Sent from
జీర్ణాశయం కష్టాలు
డా.. కందేపి రాణీప్రసాద్.
టిఫిన్ తిందువు గానీ త్వరగా రా ఆకాష్! అంటూ అమ్మ వంటింట్లోంచి కేక పెట్టింది. యూనిఫాం వేసుకొని టై కట్టుకుంటూ ఆకాష్ డైనింగ్ టేబుల్ దగ్గర కొచ్చి చూశాడు. ప్లేట్లో ఇడ్లి చూడగానే చిరాకు వచ్చింది. "అమ్మా నాకు నూడుల్స్ కావాలి. ఈ ఇడ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పాను" విసుగ్గా అరిచాడు. వంటింట్లోంచి అమ్మ ఆకాష్ దగ్గర కొచ్చి ప్రేమగా తల నిమురుతూ చెప్పింది. " నూడుల్స్ ఒంటికి మంచివి కావురా. రోజూ అదే తింటే కడుపు నొప్పి వస్తుంది నాన్నా. ఇడ్లి చాలా మంచిది. ఇవి తిను కన్నా".
నాకిదేమి వద్దు. మా స్కూల్లో ఎవరూ ఇడ్లీలు దోశలు తినరు. అందరూ పిజ్జాలు, బర్గర్లె తింటారు కోపంగా అన్నాడు ఆకాష్. అంతలో స్కూలు బస్ వచ్చిందని హారన్ కొట్టారు. ' కొంచెం తినమ్మా నీరసం వస్తుంది' అంటూ అమ్మ వెంట బడింది. ఈ లోపు ఇంకో రెండుసార్లు హారన్ మోగింది. ఆకాష్ బ్యాగ్ వేసుకొని ఖాళీ కడుపుతో కోపంగా వెళ్ళిపోయాడు.
క్లాసులో పాఠలు చెబుతున్నారు గానీ ఆకాష్ కి అవేమి ఎక్కటం లేదు. కడుపులో ఆకలి దంచేస్తుంది. పోనీ ఆ ఇడ్లిలన్నాతినేయల్సింది అనుకున్నాడు. అమ్మో ఇలా ఇడ్లీకి ఎడ్జస్ట్ అయిపోతే అమ రోజు అవే పెడుతుంది. అమ్మో అని అసలు తినలేం. కానీ అమ్మేమో " నూడుల్స్ వద్దురా కన్నా లావై పోతావు. ఇప్పటికే ఉండాల్సిన బరువు కన్నా పది కిలోల బరువు ఎక్కువున్నావు. నా మాటిను అంటుంది. ఏమో ఏది అర్థం కావట్లేదు.
స్కూల్లో సైన్స్ మాస్టారు ఈ రోజు జీర్ణాశయం గురించి పాఠం చెబుతున్నారు. మనం తీసుకున్న ఆహారం అరగటానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుండట. మనం ఆహారం తీసుకోగానే ఎంజైమ్స్ యాసిడ్స్ ప్రవేశించి ఆహారాన్ని అరిగేలా చేస్తాయి. సరియైన సమయంలో ఆహారం తీసుకోకపోతే అవే యాసిడ్స్ పొట్టలోని కండల్ని కరిగిస్తాయి. అలా ఆహారం లేకుండా యాసిడ్స్ ఊరటం వలన అల్సర్లు వస్తాయి అయన పాఠం చెబుతున్నాడు గానీ నాకు మాత్రం లంచ్ బెల్ ఎప్పుడూ కొడతారా అనే ఆలోచన ఉన్నది.
సాయంత్రం పిజ్జా అడిగినా అమ్మ కోనిపెట్టలేదు. పాలు తాగమని ఇచ్చింది. ఆకాష్ మనసులో చాల కోపంగా ఉంది. ఆ రోజంతా అలా కోపంగానే గడిచింది. ఆ కోపంతో రాత్రికి ఏమి తినకుండానే నిద్ర పోయాడు. మనసు నిండా ఇవే ఆలోచనలు. కలలో జీర్ణాశయం కన్పించింది. బాగా ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్ళు కారుతూ ఉంది. అదేంటి ఉదయం మాస్టారు పాఠం చెప్పేటప్పుడు బాగానే ఉంది కదా! మెల్లగా దగ్గర కెళ్ళాడు ఆకాష్. ' ఏంటి ఎందుకేడుస్తున్నావు' అన్నాడు మెల్లగా.
జీర్ణాశయం ఏడుస్తూ తన కథను చెప్పనారంభించింది. ఇరవై నాలుగ్గంటలు పనే అవుతుంది నాకీమధ్య. ఇంతకు ముందు రాత్రిపూట ఖాళి ఉండేది. ఇప్పుడు నైట్ షిఫ్టుల మూలంగా ఆ ఖాళి కూడా లేదు. ఎంసెట్లు కోసం పిల్లలు రాత్రి పగలూ చదువుతుండటం వల్ల, బలమని ఎదో ఒకటి తినడం వాళ్ళ నాకు రెస్ట్ లేకుండా పోయింది. ఈ మధ్య నేను పని చేయలేక డీలా పడిపోతున్నాను. నేను కాసేపు పడుకున్నానంటే మీ కడుపులోని పదార్థాలు అలాగే ఉండి కుళ్ళి పోతాయి. కుళ్ళిపోయి వాసనా వచ్చి గ్యాస్ గా మారుతుంది. మీరప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంది అంటూ బాధపడతారు.
" నీకు రెస్ట్ లేకపోవడం వాళ్ళ ఇలాంటి సమస్యలోస్తాయన్న మాట. మరి నీకు కాస్త ఖాళి సమయం ఉంటె చాలన్న మాట" అన్నాడు ఆకాష్.
లేదు బాబూ! మీరు తినే కొన్ని ఆహార పదార్థాలను నేను జీర్ణం చెయ్యలేకపోతున్నాను. నూడుల్స్ అని చైనా నుంచి కొత్తగా వచ్చాయి. వాటిని నేను అరిగించలేకపోతున్నా. నాలో పేరుకు పోయిన నూడుల్స్ ను ఒకబ్బాయి పొట్టలోంచి డాక్టరు ఆపరేషన్ చేసి తీసివేశాడు. అంత కష్టమయింది నాకు. ఈ విషయం వీడియో తీసి ఫేస్ బుక్ లో కూడా పెట్టారు చూశావా నువ్వు. ఇలా జీర్ణశయానికి అంటే నాకు హాని చేసే పదార్థాలు తినకుండా ఉంటే బావుంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి తినవచ్చు గానీ రోజూ అవే తింటుంటారు. అప్పుడు నాకు చాల సమస్యలోస్తాయి. నాకు సమస్యలోస్తే మీకు సమస్యలు వచ్చినట్లే. అనవసరమైన ఆహారం తినటం వల్ల ఒబెసిటి అనే సమస్య కూడా తివ్రమైంది పిల్లల్లో. సరియైన వ్యాయామాలు లేక కూడా మీకు సమస్యలు వస్తున్నాయి. నాకైతే మీరు తిన్నవన్ని అరిగించాలంటే ఎంతో కష్టంగా ఉంటోంది. అంటూ తన కథ చెప్తూనే ఉంది జీర్ణాశయం.
మెలకువ వచ్చినా ఆకాష్ కు జ్ఞానోదయమైంది. జీర్ణాశయాన్ని కష్ట పెట్టే ఆహారం తీసుకోకూడదు అనుకున్నాడు. వెంటనే అమ్మతో చెప్పాడు ' ఇస్=ఇడ్లి చేశావా అమ్మా '! ఆకాష్ ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నాడు.
Mail on Android