"వెన్నెలమ్మ పదాలు-శంకర ప్రియ చేవ్రాలు" (పుస్తక సమీక్ష)-శ్రీ శివ శంకర ప్రియ,కవిమిత్ర.

"వెన్నెలమ్మ పదాలు-శంకర ప్రియ చేవ్రాలు" (పుస్తక సమీక్ష)-శ్రీ శివ శంకర ప్రియ,కవిమిత్ర.

"వెన్నెలమ్మ పదాలు-శంకర ప్రియ చేవ్రాలు"
(పుస్తక సమీక్ష)-శ్రీ శివ శంకర ప్రియ,కవిమిత్ర.
--------------------------------
"భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామ కథయే రక్తి
ఓ కూనలమ్మ"
         "ఆశ పెరిగిన వాడు
          అహము పెరిగిన వాడు
          తనకు తానే కీడు
          ఓ కూనలమ్మ"
"గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతో స్నేహమ్ము
ఈ కూనలమ్మ"
  ఆరుద్ర కూనలమ్మ పదాలు తెలుగునాట బహు ప్రసిద్ధము.వారి అడుగుజాడల్లో పయనించిన వారిలో గద్వాల సోమన్న ఒకరు.సరళమైన వాడుక పదాలతో వేడుక జేశారు.పండు వెన్నెలలాంటి వెన్నెలమ్మ పదాలతో వెండి వెన్నెల కురిపించారు. ఆరుద్ర కూనలమ్మ పదాలను తలపింపజేశారు.పద పదమున తేనీయలు జాలువారాయి.అందమైన అలతిఅలతి పదాలతో ,అంత్యప్రాసలతో అలవోకగా బాలగేయాలు వ్రాయడంలో గద్వాల సోమన్న గారిది అందెసిన చేయి.వృత్తి పరంగా గణితోపాధ్యాయుడైనా ప్రవృత్తి రీత్యా సాహితీ స్రష్ట అనడం అతిశయోక్తి లేదు.ప్రతిరోజూ ఎన్నో పత్రికలలో వీరి గేయాలు విరివిగా వస్తుంటాయి.పాఠకుల మనసులను పరవశింపజేస్తాయి. వారు వ్రాసిన వెన్నెలమ్మ పదాలు మచ్చుకు కొన్ని:
"నవ్వు వదనము వెలుగు/మనిషి ఆయువు పెరుగు/దాని విలువను ఎరుగు/ఓ వెన్నెలమ్మ!" అని నవ్వు యొక్క విశిష్టతను వివరించారు." నోరు కోరును పోరు/అదుపు చేయుము నోరు/తెచ్చిపెట్టును పేరు/ఓ వెన్నెలమ్మ!"అని నోటి అదుపు జేస్తే వచ్చే మేలులు తెలియజేశారు."మనసు నొచ్చిన కీడు/నొప్పి పెట్టిన వాడు/మేలు పొందడు వాడు/ఓ వెన్నెలమ్మ!" అని మనసును నొప్పించిన వాడు బాగుపడడని హితవుపలికారు."తరిగిపోనిది చెలిమి/జీవితంలో కలిమి/ఇచ్చు గుండెకు బలిమి/ఓ వెన్నెలమ్మ!"అని స్నేహం యొక్క గొప్పదనం చక్కని చిక్కని ప్రాసలతో కళ్ళకుకట్టి నట్లు వివరించారు.
 ఇంకా "దిద్దుకుంటే తప్పు/నడవడి యగును ఒప్పు/తెచ్చిపెట్టును మెప్పు/ఓ వెన్నెలమ్మ!"అని  తప్పులు చేయడం మానవ నైజం. సరిదిద్దుకోవడం దైవ స్వభావం అని నొక్కివక్కాణించారు."గురువు నేర్పని విద్య/ఎంత నేర్చిన మిధ్య/తుదకు సాయంసంధ్య/ఓ వెన్నెలమ్మ!" ,గురువు చెంతకు చేరు/వారి దీవెన కోరు/నీదు కల నెరవేరు/ఓ వెన్నెలమ్మ!" , జ్ఞాన దీపము గురువు/దైవ రూపము గురువు/మేలు చేసే తరువు/ఓ వెన్నెలమ్మ!" అని గురువు యొక్క ప్రాముఖ్యత చాటారు.
   ఇలా ఎన్నో సామాజిక అంశాలను స్పృశించారు.సమాజంలో ని అసమానతలపై ధ్వజమెత్తారు. సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు.వెన్నెలమ్మ పదాలు చదువుతున్న సేపు కాసేపు వెన్నెల్లో విహరించినంత హాయిగా ఉంటుంది.
   సాహితీమిత్రులు గద్వాల సోమన్న కలం నుంచి మరెన్నో పుస్తకాలు వెలుగు చూడాలని మనసా,వాచా,కర్మణా అభిలాషిస్తూ...కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ..
  - శంకర ప్రియ,కవిమిత్ర
శీల(V)
 via., గొల్లపాలెం- 533 468..
తూర్పు గోదావరి జిల్లా.,

0/Post a Comment/Comments