PravahiniSent from 
బాలలను ప్రోత్సహిస్తే ఫలితమెంతో...
                           డా.. కందేపి రాణీప్రసాద్.
చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు. ఒకతల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే క్లాసు చదివే పిల్లలందరికీ ఒకేరకమైన తెలివి తేటలుండవు. అందరూ పిల్లలు అన్ని అంశాలలోను సమానమైన ప్రతిభను ప్రదర్శించరు. ఒకొక్కరికి ఒక్కో అంశం మీద ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నపనిమీద సహజంగానే శ్రద్ధ కనబరచడం వలన దాన్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. అయితే ఇష్టం ఉన్నా, లేకున్నా ప్రతి విద్యార్ధి కొన్ని విషయాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి.
పెద్దలను గౌరవించడం, పరిశుభ్రంగా ఉండటం, చక్కని దస్తూరీతో రాయడం, నలుగురికీ అర్థమయ్యేలా చదవగలగడం, మనలోని భావాలను మంచి భాషతో వెల్లడించగలగడం వంటివి ప్రతివారి జీవితంలో ఎంతో అవసరమైనటువంటివి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు నేర్చుకునే విధంగా ఆ విషయాల పట్ల వారికి ఆసక్తి కలిగించాలి. మనం మంచి ప్రోత్సాహం, తగిన అవకాశాలు ఇవ్వలేగాని ఎంతో అధ్బుతమైన ప్రతిభా కనబరచగలమంటూ ఎందరో చిన్నారులు నిరుపిస్తూనే ఉన్నారు. సాధారణంగా స్కూల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అందులో పాల్గొనటానికి ఎవరెవరో ముందుకొస్తారు? అని పిల్లల్నే అడుగుతారు. నేను చేస్తానంటూ ముందుకు వచ్చిన పిల్లల చేతే పాటలు పాడించడం, డ్యాన్సులు చేయించటం, ఉపన్యాసాలు ఇప్పించడం సాధారణం. చేస్తామంటూ ముందుకు వచ్చిన పిల్లలు అభినందనీయులే. ఈ పిల్లలతో ఒకటికి, రెండు సార్లు కార్యక్రమాలు నిర్వహించడం వలన ఆయా పనుల్లో వారికి అనుభవం వస్తుంది. ఈసారి ఆ పిల్లలతో పాటు, కొంత భయపడే మనస్తత్వం ఉన్నా పిల్లను కూడా కలిపితే వారికి కూడా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మరికొంత మందిలో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉంటుంది. కానీ తాము ఆ పని చేయగలమో లేదో అనే ఉగిసలాట. తరువాత సరిగా చేయలేకపోతే తోటి పిల్లలు నవ్వుతారని, టీచర్లు కోప్పడతారని భయం ఉంటుంది. ఈ కారణంగా వారు ముందుకు రాలేరు. అటువంటప్పుడు టీచర్లు ధైర్యం చెప్పి కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే వారిలో ఆత్మ విశ్వాసం పెరిగి మరొక వాడికే మేమే చేస్తామంటూ వారే ముందుకు వస్తారు. హనుమంతుడంతటి వాడికే పక్కనున్న వారు ప్రోత్సహించేదాకా తన శక్తి తనకు తెలియలేదట. కాబట్టి స్కూళ్ళలో పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి.
స్కూల్లో రోజూ జరిగే ప్రార్థన, నీతి సూత్రాలు చెప్పించడం, శ్లోకాలు, పద్యాలు చదివించటం, క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి క్లాసులోని ప్రతి విద్యార్ధి చేసేలా చూడాలి. స్కూళ్ళలో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారో ముందుగ తల్లిదండ్రులు తెలుసుకొని పిల్లల్ని ఆయా పనులపట్ల ఆకర్షితులయ్యేలా చూడాలి. వీటిని కేవలం తల్లిదండ్రులు మాత్రమే ప్రోత్సహిస్తే సరిపోదు.ఇంట్లో ఎంత ప్రోత్సహించిన పిల్లలకు స్కూల్లోని టిచర్లవద్ద నుండి తగిన సహకారం లభించకపోతే ఉపయోగం ఉండదు. స్టేజీ మీద పెర్ఫార్మ్ చేసేటప్పుడు టీచర్లు పిల్లలకు ముందుగానే తగిన సూచనలిస్తుంటారు. అయినప్పటికీ పిల్లలు స్టేజీ మీద పెర్ ఫార్మ్ చేసేటప్పుడు తప్పులు దొర్లవచ్చు లేదా భయంతో ఏమీ చేయలేకను పోవచ్చు. అలాంటప్పుడు టీచర్లు 'నీకు నిన్నంతా నేర్పించాను కదా! అయినా ఏమిటలా చేయడం' అంటూ మందలించకూడదు. ఇలా చేస్తే ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎంత ప్రోత్సహించినా 'మీకేం తెలుసు'! ఇంట్లో కూర్చుని చెపుతారు. సరిగ్గా చేయకపోతే మా టీచర్లు బాగా కొడతారు. అంటూ పిల్లలు భయంతో వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో... టీచర్లు వివరించి వారి చేతే ఆపని మళ్ళి జరగకుండా చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఉన్నత స్థానాల్లో ఉన్నా ఉద్యోగులు అధికార్లు సైతం స్టేజీ ఫియర్ తో ఉపన్యసించలేని వాళ్ళని ఎంతో మందిని చూస్తుంటాము. అలాగే మంచి భావప్రకటన కలిగిన వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కూడా చూస్తూనే ఉంటాము. ఓల విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలిగిన ఆ విషయాన్ని నలుగురికీ అర్థం అయ్యేలా చెప్పలేక పోవడం వలన విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోవలసి ఉంటుంది.
ఇదే పరిస్థితి ఉద్యోగాలకు ఇంటర్వ్యులు, ఉన్నత చదువులలో 'వైవా'ల వంటివి విద్యార్ధుల్లోని భావ ప్రకటనను వెలికి తీసేటటువంటివే. కాబట్టి చిన్నతనం నుండే పిల్లల్లోని స్టేజీ ఫియర్ ను పోగొట్టటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో నీవేంచేయలేవు. నీకేం రాదు, అని పిల్లల్ని నిరుత్సాహ పరచకుండా "నీవు బాగా చేస్తావు. నీవు చెయ్యగలవు." అని భుజం తట్టి దైర్యం చెబుతూ ముందుకు సాగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు సహకరించాలి. అప్పుడే ప్రతి విద్యార్ధి ప్రతిభావంతుడుగా ఎదుగగలుగుతాడు. విద్యతో పాటు ఇతర రంగాల్లో విలక్షణంగా రాణించగలుగుతాడు.
 Mail on Android

0/Post a Comment/Comments