*ఒక మాట*
*ఒక బాణం*
*ఒక భార్య...*
అందరి బంధువై
ఆదుకునే ప్రభువైనా..
తండ్రికిచ్చిన మాటకై
కానలకేగే సీతాసమేతుడు..
కోదండమే ఆస్తిగా భావించి
కొనసాగించినయానంన లక్ష్మణుడూ నడిచే తోడుగా...
అరణ్యకాలంన అలసట తీరేవేళ..
కాలం చేసిన తండ్రికై
కడు దుఖంతో...
నడయాడిన చోటే
ఇల్లందు పలుకులతో పితృతర్పణ చేసి..
వెలిసెనచటనే జగతినేలిన ఆదర్శమూర్తుడు శ్రీరామచంద్రుడు..
పాంచరాత్ర ఆగమానుసారంగా
పంచ కలశ చక్రాదులే గోపురంపై నిలువగా..
సమరసానందసీమల్లో నడిచే భక్తుల
తీరని కోరికల తోరణాలను తీర్చే
సర్వజన రక్షకుడు లోకాభిరాముడు...
దర్శించినంతనే జన్మజన్మాంత సుకృతమయ్యే..
రామకోటి ప్రతులు నిక్షిప్తం చేసిన చోటనే
రామస్థూపం వెలిసే..
అంతరాలలో రామనామం తన్మయానందాన్నీ నిలుపుతు భక్తిరస భావం బతుకుకూ తోడవుతుందచట..
ఏకాంత సేవయందు అద్దాలమేడలో
తనను తానూ చూసుకుంటూ
ఊయలందు ఊహల్లో తేలుతూ..
మురిసిపోతున్న అందాల సీతారాముడు అందరి బాధలను బాపుతున్నాడచటనే...
ముకిలిత హస్తాలతో..
రామసుధా మధువును పంచుతూ
అభయాస్తంతో..
రామపాదసేవా దురందరుడు
హనుమంతుడూ కొలువైనాడిచటనే..
గణపతి తోడుగా
నమక చమక అభిషేక ఆరాధనలలో
రామలింగేశ్వరుడి దర్శనం సర్వపాప హరణం..
శ్రీరామ నవమి వేళ
ముత్యాల,గోటి తలంబ్రాలతో పులకించి కోటివరాలనిచ్చే
కళ్యాణ సీతారాములను చూసిన
కనులకు పండుగే పండగ...
హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి నొంది
అపరభద్రాద్రియై వెలుగొందుతోందీ
ఇల్లందకుంట పుణ్యక్షేత్రం...
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.