మార్గదర్శకుడు పూలే

మార్గదర్శకుడు పూలే

సామాజిక విప్లవ కర్త...బడుగు వర్గాల ఆశాజ్యోతి

ఆధునిక యుగ నిర్మాతగా, దార్శనికునిగా జ్యోతిబా ఫూలే వ్యక్తిత్వం సమాజాన్ని ప్రభావితం చేసింది. భవిష్యత్‌ మార్గాన్ని నిర్దేశించింది. సమాజంలో వేళ్ళూనుకున్న ఛాందస విధానాలను ప్రశ్నిస్తూ వంచన విధానాలను ఎత్తి చూపటంలో సఫలీకృతు డయ్యారు. అగ్రకుల అణచివేతలను, అధర్మ నీతులను ఏకరువు పెట్టారు.  ప్రజలను చైతన్య పరచడానికి శాయశక్తులా కృషిచేశారు. విప్లవాత్మక ఆలోచనలను, యదార్థ జీవన చిత్రాలను సామాన్య ప్రజలకు పరిచయం చేశారు. సమాజ వికాసానికి అడ్డంకిగా ఉన్న బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి అదే అగ్రవర్ణాలలో నిరాదరణకు గురైన మహిళల కోసం ఆశ్రమాన్ని స్థాపించి వారికి బాసటగా నిలిచారు. సనాతన వాదాన్ని ప్రచారం చేసే అగ్రవర్ణాలవారు శూద్ర, అతిశూద్రులను ఏవిధంగా దోచుకున్నదీ వివరించారు. సమకాలీన సందర్భాలను చెబుతూ చారిత్రక సత్యాలతో ''గులాంగిరీ''ని రచించారు. 1873లో వెలువడిన ఈ రచనలో మొత్తం 16 భాగాలున్నాయి. ప్రతి భాగంలోనూ సామాజిక కోణం ఉట్టిపడేట్లు రచన సాగింది. మూఢనమ్మకాల వైపు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసిన ఇతిహాసాలను కాలాను గుణంగా వివరించి గతం తాలూకూ వాస్తవాలను జోడించ టంలో సఫలీకృతులయ్యారు ఫూలే.  పుస్తకాలు ఆకాశం నుంచి భూమ్మీద పడ్డాయనే అంధ విశ్వాసపు మోసపూరిత ముసుగులను తొలగించిన ధీశాలి ఆయన. 1882లో 'షేత్‌ కార్యాచ అసుద్‌' (తెలుగులో సేద్యగాని చర్నాకోలు) అనే పుస్తకాన్ని ప్రచురించారు. శూద్ర రైతాంగాన్ని బ్రిటీష్‌, అగ్రవర్ణాల వారు ఉమ్మడిగా దోచుకుంటున్న తీరు ఆ రచనలో సాగింది. నూతన వ్యవసాయ పద్ధతుల్లో పంట పండించి శాస్త్రీయంగా వ్యవసాయం చేసే విధానానికి సంబంధించి రైతులకు శిక్షణనిచ్చారు. 1882 నుంచే రైతులకు సంబంధించిన ప్రజా బహిరంగ సభలను నిర్వహించారు. రైతు సమస్యలపై విస్తృతమైన చర్చలు జరిపిన ఈ సభలు దాదాపు 83 జరిగాయి. ''రైతుల చిట్టా'' పేరుతో ప్రచురితమైన పుస్తకం ఫూలే ఆలోచనల్లోని అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది. ''తృతీయ రత్న'' నాటిక సామాన్య జనంలో చిరస్థాయిగా నిలిచి పోయింది. సామాజిక పురోభివృద్ధి కాంక్షే ఆయన ప్రతి అడుగులోనూ ప్రతిబింబించింది.
మద్యం షాపులు ఏర్పాటు చేయటాన్ని, మద్యం మత్తులో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవటాన్ని వ్యతిరేకించారు. 1873లో ''సత్యశోధక్‌'' సమాజాన్ని స్థాపించారు. చాతుర్వర్ణ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించారు. రైతుల, కార్మికుల సమస్యలపై విస్తృతంగా పనిచేయటంలోనూ, మానవీయ విలువల్ని బోధిస్తూ యదార్థ మార్గాలను చూపడంలోనూ దీని పాత్ర కీలకంగా నిలిచింది. సత్యాగ్రహ ఉద్యమాన్ని మొట్టమొదట ఆచరణలో పెట్టిన మహనీయుడు జ్యోతీబా. స్త్రీలు, రైతులు, కార్మికులు, శ్రామికులు, శూద్ర, అతిశూద్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఆలోచించి సమస్యల పరిష్కారానికి సత్యాగ్రహోద్యమం అనే ప్రతిఘటనోద్యమాన్ని ఎన్నడో ఆచరించి చూపారు. స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది. స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన వారిలో ఫూలే అగ్రగణ్యుడు. ఆంక్షల వలయంలో చిక్కుబడి ఉన్న స్త్రీకి అక్షరాలను నేర్పి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించిన ఘనత జ్యోతీబా ఫూలేకే దక్కుతుంది. స్త్రీల విద్య కోసం 1848లో బాలికా విద్యా పాఠశాలను స్థాపించారు. మహిళా ఉపాధ్యాయురాలి అవసరాన్ని గుర్తించి తన భార్యకు అక్షరాభ్యాసం చేసి పాఠాలు చెప్పించిన మహోన్నత మూర్తి ఆయన. