట్టినా , కోప్పడ్డా వాటిని , మట్టిమీద వ్రాయి.
అలానే తాతయ్య గాని మరెవరైనా గానీ ఎప్పుడైనా నీతో సంతోషంగా మాట్లాడినా , గడిపినా , మెచ్చుకున్నా వాటిని , ఒక రాయిపైన వ్రాయి. ఇక నీ బాధలన్నీ పోయి సంతోషంగా ఉంటావు " అని అంటుంది.
"అలా వ్రాస్తే , బాధలు ఎలా పోతాయిరా"
అంటూ అమాయకంగా అడుగుతుంది అమ్మమ్మ.
"అమ్మమ్మా! , మట్టిమీద వ్రాసిన తాతయ్య తిట్టిన తిట్లు , కొంత కాలానికి గాలికి కొట్టుకు పోతాయి ,యిక నీవు వాటిని మరిచి పోతావు. అందుకని నీకు బాధనేది ఉండదు." అని అంటుంది సహస్ర.
అలానే , రాయి మీద వ్రాసుకున్న తాతయ్య మంచి మాటలు , మలిగి పోవు. అలానే ఉండి పోతాయి. నీవు ఎప్పుడు చదువుకున్నా , తాతయ్య మంచి వాడే అనే నీ మనసులో మెదులుతుంది. కాబట్టి నీకు తాతయ్య మంచి మాటలే గుర్తుకు రావడం , తిట్లు జ్ఞాపకం లేక పోవడం వలన నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువలన, నీవు సంతోషంగా ఉంటావు", అని ఒక బాల మేధావి లాగా సలహా యిస్తుంది.
అమ్మమ్మ నవ్వుతూ , "సరే నాన్నా, యిక నుండి అలాగే వ్రాస్తాను" అని అంటుంది.
ఇంతలో , పని మీద బయటకు వెళ్ళిన తాతయ్య ఇంటికి వస్తూ సహస్ర కు డైరీ చాక్లెట్ యిష్టమని తీసుకుని వస్తాడు.
తాతయ్య డైరీ చాక్లెట్ ఇవ్వగానే , సహస్ర థాంక్యూ తాతయ్యా , అమ్మమ్మా అంటూ
ఇంటికి వెళ్ళిపోతుంది
- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్