అమ్మమ్మను చూడలేదు - డా.. కందేపి రాణీప్రసాద్.

అమ్మమ్మను చూడలేదు - డా.. కందేపి రాణీప్రసాద్.



అమ్మమ్మను చూడలేదు
                 డా.. కందేపి రాణీప్రసాద్.

       నేను మా అమ్మమ్మను చూడలేదు. మా అమ్మ వాళ్ళ నాన్నను చూడలేదు. మరీ ఏమిటి అమ్మమ్మ గారి విశేషాలు అంటారా! చూడండి అదేంటో!
మా అమ్మమ్మగారి ఊరి పేరు సామంతపూడి. ఇది ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పశ్చిమంగా 50 కి. మీల దూరంలో ఉంటుంది. మా అమ్మ అక్కడే పుట్టింది. మా అమ్మ పుట్టిన రెండేళ్ళకే మా తాతయ్య చనిపోయారట. అందుకే మా అమ్మకు వాళ్ళ నాన్న రూపమే గుర్తులేదు. మా తాతయ్య ఆ సామంతపూడి గ్రామానికి కరణంగా పని చేసేవారట. మా అమ్మమ్మకు పదిమంది సంతానం. తండ్రిలేని ఈ కుటుంబమంతా చీరాలకు వచ్చేసింది. ఈ పది మందిలో చివరి సంతానమే మా అమ్మ. రెండేళ్ళ మా అమ్మను తీసుకొని చీరాల వచ్చేసి అక్కడే స్థిరపడిపోయారు.
మా అమ్మమ్మ గారి ఇంటి పేరు కూడా సామంతపూడే. మ్మా అమ్మమ్మ పేరు సామంతపూడి చెంచమ్మ. తాతయ్య పేరు సామంతపూడి బ్రహ్మయ్య. మా అమ్మతో సహో అక్కచేల్లెళ్ళందరూ బాగా ముగ్గులు వెయ్యటం, ఎంబ్రాయిడరీ కుట్లు కుట్టటం, లేసులు అల్లటం, క్రోషయో అల్లకిలతో దుప్పట్లు బనిన్లు అల్లటం మొదలైనవన్నీ చేసేవారు. మా పెద్దమ్మ కత్తి పిటతో జాకెట్లు కత్తిరించి చేతికుట్టుతో జాకెట్లు అద్దినట్లుగా కుట్టేదట. ఈ నైపుణ్యము, తెలివితేటలు మాఅమ్మ వాళ్ళకు అమ్మ దగ్గర నుంచే వచ్చి ఉంటాయనుకుంటా. ఎందుకంటే నేను అన్నిరకాల కుట్లు మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నా. సాధారణంగా కుట్టేవన్ని నేర్చేసుకున్నాక పెయింటింగ్, డాల్ మేకింగ్, టాటింగ్, నిట్టింగ్ వంటివి కూడా నేర్చుకుని నేనేదో ఎవరెస్ట్ సికరం ఎక్కెగానని తెగ సంబరపడ్డాను. అప్పట్లో ఆడపిల్లలకు చదువు కన్నా కూడా ముగ్గులు అందంగా వెయ్యడం, వైరుబుట్టలు అల్లడం, ఎంబ్రాయిడరీ కుట్లు కుట్టడం వస్తే చాల గొప్పగా చూసేవాళ్ళు. నాక్కూడా చదువుకన్నా వీటి మీదే ఇష్టం ఎక్కువగా ఉండేది. ఇంట్లో నాన్న నన్ను బైపీసి గ్రూపు తీసుకొని డాక్టరు చదవాలని చెప్పాడు. నేను బాగా అలోచించి ఇలా చెప్పాను " నాన్న నేను డాక్టరు చదువుతాను. కానీ పేషంట్లను మాత్రం చూడను. ఎందుకంటే ఇంకా చాల కొత్త రకాల కుట్లు నేర్చుకోవాలి. కుట్లు అల్లికల మీద ఇంతప్రేమ ఉన్నప్పుడు మధ్యలో డాక్టరు చదవడమెందుకు పూర్తిగా వాటితోనే బతుకు" అని దేవుడు తధాస్తని దీవించాడు. అలా నేను డాక్టర్ని కాకుండా హస్తకలల్లో వివిధరకాల నూతన ప్రయోగాలు చేస్తున్నాను. ఇలా తయారు చేసిన వాటన్నిటితో మా హాస్పిటల్ అంత నింపేశాను అయ్యో! చెప్పనేలేదుకదూ! తన డాక్టరు కోరికను నేనేలాగు తీర్చేలా లేనని మానాన్న ఓ మంచి డాక్టర్ని అల్లుడిగా తెచ్చేసుకున్నాడు.