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తింపబడే ఘనతను తన భార్యకు అందించిన సమానత్వ స్థాపకుడాయన. చదువు జ్ఞానాన్ని ఇస్తుందని, జ్ఞానం సంస్కారాన్ని ఇస్తుందని నమ్మిన వాడు ఫూలే. విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట కృషిని గౌరవిస్తూ 1852లో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను రెండు దుశ్శాలువాలతో సత్కరించింది. అంతటి గౌరవాన్ని బ్రిటీష్‌ పాలకుల నుంచి అందుకున్న మొదటి, ఆఖరి వ్యక్తి కూడా ఫూలేనే. చదువుపై ఫూలేకి ఉన్న నమ్మకం ఎంత ధృఢమైందంటే రావు బహద్దూర్‌ హరిలాల్‌ జీ ప్రభువైన డ్యూక్‌ ఆఫ్‌ కనాట్‌ గౌరవార్థం ఇచ్చిన విందుకు సాధారణ ముతక దుస్తులు, పైన వేసుకునే అంగ వస్త్రం, కుట్టిన పాత చెప్పులు ధరించి విందు సమావేశానికి హాజరయ్యారు. రాణి మన్ననలు పొందటానికి దేశం అత్యంత సుభిక్షంగా ఉందని ముఖ్యులు చెబుతుండగా జ్యోతి బా కల్పించుకొని ఇక్కడున్న విధంగానే దేశమంతా లేదు. వాస్తవమైన దేశాన్ని చూడదలిస్తే దయచేసి గ్రామాల్లోకి వెళ్ళి రైతుల దారుణమైన జీవన స్థితిగతులను పరిశీలించండి. అధిక సంఖ్యాకులు దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఘనత వహించిన మహారాణి విక్టోరియాకు తెలియజేయండి. నిమ్నకులాల్లో విద్య ద్వారా మాత్రమే మార్పును తీసుకురావటం సాధ్యమవుతుంది. విద్యనందించట
విద్యనందించటం ద్వారా అపారమైన జ్ఞాన సంపదను పొందుతారని మీరామెకు తెలియజేయండి అని విన్నవించారు. ''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు.
ఇంతటి మహోన్నత భావాలను, దూరదృష్టిని కలిగి ఉన్నారు కాబట్టే డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ తన గురువుల్లో ఒకరిగా ఫూలేను ప్రకటించుకున్నారు. కొత్త సమీకరణలు, నవీన ఆలోచనలు జ్యోతిబాలోని విభిన్న కోణాలను స్పృశించటంలో ముందడుగు వేశాయి. ఆయనలోని ఎన్నో అభ్యుదయ భావాలను బయట ప్రపంచానికి ఎలుగెత్తి చాటాయి. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించిన ఫూలే అదే వర్ణంలోని స్త్రీకి పుట్టిన బాలుణ్ణి దత్తత తీసుకొని డాక్టర్‌ను చేశారు. ఈ విపరీత ధోరణులు ఆధునిక వ్యవస్థను కబళించక ముందే, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించక ముందే సామాజిక, దార్శనికుల అడుగు జాడలను అనుసరించాల్సిన అవసరం ఉంది. నిరాకరింపబడుతున్న సమానత్వాన్ని పొందేందుకూ, దూరం చేస్తున్న రిజర్వేషన్లను కొనసాగించుకునేందుకూ, వాస్తవాలను గుర్తించేందుకూ అభ్యదయ మార్గాలను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రను విశ్లేషిస్తూ ఆదర్శవంతమైన భవిష్యత్‌ ప్రణాళికలను ముందుండి నడిపించుకునే తెగువ, సాహసం ప్రదర్శించాలి. అప్పుడే ఫూలే కలలుగన్న సమసమాజాన్ని చూడగలం. ఆధునిక రథసారథులు చూపిన సర్వోన్నత శిఖరాలను చేరగలం.

స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది.''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు.
జయంతులు కాదు జరపడం ఆయన ఆశయాలు మొగ్గుతొడిగి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే ఆయనకు నిజమైన నివాళి
    ఉమశేషారావు వైద్య
      లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments