వెలుగుల క్రిస్మస్ -శ్రీలతరమేశ్ గోస్కుల, హుజురాబాద్

వెలుగుల క్రిస్మస్ -శ్రీలతరమేశ్ గోస్కుల, హుజురాబాద్

నింగిలోని తారాగణమంతా
ఎన్నడూ లేనంతగా తళుకులీనుతుంటే..
నేలపైన నింగిని తలపించె
చుక్కల్లా వెలుగుతున్నాయి
యేసురాక కోసం
భక్తుల హృదయాలన్నీ...

చెడును తుంచే అభిషిక్తుడు
మంచి పెంచే రక్షకుడిగా..
పాపాలను హరించి
పాపికి సైతం ప్రేమను పంచిన
దేవుని కుమారుడు అతడు...

గాబ్రియేల్ దేవదూత
పుణ్యకాలాన చెప్పిన కలతో..
కన్యకనే మారెను మేరీ మాతగా.. 
తెరుచుకున్న ఆకాశపు తలుపులనుండి
తెల్లని పావురమై...
నేలన దిగిన దివ్యతేజస్సు..
పశువుల పాకపై పవలించగా..
లోకమంత క్రిస్మస్ గా
సంబరాల సంతోషపు వెలుగులు పరుచుకున్న శుభ తరుణమిది...

పరుల సొమ్ము పాము వలే
విషమెంతో కక్కునని..
నరహత్యా పాపమంటూ..
చేసిన దానానికి ప్రదర్శన వద్దన్న లోక ఆరాధ్యకుడు..
విశ్వాసంతో విశ్వాన్ని జయించి కపాడగ వచ్చిన కరుణామయుడు...

శిలువయాగాననంతరం
పునరుత్థానమైన జీవన విజయంతో..
వెలుగొందుతున్న ఈస్టర్
నలుదిశలా ప్రక్షాళనంతో పావనం చేసి పవిత్ర దినంగా మార్చెను...

అల్లంత దూరం నుండి
ఆకాశ మార్గానా..
ఆనందాలతో శాంతాక్లాజ్
ధ్రవపు జింకలబండిపై..
పరుగు పరుగున వచ్చి
పిల్లలకెన్నో బహుమతులు పంచు
పర్వదినమైన క్రిష్టమస్ రోజున...

-శ్రీలతరమేశ్ గోస్కుల,
హుజురాబాద్.

0/Post a Comment/Comments