జై భారతదేశం. డా.. కందేపి రాణీప్రసాద్.

జై భారతదేశం. డా.. కందేపి రాణీప్రసాద్.
జై భారతదేశం
డా.. కందేపి రాణీప్రసాద్.

కోవిడ్ 19 వైరస్ భూలోక సంచారం చేస్తూ దేశదేశాలు తిరుగుతోంది. చైనా దేశంలోని వుహన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలనూ చూడాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం మొదలు పెట్టింది. కరోనా వైరస్ దేశదేశాల్ని సరదాగా చుడాలనుకోవటం లేదు. దేశ విదేశాల్లోని మానవులను హతం చేయాలనీ కంకణం కట్టుకున్నది. ఈ మధ్య అందరూ ఏవో గొప్ప మరియు వింత పనులు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతున్నారు. కరోనా కూడా భూమ్మీద ఇప్పటి వరకు ఏ వైరస్సూ తియనన్ని ప్రాణాలు తీయాలని అనుకున్నది. చైనా నుంచి ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల మీదుగా భారతదేశం చేరుకున్నది.
ఋషులు చేస్తున్న యాగాలను నాశనం చేయటానికి రాక్షసులు అదృశ్యరూపంలో ఉంది యుద్ధం చేశారు. అలాగే కరోనా వైరస్ కూడా మానవుల కంటికి కనపడకుండా ప్రాణాలు తీస్తోంది. ఇది అదృశ్యరూపంలో మానవుల ముక్కులో దూరి అక్కడ తుమ్ముల్ని కలిగిస్తుంది – అక్కడ నుంచి ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస తీసుకోకుండా నిరోదిస్తుంది. శ్వాస తిసుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తుంది. ఇది దీని వ్యూహం. చైనా ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఉన్నప్పుడే కరోనా వ్యూహాన్ని భారతదేశం గుర్తించింది. అందుకే దానికి ప్రతి వ్యూహం రచించి రెడీగా పెట్టుకుంది.
కరోనా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించగానే కొద్దిమందిని ఇబ్బందులకు గురిచేసింది. ' ఓహో నా ప్రతాపం చుపించేస్తాను ఇక' అని మురిసిపోతూ కరోనా వీధుల వెంట తిరుగుతోంది. మే నెల ఎండలేమో రోళ్ళనే పగలగోడుతున్నాయి. మరి అతి సూక్ష్మమైన ప్రోటీన్ పోగైన కరోనా వైరస్ ఎంత. మాడిపోయే ఎండకు దాని వళ్ళే కరిగిపోతున్నది. పోనీ ఎవరన్నా కనిపిస్తారేమో వాడి ముక్కులో దూరిపోదాం అని కళ్ళకు వత్తులు వేసి వెతికినా ఎవరూ కనిపించట్లేదు. రోడ్ల మీద ఒక్క మనిషీ కనిపించట్లేదు. 'ఏమయ్యారబ్బా! ఎండకు భయపడి ఇళ్ళలో నుంచి రావటం లేదని నిశ్చయించుకున్నది.
కరోనా రోస్లు వదిలి ఇళ్ళ దగ్గరకు వచ్చింది. ఇళ్ళ ముందు ఆడుకునే పిల్లలు గానీ, అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే ఆడవాళ్ళు గానీ కనిపించలేదు. నాలుగు రోడ్ల కూడళ్ళలో చాయ్ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకునే మగవాళ్ళు ఇంతదాకా రోడ్ల మీద కన్పించలేదు. అసలేమైంది ఇళ్ళకు తలుపులు పెట్టి ఉన్నాయి. ఇంట్లోనూ, ఇంటి బయటా అలికిడే లేదు. నిత్యం రణగొణ ధ్వనులతో చెవులు హోరెత్తిపోయే రోడ్లేనా ఇవి అనుకుంది కరోనా. ఆలోచిస్తూ నడుస్తుందే గానీ నెత్తిమాడిపోయి నీరసం వస్తోంది. ఎవరైనా మనిషి దొరికితేనే గదా నేను బతకగల్గేది ఎనిమిది గంటలు దాటిపోతే చచ్చిపోతాను గదా అని భయపడి ఇంటింటికి పోయి తలుపుగోడుతోంది. ఎవ్వరైనా తలుపు తీస్తారేమో వారి మీద దాడి చేద్దామని చూస్తోంది. కాని ఎవ్వరూ తలుపు తియ్యడం లేదు. మనిషి బయట తిరగడం లేదు. మరి అప్పటికే లాక్ డౌన్ విధించిన విషయం దానికి తెలీదు కదా!
