విశిష్టత

విశిష్టత

నేటి నుండి చైత్రమాసం

*చైత్ర మాసం విశిష్టత*

*"ఋతూనాం కుసుమాకరాం"* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.
ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.

ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.

పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు
సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 

చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.

చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.

చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 
పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.
అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.

చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.

చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.

చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.
ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాము.
ధర్మోరక్షితే రక్షతః

ఉమశేషారావు వైద్య

0/Post a Comment/Comments