మా అమ్మకు పెళ్ళయిన 20 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. మా అమ్మమ్మ పిల్లలందరికీ పిల్లలున్నారు ఒక్క మా అమ్మకు తప్ప. "అయ్యో! మా చిన్నమ్మాయికి పిల్లల్లెరమ్మా" అని కనిపించిన వారందరితోనూ చెప్పి మా అమ్మమ్మ విపరీతంగా బాధపడేదట. చివరకు ఆమె ఆ బాధతోనే మరణించింది. ఆ మరుసటి నెలలోనే మా అమ్మ గర్భం దాల్చింది. నేను పుట్టాను. నేను ఆడపిల్ల నవడంతో చూడటానికి వచ్చిన వారందరూ "మీ అమ్మే నీ కడుపున పుట్టిందమ్మా" అని ఆనందించారు. అలా నాకూ మా అమ్మమ్మకు అనుబంధం కుదిరింది.
అందరూ అమ్మమ్మ గారి ఊర్లో. అమ్మమ్మ ఇంట్లో పుడతారు. కానీ నాకు అమ్మమ్మ లేదు కదా! నేను మా నాయనమ్మ వాళ్ళ ఊర్లోనే, హాస్పిటల్ లో ఆపరేషన్ ద్వారా పుట్టాను. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నపుడు స్నేహితులందరూ పండక్కి మా అమ్మమ్మ కొత్తలంగా కుట్టించిందనో, ఈ అరిశాలు మా అమ్మమ్మ సంక్రాంతికి పంపిందనో చెపుతుంటే నోరు తెరుచుకుని వినటం తప్ప ఏం చేయలేక పోయేదాన్ని. ఇంకా శలవలు ఇస్తూ ఉండగానే "మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాం' నా సంబరంగా చెప్తుంటే నాకు చాలా బాధేసేది. చింతకాయ, ఆవకాయ పచ్చళ్ళు అమ్మమ్మ పంపిందని స్కూలుకు బాక్సుల్లో తెచ్చుకుని వింటుంటే నోట్లో నీళ్ళూరేవి. ఇలా స్కూలులో ప్రతి పిల్లలు ఎదో విషయంలో అమ్మమ్మ పేరు వినపడుతూనే ఉండేది. 'నాకు అమ్మమ్మ లేదు' అని నాకు బాధ కలుగుతూనే ఉండేది. చివరకు నా పెళ్లి సమయంలో కూడా "అమ్మమ్మ గారు పెళ్ళి కూతుర్ని చెయ్యడం, అమ్మమ్మ గారు తలంబ్రాల చీర తేవడం" వంటి విషయాల్లో కూడా అమ్మమ్మ లేకపోవడం నాకు వెలితిగానే అనిపించింది. కానీ ఏం చేస్తాం! నాకింతే అనుకునే దాన్ని!
ఆ తర్వాత పెద్దై నా పెళ్ళయిపోయి పిల్లలు పుట్టాక నా బాధ మార్చి పోయాను. నా పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలి పెట్టి వాళ్ళకు సంతోషం కలిగించి నేను ఆనందాన్ని పొందేదాన్ని. మళ్ళి ఇన్నేళ్ళకు ఓ పత్రిక వాళ్ళు అమ్మమ్మ ఊరు అనే శీర్షిక పెట్టి అమ్మమ్మ గురించి రాయమంటున్నారు. నాతోటి రచయితలందరూ వారి అనుభవాలు రాస్తుంటే అయ్యో నేనేమి రాయాలి అనుకున్నాను. నేనసలు అమ్మమ్మను చూడనే లేదు. నాకెలాంటి తీపి జ్ఞాపకాలు లేవు. నేనెలా రాయాలి! ఇప్పుడు కూడా నాకు అమ్మమ్మ లేక పోవడమే నా దురదృష్టాన్నీ వెక్కిరిస్తున్నట్లే ఉన్నది. అయినా ఆవిడ విషయాలు, నా బాధ మీతో పంచుకోవాలనుకుంటున్నాను అందరి జ్ఞాపకాల్లగే నా అనుభూతులు చదవండి.
అమ్మమ్మ గోరుముద్దలు తినిపించటం, ఒళ్ళో పడుకోబెట్టుకొని కథలు చెప్పడం, దాచి పెట్టినా అరిశలో, బూరేలో తెచ్చిచ్చి నోట్లో ఇలాంటి మధుర జ్ఞాపకలేవి నాకు లేవు. కానీ నా ఇల్లలకు ఆ అదృష్టం కలిగింది. ప్రస్తుతం మా అమ్మ మాతోనే ఉండటం వాళ్ళ మా పిల్లలు 'అమ్మమ్మ' అనే అమృతాన్ని తాగుతున్నారు! 'అమ్మమ్మ' అనే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇవండీ మా అమ్మమ్మ విషయాలు. మీరంతా తప్పక చదువుతారు కదూ! Mail on Android

0/Post a Comment/Comments