సరే మళ్ళి రోడ్డుపై పడింది. దూరంగా ఇద్దరు మనుషులు కనిపించారు. 'ఓహో ' అని సంబరంగా కరోనా వాళ్ళ వద్దకు వెళ్ళింది. దగ్గరకెళ్ళి చూస్తే ఏముంది వాళ్ళ ముక్కుకు అడ్డంగా మాస్క్ కట్టబడి ఉన్నది. అయ్యో! ఇదేంటి! నేను శరీరంలోకి వెళ్ళాలంటే ముక్కులో నుంచే కదా దూరాల్సింది. ముక్కుకు అడ్డంగా ఇలా కట్టుకుంటే నేనేం చేసేది అని నిరుత్సాహంగా నిలబడింది.
" అయితే చేతుల మీద వాలిపోదాం ఎప్పుడో మర్చిపోయి కళ్ళు ముక్కులను ముట్టుకుంటాడు. అప్పుడు లోపలికి దూరి పోవచ్చు మెల్లగా" అని ఆలోచించుకొని ఆ మనుషుల చేతుల వంక చూస్తూ దూకడానికి సిద్దపడింది. అంతలో వాళ్ళు జేబులో నుంచి శానిటైజర్ బాటిల్ తీసి చేతులపై వేసుకొని రుద్దుకున్నారు. ఆ ఘాటుకు కరోనాకు కళ్ళు తిరిగ్గి పోయాయి. ఎలాగో నిలదొక్కుకుని గోడ పట్టుకొని నిలబడింది. అమ్మో! ఇదేంటి! వీళ్ళిలా నన్ను చంపే ప్రోగ్రాములు పెట్టారు. ' ఎలా ఇక్కడ బతకడం ' ఆలోచనలో పడిపోయింది.
కరోనా బాగా ఆలోచించింది. ఇండియాలో జనం గుంపులు గుంపులుగా ఉంటారంటారు కదా! చూద్దాం. ఏ గుంపులోనైన చొరబడితే ఎలాగోలా ఒంట్లోకి చేరవచ్చు. ఆలోచిస్తూ నీరసంగా ముందుకు వెళ్ళసాగింది. దూరంగా ఏదో గుంపు కనిపించింది. ఎగిరి గంతేసింది. కరోనా గబగబా ముందుకు పరుగులు తీసింది. అక్కడ ఎవరో దాతలు బియ్యం కందిపప్పు పంచుతున్నారు. జనం వాటిని తీసుకొని ఇళ్ళకు వెళుతున్నారు. ఇక్కడ ఛాన్స్ దొరకవచ్చు.
కరోనా నడుస్తూ నడుస్తూ ముందుకు సాగి గుంపును చేరింది. అక్కడ జనాల్ని చూడగానే కరోనాకు కళ్ళు తిరిగిపోయాయి. ఒక్కక్క వ్యక్తి ఆరు మీటర్ల దూరంలో నిలబడి ఉన్నారు. వాళ్ళకు నిర్దేశించిన గుండ్రాల్లోనే నిలబడ్డారు. ' ఇప్పుడెలా! విల్లిలా దూరంగా ఉంటె నేనెలా దూరగలను ' అని నీరసపడింది కరోనా. మరి ఇక్కడ భౌతిక దూరం పాటిస్తున్నామని దానికి తెలియదు కదా!
" ఇన్ని దేశాలు తిరిగాను. ఎక్కడా నాకు ఎదురుదెబ్బ తగల్లేదు. ఇండియాలో మాత్రం రోడ్ల మీదికి రాకుండా లాక్ డౌన్ పెట్టారు. మూతికి మాస్క్ కట్టుకుంటున్నారు. చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారు. మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరం పాటిస్తున్నారు. నేనెలా వ్యాధిని వ్యాప్తి చేయాలి" అని ఆలోచిస్తూనే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది. పైనున్న ఎండ మండటంతో దాని దేహం కరిగిపోతూ 'జై భారతదేశం' అనుకుంటూ ప్రాణం విడిచింది కరోనా! అప్పటికే ఎనిమిది గంటలై పోయింది కరోనా బయటకు వచ్చి.
 on Android

0/Post a Comment/Comments