Pravahini



Sent from 
మా షైనీ స్మృతులు
  డా.. కందేపి రాణీప్రసాద్.
ఇది దాదాపు ఇరవై ఏళ్ల కిందటి ముచ్చట అప్పుడు మా పిల్లలు ఏడాది, రెండేళ్ళ వయసు వాళ్ళు. మాకు ఓ కుక్క పిల్లను పెంచుకోవాలని ఇష్టం. ఈ ఆలోచన వచ్చింది మొదలు వాటి గురించి ఎంక్వైరి మొదలు పెట్టాము. మిత్రుడైన ఓ వెటర్నరి డాక్టరు సలహాతో హైదరాబాదులో మంచి బ్రీడ్స్ దొరుకుతాయని తెలిసి అక్కడికి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసిన్స విషయం ఏమిటంటే ఆ ఇల్లు మా ఊరి మాజీ ఎమ్మెల్యే గారిదని. చాల పెద్దది వాళ్ళ ఇళ్ళు. అక్కడ కుక్కలు మాత్రమే కాదు పక్షులు, కోళ్ళు ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఇన్ని రకాలు ఉన్నాయా సృష్టిలో అనిపించక మానదు. వరుసగా కెనేల్స్ ఉన్నాయి. వాటిలో అల్సేషియన్, లాబ్రడార్ , డాబర్ మాన్, రాట్వీలర్, మొదలైన రకరకాల జాతుల కుక్కలు ఆ కేనెల్స్ లో ఉన్నాయి. ఎంతో అందంగా ఉన్నాయి. వాటన్నింటిని గమనిస్తూ ఇంటి లోపలి వెళ్ళాము. ఎమ్మెల్యే గారి బెడ్ రూం లో ఏసీ ఎదురుగా ఒక అల్సేషియన్ డాగ్ పడుకొని ఉంది. అది ఎత్తుగా, బలంగా, పుష్టిగా ఉన్నది. అక్కడ కూర్చోమన్నారు. కానీ ఆ డాగ్ను చూస్తుంటే భయమేసి బయటికి వచ్చాము. ఆ డాగ్ ఎన్నిసార్లు మిస్ బ్యూటిగా ఎన్నికై అవార్డులు తెచ్చుకుందో వివరించి అక్కడే అలమరలో ఉన్న సర్టిఫికెట్లు చూపించారు. మేము చాల ఆశ్చర్య పోయాం ఇన్ని ప్రైజులు గెలుచుకున్నదా అని. 'ఇప్పుడు దాని పిల్లనే మీ కివ్వబోతున్నాం' అని వాళ్ళు చెప్పగానే సంతోషించాము. కాసేపటికి లోపల్నుంచి ఇరవై రోజులున్న ఓ బుజ్జి కుక్కపిల్లను మా చేతిలో పెట్టారు. అది ఓ గోనె పట్టాలో చుట్టబడి ఉంది. కళ్ళు మూసుకొని ఉంది. ఆ కుక్క పిల్లకు వాళ్ళు అప్పటికే ఇచ్చిన వాక్సిన్ గురించి ఇంకా ఆ తరువాత వెయ్యవలసిన వ్యాక్సిన్ గురించి చెప్పారు. ప్రతిరోజు దానికి ఏ టైముకు పాలు తగించాలో, ఎగ్ ఎప్పుడు పెట్టాలో ఒక డైట్ చార్ట్ ఇచ్చారు. ఇవన్ని చాల కొత్తగా ఉన్నాయి మాకు. ఆ కుక్క పిల్లను అపురూపంగా పట్టుకుని హైదరాబాదు నుండి సిరిసిల్లకు కారులో తెచ్చాం. గోనెపట్టా పొత్తిళ్ళలో ఉన్నా ఆ కుక్క పిల్లను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే దారిలో అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూసింది. గోదుమరంగులో మెరుస్తూ అందంగా ఉన్నది. మేము దీనికి షైనీ అని నామకరణం చేశాం. కెనెల్ సెంటర్ వాళ్ళు ఆ కుక్క పిల్ల డేటాఫ్ బర్త్ సర్టిఫికట్ ఇచ్చారు. ఇంటికొచ్చాక చూస్తే మార్చి 17వ తేది దాని పుట్టిన రోజు. ఈ తారీకు చూడగానే మాకు సంతోషం కలిగింది. మా పిల్లలిద్దరి బర్త్ డేలు మార్చి 7వ తేదీ, మార్చి 18వ తేదీ. వాళ్ళ బర్త్ డేల నెలలోనే ఈ కుక్క పిల్ల బర్త్ డే వచ్చినందుకు ఆనందంగా ఉంది. అప్పటి నుంచీ అది కూడా మా పిల్లలతో పాటే పెరిగి పెద్దదవసాగింది. అందరూ చాల ముద్దుగా చూసుకునేవాళ్ళు.
మేం ఎక్కడా పడుకుంటే దాని పడకా అక్కడే. మేం నేల మీద పడుకుంటే అదీ నేల మీదే, మంచం మీద పడుకుంటే అదీ మంచం మీదే. మా కాళ్ళ దగ్గరగా పక్క వేసి పడుకోబెట్టే వాళ్ళం. కానీ అర్థరాత్రి లేచి చూస్తే పిల్లలిద్దరి మధ్య ఉండేది. అదీ ఎలా అనుకున్నరూ పిల్లలు గనుక మన మీద కాలు వేసి పడుకున్నట్లుగా, షైనీ కూడా పిల్లల మీద ఓ కాలు వేసి పడుకునేది. చలికాలంలో అయితే పిల్లలు దుప్పటి ముసుగేసుకొని పడుకుంటే, తెల్లారి లేచి చూసే సరికి షైనీ కూడా దుప్పట్లో ఉండేది. చాలా లవ్లీగా ఉండేది.
