నిత్య కృషీవలుడు "రైతన్న" -జరుగుమల్లి వీరయ్య

నిత్య కృషీవలుడు "రైతన్న" -జరుగుమల్లి వీరయ్య


అంశం : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా..

కవిత శీర్షిక : నిత్య కృషీవలుడు "రైతన్న"
రచయిత : జరుగుమల్లి వీరయ్య, కలికిరి, చిత్తూరు. 

        నిత్య కృషీవలుడు "రైతన్న"

వేకువజామున
కోడికూత పలకరింపుతో నిద్రలేచి..
ఉషోదయ కిరణాల
వెలుగులో నడక సాగించి..
మోడువాడిన బీడుభూములను
హలం పట్టి పొలం దున్ని..
సిరుల పంటలు పండించే,
ఆ సిరుల నిచ్చే భూమాతకు
పచ్చని కోక చుట్టినట్లు సింగారించే నిత్య కృషీవలుడు "రైతన్న".
శ్రమ బలంతో బుద్ధిబలంతో
పచ్చని పొలాల లో అడుగులు వేస్తూ
శ్రమతో కూడిన నైపుణ్యానికి
యాంత్రిక కృషి సరి రాదని
దరిచేరదని నిరూపిస్తూ..
పచ్చని పొలాల లో సిరుల నిచ్చే పంటలు పండిస్తూ..
పచ్చని పొలాలకు నావికుడు గా..
రాజ్యాన్ని రక్షించే యోధిడిలా..
శ్రమకు తగ్గ రాబడి రాదని లేదని తెలిసినా..
నివురుగప్పిన నిప్పులా..
ఉప్పొంగే సముద్రపు ఉప్పెనలా..
శ్రమను నమ్ముకున్న నిత్య కృషీవలుడు "రైతన్న".
ఉద్యోగికి సెలవు వచ్చినా
కంపెనీలకు తాళం పడినా
ప్రభుత్వాలు స్తంభించినా
కరోనా కాలంలో లాక్డౌన్ విధించినా
ప్రకృతిలో అతివృష్టి ,అనావృష్టి వచ్చినా
ఆగిన ప్రపంచాన్ని నడిపేందుకు
అన్నదాత గా..
నిలిచిన నిత్య కృషీవలుడు "రైతన్న".
ఎముకలు కొరికే చలిని
నిప్పులు చిమ్మే ఎండను
ముంచెత్తే జోరువానను
తట్టుకుని..
ఎర్రబారిన ఉద్యమంతో
సంఘటిత శక్తుల సౌకర్యంతో
సంవత్సరమైనా అలుపెరుగని
అన్నదాత అవిశ్రాంత పోరాటం పటిమతో
మూడు నల్ల చట్టాల రద్దుకు నాంది పలికించిన ..
నిత్య కృషీవలుడు "రైతన్న".

హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

 

0/Post a Comment/Comments