నిండైన వెన్నెల వెలుతురు
నిశీధిని కమ్మేసి..
వెండి వెలుగుల సోయగాలను విరజిమ్ముతుంటే..
కాముని దహనం కన్నుల పండుగై
వాడవాడలా వసంతుడి ఆగమనానికి నాంది పలుకుతూ..
జాజిరి పాటలతో కోలలన్నీ కోలాటంతో చిందేసే..
నింగినున్న తారకలన్నీ నేలన చేరి..
సీతాకోకచిలకలైనట్లుగా..
వసంతోత్సవ వేడుకన వయ్యారాలన్నీ సింగారాలతో ఒలకబోస్తుంటే
సప్తవర్ణాలతో ఏకమైన మేను
వర్ణశోభతో ప్రకృతియై మెరియుచుండగా..
పులుముకున్న రంగులన్నీ పులకరింతలకు చోటివ్వగా..
సింగిడి రంగులనలుముకున్న మనసేమో
అందమైన కవితా కన్యకు ఆయువుపోసే...
మదినిండుగా ఊరిన ఊహ
రెక్కలొచ్చిన విహంగమై కదలగా
విహరించే సమయమిదేనని..
సంబరాల సంతోషిగా..
పిన్నాపెద్దలంతా పురివిప్పిన మయూరిలా నాట్యమాడెదరు హోలీ పండగ వేళన...
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*