మా పిల్లలు స్వీటీ, మిల్కిలతో షైనీ బాల్ అట ఆడుకొనేది. ఎంత తమాషాగా ఆడేదంటే చూసేవాళ్ళకు నవ్వు ఆగేది కాదు. పిల్లలిద్దరూ చెరోవైపు నిలబడి బాల్ విసిరేసుకుటుంటే షైనీ వాళ్ళిద్దరి మధ్యలో నిలబడుతుంది. పిల్లలిద్దరి చేతుల్లోంచి బాల్ అటూఇటూ తిరుగుతుంటే మద్యలో ఉంది బాల్ కింద ఎప్పుడూ ఎఅడుతుండా అని చూస్తుంటుంది. బాల్ కింద పడిందా! నోట కరుచుకొని పారిపోతుంది. మా ఇంటి వెనక పెరడు చాల పెద్దదిగా ఉంటుంది 'బాల్ ఇవ్వు షైనీ!' అని పిల్లలిద్దరు దాని వెంటపడితే దొరకకుండా ఆ ఖాళి ప్రదేశమంతా తిప్పుతుంది. పిల్లలు పరిగెత్తి పరిగెత్తి అలసి పోయి నిలబడితే, షైనీ నోట్లోని బాల్ కిందపెట్టి పిల్లల వైపు చూస్తూ నిలబడుతుంది. "హే, షైనీ బాల్ ఇచ్చింది" అని పిల్లలు దాని దగ్గరకు వెళ్ళగానే మరల బాల్ నోట కరుచుకొని పరుగులు పెడుతుంది. పిల్లలు షైనీ కలిసి ఇల్లంతా ఇలా పరుగులు పెడుతూనే ఉంటారు. పిల్లలు పరుగు ఆపి నిలబడగానే షైనీ నోట్లోని బాల్ కింద పెడుతుంది మళ్ళి వాళ్ళు దగ్గరకు రాగానే బాల్ నోట్లో పెట్టుకొని మళ్ళి పరుగు తీస్తుంది. పిల్లల్ని ఉరికించడం దానికి సరదా. ఇలా పిల్లలతో షైనీ ఎంతసేపైన ఆటలాడుతుంది.
షైనికి మా పిల్లలంటే చాల ప్రేమ. పిల్లలు తోక పట్టుకొని లాగినా, పొరపాటున, కాలు తొక్కినా 'కుయ్' అనేది తప్పితే ఏమీ అనేది కాదు. అదే పామేరియన్ డాగ్ అయితే వెంటనే కరిచేస్తుంది. ఎప్పుడైనా పిల్లలు మరీ విసుగిస్తుంటే 'భౌ భౌ' అని అరచి భయపెట్టేది కానీ అస్సలు కరిచేది కాదు. దాని అరుపులో కూడా కోపం కనిపించేది కాదు. పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లీ ముద్దుగా విసుక్కునట్లుండేది దాని ప్రవర్తన. పొడవైన కుచ్చు తోక ఊపు కుంటూ పిల్లల వెనక బాడిగార్డులా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళేం తింటే అదే తింటుంది. షైనీ కి ఐస్ క్రీములు చాల ఇష్టం.
పిల్లలతో పగలంతా ఇలా ఆటలాడి రాత్రిపూట పిల్లలకు కాపలాగా ఉంటుంది. పిల్లలు మంచం మీద నిద్ర పోతుంటే మంచానికి అనుకోని కింద పడుకొని చూస్తూ ఉంటుంది. పిల్లల్ని పనివాళ్ళు పగటి పూట ఎత్తుకుంటే ఏమీ అనేది కాదు. అదే పనివాళ్ళు రాత్రి పూట పిల్లల్ని ఎత్తుకుందామంటే ఎత్తుకోనిచ్చేది కాదు. నేను పక్కనే ఉంది పనివాళ్ళ చేతికిస్తే అప్పుడు ఊరుకుంటుంది గానీ లేకపోతే ఎవర్ని తాకనివ్వదు. చాలా జాగ్రత్తగా కాపలా కాస్తుంది. అలంటి షైనీ మా ఇంట్లో పదిహేను సంవత్సరాలు మా కుటుంబంలోని సభ్యులతో పాటు తిరిగి ఓ రోజు మమ్మల్ని విడిచి కన్నుమూసింది. కుక్కలా జీవితకాలం 12 నుంచీ 15 సంవత్సరాల కాలమట. అంటే మా షైనీ వంద సంవత్సరాలు బతికినట్లే. 2005 వ సంవత్సరం నవంబరు 2వ తేదీ నాడు చనిపోయినా దాని జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికి నిలిచి ఉంటాయి. షైనీ చనిపోయినా సంఘటన నుంచీ తేరుకోవడానికి మా పిల్లలకు నెలరోజులు పట్టింది. చాల రోజులు ఏడ్చారు.అర్థరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచేవారు. మేము దానికి అంత్యక్రియలు చక్కగా నిర్వహించాం. షైనీ భౌతికంగా మా మధ్య లేకపోయినా దాని స్మృతులు మాత్రం తాజాగా ఉన్నాయి.
 Mail on Android

0/Post a Comment/Comments