పిల్లల మనసు గ్రహించాలి

పిల్లల మనసు గ్రహించాలి




పిల్లల మనసు గ్రహించాలి 

                   డా.. కందేపి రాణీప్రసాద్.
సునీల్, సుష్మ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ మంచి ప్యాకేజి లో ఫేమస్ కంపెనీలో టీం లీడర్లు గా పని చేస్తున్నారు. హైదరాబాద్ లో మంచి ప్లాట్ కొనుక్కున్నారు. భార్యాభర్తలిద్దరూ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్ళాలని ఆరాట పడతారు. చదువుల్లో కూడా ఎక్కడ రాజీ పడలేదు. ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం, పేరున్న కాలేజిలో బిటెక్ లు చదవడం, క్యాంపస్ సెలక్షన్ లోనే ఉద్యోగాల్లో సెటిలవడం అంతావరసగా జరిగిపోయాయి. కాలేజిలో పరిచయాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. వారికో పాప పుట్టింది. మంచి స్కూల్లో వేశారు.

ఇద్దరూ అఫిసుల్లోనే ఎక్కువ కాలం గడుపుతారని, అటువైపు వాళ్ళు గానీ, ఇటువైపు వాళ్ళు గానీ వారింటికి రారు. వీళ్ళకి ఎవరూ రాలేదని బెంగ లేదు. ఉన్న ఒక్క పాపనూ బాగా చదివించాలని సెంట్రల్ స్కూల్లో వేశారు. పాప తమ ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టిందని పాపకు ఆకాంక్ష అని పేరు పెట్టారు. ఒక్కదానికే బాగా ఆస్తి ఇవ్వాలని రెండో వారిని కనలేదు. ఆకాంక్ష హైస్కూలుకు వచ్చింది ఎప్పుడూ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. స్కూల్లో ఉన్నంత సేపు పరవాలేదు. ఇంటికి వస్తే ఎం తోచదు. నెట్ లో గేమ్స్ ఆడుతుంది.

స్కూల్లో జరిగినా విషయాలన్నీ అమ్మకు చెప్పాలనుకుంటుంది కానీ ఆకాంక్ష ఇంటికి వచ్చేసరికి అమ్మ ఉండదు. నాన్నతో కలిసి షటిల్ అడాలనుకుంటుంది . కానీ నాన్న ఆఫీసు నుంచి వచ్చే సరికి రాత్రి అవుతుంది. అప్పుడు ఆడలేదు. నాన్న వస్తూనే షూస్ కూడా విప్పకుండా బెడ్ పై వాలి పోతాడు. అమ్మ ముందే వస్తుంది కానీ వంట చేసుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆకాంక్ష హోంవర్కు చేసుకుంటూ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి సుష్మ ఆకాంక్ష వైపు చూసి "దాదా! ఈ చాక్లెట్ తీసుకుని వెళ్ళు. ఈ రోజు నా ఫ్రెండ్ అమెరికా నుంచి తెచ్చింది" అని ఇస్తూ తన పనిలో తను మునిగి పోతుంది. ఆకాంక్ష అలా చదువుకుంటూ హాల్ లో సోఫా లోనే నిద్ర పోతుంది.
రోజూ ఇలాగె జరుగుతుంది. ఆదివారం వస్తేనన్నా తనతో మాట్లాడతారని చూస్తుంది ఆకాంక్ష. అమ్మ ఫేషియల్ చేయించుకుంటూ, ;బట్టలు ఐరన్ చేసుకుంటూ, వారానికంతా కావాల్సిన సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది. నాన్నేమో కంప్యూటర్ వర్క్ చేసుకొని ఇష్టమైన సినిమాలు సిస్టమ్ లో డౌన్ లోడ్ చేసుకుని చూస్తుంటాడు. తన ఫ్రెండ్ అఖిల లాగా తనకూ ఒక తమ్ముడో, చెల్లోలో ఉంటె బాగుండేది. చక్కగా వాడితో ఆడుకోవచ్చు. అమ్మకు ఆకాంక్షంటే ఎనలేని ప్రేమ. తనకోసమే తన కోసమే సుష్మ చాల డబ్బు కూడబెడుతోంది.

