నగ్గెట్స్
1)మాటలు కోటలు
కట్టిన వేళ,
మనసులు దూరమై
కృష్ణపక్షాలు.
2)అపార్థాలు
మంటలు రేపిన సమయాన,
బంధమే మండుతున్న
రావణకాష్ఠం.
3)అహంభావం
ఆధిపత్యపోరు సల్పే క్షణాన,
ఒంటరితనం
వెక్కిరిస్తుంది.
4)పట్టింపులు
లక్ష్మణ రేఖలు దాటి,
లాక్షాగృహాలై
బూడిద మిగులుతున్నది.
5)మూర్ఖత్వం ముసుగేస్తే
సత్యమే శాశ్వతంగా,
నిద్రను ఆశ్రయించి
కడకు అంతర్ధానమైంది.
6)ప్రేమ ఖరీదు
గగనకుసుమం కాక,
ఇచ్చేవారి కోసం
అంగలారుస్తున్నది.
7)సాహచర్యం సమానత్వం కోసం
పరితపిస్తూ,
స్వాతిచినుకుకై ఎదురుచూస్తున్నది.
8)కదిలే మేఘమేమో
వెతుకుతున్నది
ఫలించే శక్తి ఉన్న
సుక్షేత్రం కోసం.
9)కాలే చితి జ్వాలలు
గర్వాల పురికొసలను తెంపుతుంటే,
జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది.
10)జ్ఞానం ఉక్కిరిబిక్కిరై
కాలాన్ని దాటుతుంటే,
అనుభవం పాఠమై
పరిహసిస్తున్నది.