గద్వాల గేయాలు -శంకర ప్రియ భాష్యాలు' (పుస్తక సమీక్ష)-'బాలమిత్ర' శ్రీ శివ శంకర ప్రియ ,శీల,తూర్పు గోదావరి

గద్వాల గేయాలు -శంకర ప్రియ భాష్యాలు' (పుస్తక సమీక్ష)-'బాలమిత్ర' శ్రీ శివ శంకర ప్రియ ,శీల,తూర్పు గోదావరి

'గద్వాల గేయాలు -శంకర ప్రియ భాష్యాలు'
(పుస్తక సమీక్ష)
------------------------------------
"ఒత్తులతో గేయాలు
హత్తుకొనును హృదయాలు
సత్తువ గల పదార్థాలు
పొత్తు రీతి లాభాలు
        పిల్లలకు ఉపయుక్తం
        పల్లెసీమ సోయగాలు
        ఎల్లరికీ ఆనందం
        మల్లెపూల  పరిమళాలు
యుక్తి,శక్తి పెంచితాయి
రక్తి,భక్తి కల్గిస్తాయి
గద్వాల గేయాలు
దివ్వెల కాంతి కిరణాలు
        కొత్త ఒరవడికి శ్రీకారం
        అత్త ప్రేమ ఆనవాలు
        ఆప్తుల్లా పలకరించు
        అత్తరులా  గుబాళించు"
 అలతి అలతి పదాలతో,అనంత భావాలతో,అమోఘమైన అంత్య ప్రాసలతో  బాలగేయాలు వ్రాయడంలో అందేసిన చేయి బాలసాహిత్య వేత్త గద్వాల సోమన్న గారు. లెక్కలు మేష్టారు అయినా లెక్కకు మించిన బాలగేయాలు  వినూత్న రీతిలో లిఖించి ప్రముఖలచే ప్రశంసలందుకొనుచున్నారు. వీరి ప్రతి గేయం ఆణిముత్యం అనడం అతిశయోక్తి కాదేమో! మాత్ర చంధస్సులో  వివిధ గతులతో, రగడలతో పిల్లలు, పామరులు, అందరూ సులువుగా, రాగయుక్తంగా ఆలపించడానికి అనువుగా ఉంటాయి.
 బాలగేయాలలో క్రొత్తదనానికి పెట్టింది పేరైన గద్వాల సోమన్న గారు మరొక అడుగు ముందుకేసి పద్యాలలో ప్రాస నియమం తలపించేలా దాదాపు అన్నీ "ఒత్తులు గేయాలు"  ముగ్ధమనోరంగా, హృదయాలను హత్తుకొనేలా  మొత్తానికి క్రొవ్వొత్తులా వెలిగించారు. ఇవి ప్రాథమిక స్థాయి పిల్లలకు, ఒత్తుల పదాలు వ్రాసేటప్పుడు, చదివేటప్పుడు తికమకతో ఇబ్బంది పడే అన్ని తరగతుల వారికి చాలా ఉపయోగకరమైనవి. వారి ఒత్తుల గేయాలలో కొన్ని పరిశీలిద్దాం.
"చక్కని చుక్క మా అక్క/కుక్కపిల్లను పెంచింది/మక్కువెంతో చూపింది/చిక్కని పాలు త్రాపింది"  
      అంటూ  అక్కకు, కుక్కపిల్లకు ఉన్న ప్రేమానుబంధం  'క' ఒత్తు గేయంలో విడమరిచి చెప్పారు.
    "మొగ్గలాంటి పాపాయి/సిగ్గుపడుతూ నడిచింది/దగ్గరగా వచ్చింది/బుగ్గకు ముద్దుపెట్టింది" 
     అని పాపాయి సిగ్గు, బుగ్గపై ముద్దు పెట్టిన తీరు హృద్యంగా అభివర్ణించారు.
     "మచ్చల ఆవు వచ్చింది/పచ్చిక కొంత మేసింది/ముచ్చట వేసి వెళ్ళితే!/అచ్చట నుండి కదిలింది"
అని మచ్చల ఆవు, పచ్చిక గురించి భలేగా నుడివారు 'చ' ఒత్తు గేయంలో.
      "విజ్ఞానం శోభస్కరం/అజ్ఞానం అంధకారం/జిజ్ఞాసే అతిమనోహరం/
విజ్ఞతే  సంస్కారం''
      అని 'ఞ'  ఒత్తు గేయంలో విజ్ఞానం, అజ్ఞానం, జిజ్ఞాస, విజ్ఞత వంటి అందమైన పదాలతో కనువిందు చేశారు.
    "జ్యేష్ఠుడు పెద్దోడు/కనిష్ఠుడు చిన్నోడు/నిష్ఠురము కావొద్దు/నిష్ఠ  ఉన్న శ్రేష్ఠుడు" అని  చూడచక్కని పదాలతో 'ఠ' ఒత్తు గేయం సజీవ శిల్పములా చెక్కారు.
    "స్వార్థం కాస్త వీడాలి/సార్థకం బ్రతుకు కావాలి/అర్ధము కల్గి సాగాలి/వ్యర్థం  దవ్వు చేయాలి" 
     అని 'థ' ఒత్తు గేయంలో ప్రబోధించారు.
    'కన్నవారి ఆస్తులు/ఉన్న వారి దుస్తులు/చిన్నారి బాలలు/పన్నీటి జల్లులు" 
       అంటూ పసి పిల్లల గురించి అద్భుతమైన ' న' ఒత్తు గేయం లిఖించారు. 
     స్ఫూర్తి నివ్వని బ్రతుకు?విస్ఫోటనము కడకు/స్ఫురించే  భావాలు/స్ఫటికములా  విదితము/నిష్ఫలం కాదోయి శ్రమ/సత్ఫలితం చేకూర్చును" 
      అని ఇలా అన్ని ఒత్తులపై లయబద్ధంగా పాడుకోడానికి వీలైన రీతిలో నూతన ఒరవడితో చేయి తిరిగిన కవి అని రుజువు చేసుకున్నారు "బాలబంధు"  గద్వాల సోమన్న గారు.
   వీరు కలం హలంతో అక్షర సేద్యం చేస్తూ ఎన్నో బలమైన  పుస్తకాల పంటలు పుష్కలంగా పండించాలని మనసార ఆకాంక్షిస్తూ.. "ముందుమాట" వ్రాయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ..
       -"కవిమిత్ర" శంకర ప్రియ, శీల (v), వయా., గొల్లపాలెం -- 533 468
తూర్పుగోదావరి జిల్లా.

0/Post a Comment/Comments