ఆకాంక్షకు వరం రోజుల నుంచి చాలా అసహనంగా ఉన్నది. రోజూ బస్సులో క్లీనర్ కృష్ణ తనను ముట్టుకోవడం ఆకాంక్షకు నచ్చట్లేదు. అమ్మకు చెప్పాలి అనుకుంటోంది. కానీ ఎప్పుడూ చూసినా అమ్మ బిజీగా ఉంటున్నది. నాన్న దగ్గరకు వెళ్ళింది. ' ఏరా బంగారూ' అని పిలిచి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. కాసేపు ఆ విషయం మర్చిపోయి ఆనందంగా నాన్నతో కబుర్లు చెప్పింది. ఎదో ఫోన్ రావడంతో నాన్న లేచి బాల్కనీ లోకి వెళ్ళాడు. ఆకాంక్షకు మళ్ళి దిగులు ఆవరించింది. రేపైనా అమ్మకు చెప్పాలి అనుకోని నిద్రపోయింది.
ఉదయం లేచిన దగ్గర నుంచి రెండు మూడు సార్లు అమ్మకు చెప్పాలని ప్రయత్నించింది. కానీ సుష్మ ఆరోజు త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయింది అర్జెంట్ పనుందంటూ. స్కూలు బస్సు వచ్చే టైమయ్యింది అనుకుంటుంటే ఆకాంక్షకు కోపం చిరాకు ఎక్కువౌతున్నది. చివరకు నాన్నతో నేనిరోజు స్కూలుకు వెళ్ళను' అని చెప్పింది మెల్లగా. సునీల్ "నేనిరోజు ఆఫీసులోనే ఉంటానురా. అమ్మకూడా రాత్రి దాకా రాదు. నీకు ఇంట్లో తోడు ఎవరుంటారు. ప్లీజ్ ఈరోజు వెళ్ళరా స్కూలుకు" అంటూ నచ్చజెప్పి స్కూలు బస్సు ఎక్కించాడు. దిగులుగా దీనంగా ఎం చేయలేక ఆకాంక్ష స్కూలు బస్సు ఎక్కుతూ క్లీనర్ కృష్ణ గాడి కోసం చూసింది. రాకుండా ఉంటె బాగుండనుకుంది. కానీ లాస్ట్ సీటు దగ్గర నిలబడి తననే చూస్తున్నాడని భయపడింది. వాడు మెల్లగా వచ్చి ఆకాంక్ష పక్క సీట్లో కూర్చున్నాడు.
మధ్యాహ్ననికి స్కూలు నుంచి ఫోన్ రావడంతో సునీల్, సుష్మ ఉరుకులు పరుగులతో స్కూలుకు చేరుకున్నారు. స్కూలు దగ్గర పోలీసులు ఉన్నారు. పిల్లలంతా గుమిగూడి ఉన్నారు. గుండెలు బాదుకుంటూ సునీల్ సుష్మ లోపలి అడుగుపెట్టారు. స్కూలు ఆవరణలో రక్తం మడుగులో ఆకాంక్ష పది ఉంది. ఆ దృశ్యం చూడలేక పోయారు సునీల్, సుష్మలు. స్కూలు ప్రిన్సిపాల్ ఒక ఉత్తరం తెచ్చి వారి చేతిలో పెట్టింది. దాంట్లో రెండే ముక్కలు రాసి ఉన్నాయి.
"అమ్మా నాన్నలు చాల బిజీగా ఉంటారు. వాళ్ళకు చాల పనులుంటాయి. నేను ఉండటం వాళ్ళ కెరీర్ కు అడ్డమే కానీ ఏమి ఉపయోగం లేదు. అందుకే నేను చనిపోతున్నాను" అని రాసి ఉన్నది.
" బిల్డింగ్ పై నుంచి దూకేసింది. మేము వచ్చేసరికి ప్రాణం పోయింది" స్కూలు ప్రిన్సిపాల్ చెబుతోంది. ఆమె చెప్తున్నదేమి సునీల్, సుష్మలకు చేవికేక్కటం లేదు. ఆకాంక్ష బేల చూపులే గుర్తు వస్తున్నాయి. 'ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది గానీ తనంతగా శ్రద్ద పెట్టలేక పోయింది' సుష్మ మనసులో అనుకోసాగింది. ఏది ఏమైనా సునీల్, సుష్మలకు భవిష్యత్తు అందకారంగా అనిపించింది.

నీతి:- కెరీర్ ధ్యాసలో పడి జీవితాన్ని పోగొట్టుకుంటున్నవారు ఒక్కసారి ఆలోచించండి. పసిబిడ్డకు అమ్మ ఒడి కన్నా అధ్బుతమేది అవసరం లేదు. లక్షల బ్యాంక్ బాలెన్సులు వారికక్కరలేదు. పిల్లల మనసును గ్రహించండి.
 Mail on Android

0/Post a Comment/Comments