అభ్యుదయ భావాలు --దొడ్డపనేని శ్రీవిద్య

అభ్యుదయ భావాలు --దొడ్డపనేని శ్రీవిద్య

అభ్యుదయ భావాలు

సమాజాన్ని ఉద్దరిద్దామని నిన్ను నీవు ఉత్సాహ పరుచుకున్నావు
కన్నీరు కార్చే కంటితో ఇంటి నుండి బయలుదేరావు

కన్నీరు కాదు కష్టంతోనే చరిత్ర సృష్టించగలవనుకున్నావు
చేసే పనిలో మంచే నిన్ను నిలిబెడుతుందని నమ్ముకున్నావు

బడుగు జీవితాలని ఉద్దరించేలా నిన్ను నీవు ఆవిష్కరించుకున్నావు
అకుంటిత ఆత్మ విశ్వాసంతో పయనాన్ని సాగించావు

ఆర్ధిక అసమానతలను రూపు మాపాలని ప్రగతి బాట పట్టావు
యువత లో విప్లవ చైతన్యం రగిలించాలని సిద్ధమయ్యావు

దారి పొడవునా ముళ్ళబాటలయినా సహించావు
ప్రతికూల శక్తులతో పోరాడి అలిసి పోయావు

హక్కుల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావు
పేద బ్రతుకుల్లో చిరునవ్వులు పూయించాలని శ్రమించావు

వరకట్న జాడ్యాన్ని అంతం చేయాలని కంకణం కట్టావు
మూఢాచారాల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకున్నావు

హృదయాంతరాళం గర్జిస్తూ ఉండగా బాల కార్మిక వ్యవస్థ పై విరుచుకుపడ్డావు
ఎన్ని అవాంతరాలు ఎదురైనా అదరక బెదరక రవి కిరణమై వెలిగినావు

నువ్వు నమ్మిన సిద్ధాంతాల కోసం పడి లేచే కెరటమై పరుగెత్తినావు
గమ్యం తెలియని బాటసారిలా విజయం కోసం చీకటిని చీల్చు కుంటూ అడుగులేసావు 

లోకులు కాకులై ఎత్తి పొడిచినా చిరునవ్వు తో భరించావు
ఓటమిని ఎదిరించి రెట్టించిన ఉత్సాహంతో కదన శంఖం పూరించావు

అనితర సాధ్యాలను సుసాధ్యం చేస్తూ నీతో నడచిన నీ వారిని....కలుపుకుంటూ
మును ముందుకు సాగిపోయావు అభ్యుదయ భావాలతో....

--దొడ్డపనేని  శ్రీవిద్య
విజయవాడ


0/Post a Comment/Comments