“ఎర్రమల్లెలు పూయించిన కలలు చెదిరిన కళ్ళు....!”
—కొంపెల్లి రామయ్య(యామిని తేజశ్రీ)
ఉపాధ్యాయులు, కవి, రచయిత, విశ్లేషకులు
ఖమ్మం, 703250464
కాలం మారుతుంటుంది. మారిన కాలంతో పాటు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అవి మంచికి కావచ్చు... చెడుకు కావచ్చు.... కాని చెడును తరిమికొట్టి వాటిలో మంచినే తీసుకోవాలి. మనిషి మౌఖిక భాష నుండి లిఖిత భాష ఏర్పడిన వరకు వచ్చిన అభివృద్ధి ఒక ఎత్తయితే, లిఖిత భాష తరువాత వచ్చిన నూతన ఆవిష్కరణలు మరింత శక్తివంతంగా మానవ మేధస్సును మరింత చురుకుగా, పదునుగా తయారు చేసే ఆధునిక శక్తియుక్తులు లిఖిత సాహిత్యం కలిపించింది చరిత్రలో లిఖిత సాహిత్య ప్రారంభ దశలో తాళపత్ర గ్రంథాలు, తాటాకుల మీద రచనలు ఆ తరువాత కాగితం వినియోగంతో చిన్న చిన్న పత్రికలు గ్రంథాలుగా వెలువడడం చూసాము. అయితే నేను ఈ ప్రస్థావన ఎందుకు తీసుకొచ్చానంటే ప్రస్తుత ఆధునిక కాలంలో కొందరు కవులు తన స్వీయ హస్తాలతో లిఖిత సాహిత్యం రాస్ సాహితీ లోకానికి అందిస్తున్నారు. ఇది ఒకింత ధైర్యం అయినప్పటికి సాహసోపేతమైనదని నేను చెప్పదలచాను. బహుశా నేను అనుకున్నట్లు చెంచాతో కలుపుకొని ఎంత తిన్నా మనకు తిన్నట్లుగా, జిహ్వకు రుచిగా ఉండదు. ఎప్పుడైతే తను తినే ఆహారం ఇష్టంగా కలుపుకొని తన చేతులతో తింటారో అప్పుడు వారు ఆ ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదిస్తారు. అలా తన హృదయం పండించిన పంటని మస్తిష్క యంత్రంలో మరాడించి అగ్నిపర్వత లావా అను మనసు సిరాను కలంలో నింపుకొని స్వహస్తాలతో లిఖించి తన భావజాలమును మనసారా ఆస్వాదిస్తూ, ప్రజల గుండెలకు నేరుగా సాహితీ బాణంతో తాకి చైతన్యపరుస్తున్నారు కొందరు కవులు, అలా చైతన్యపరుస్తున్న కవులలో గుడిసె శ్రీనివాసరావు, జగమెరిగిన ప్రముఖ ప్రజాకవిగా లెనిన్ శ్రీనివాస్ గారు అనడంలో సందేహం లేదు. వారి కలం నుండి జాలువారి ఎర్రమల్లెలు పూయించి అభ్యుదయ భావ పరిమళాలను బాట పట్టించిన లిఖిత కవితా సంపుటియే "కలలు చెదిరిన కళ్ళు". ఒక్కసారి వీరి కవిత్వంలోకి తొంగిచూస్తే.....
"మట్టికాళ్ళు మహాయాత్ర....!" అను తన మొదటి కవితలో
వెలుగెత్తిన అరుణపతాక రణనినాదం.
అసహనం హద్దులు దాటి
ఆకాశం కట్టలు తెంచుకొని
కాళ్ళ బొబ్బలు కదలనివ్వకున్నా
రహదారిపై రక్తపు ధారలు
చరిత్ర పుటలపై ముద్రలై
బిగిసిన పిడికిళ్ళు పిడుగుల వాన" అంటూ..
రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమం చేస్తూ మట్టి మనుషులైన రైతుల పాదాలు రక్తపు ధారలై రహదారులపై చేస్తున్న దండయాత్ర పాదముద్రలకు జేజేలు తెలుపుతూ తన సంఘీభావాన్ని ఎంతో ఉద్వేగంగా తెలియజేసారు. కవి లెనిన్ శ్రీనివాస్.
ఓటుకు కానే కాదు" అను కవితలో "ఓటంటే సంత సరుకు కానే కాదు... దాన్ని అమ్ముకుంటే మనిషివి కానే కాదు?” అంటూ దేశ ప్రగతి పరుగులు పెట్టాలంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే మనం మన ఓటును సంతలో సరుకుగా అమ్ముకోవద్దు. ఒకవేళ మనం అమ్ముకున్నామా మనం మనుషులం కానే కాదని ఓటుహక్కు ఉన్న ప్రతిపౌరున్ని హెచ్చరించి మేల్కొల్పే గట్టి ప్రయత్నం చేసారు కవి.
"అమ్మ భాషే లెస్స...” అను కవితలో
"అమ్మ పిలుపు మాధుర్యం
ఆప్యాయతల అనుబంధం
అమ్మ చేతి ముద్ద లాలిత
సంస్కృతి సంప్రదాయాల సమ్మిళితం" అంటూ అమ్మ భాష అయిన మన తెలుగు భాష మాధుర్యాన్ని, అనుబంధాన్ని, లాలిత్యాన్ని మన సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలంటూ తెలుగుదనం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు కవి.
"మౌనాన్ని భరించలేక....!" అను కవితలో
"అప్పుడప్పుడు అక్కడక్కడ
కసాయి కత్తులు కంఠాలను తెంచుతున్నాయి.
కాని మౌనాన్ని భరించలేని
కలం ఖడ్గాలుగా కనిపించని యుద్ధాలు చేస్తున్నాయి" అంటూ నీతి నిజాయితీలను పక్కకు పెట్టి, మానవతా విలువలు లేకుండా మనిషి మనిషిని దోచుకునే సమాజంపై కవుల కలాలు ఖడ్గాలుగా కనిపించని యుద్ధం చేస్తున్నాయంటూ కవుల చైతన్యస్ఫూర్తిని కొనియాడారు కవి.
"నయనానందం..." అను కవితలో
"అవి నన్ను వరించిన తీరు
అనూహ్య సందర్భం తడుముకున్నప్పుడల్లా
కండ్లు నయాగరా జలపాతాలవుతాయి" అంటూ తనుపొందిన పురస్కారాలు, సత్కారాలు చూసినప్పుడల్లా తనలోని ఆనందభాష్పాలు నయాగరా జలపాతం అవుతాయని, వర్ణిస్తూ తన హృదయ స్పందనను ఎంతో చక్కగా శిల్పీకరించారు కవి.
"నా కల నిజమౌతుందా...?" అను కవితలో
కుక్కిన పేనుల్లా
అణిగి మణిగి ఉంటూ
సహనం చచ్చిన మనుషుల్లా
బ్రతికున్న జీవచ్ఛవాలుగా కాదు.
నిలబడి కలబడే వ్యక్తిత్వం కావాలి!' అంటూ అంగడి సరుకులా నైతిక విలువలు అమ్ముడుపోతున్నాయంటారు.
శ్రీ శ్రీ. కవిత్వ ధోరణిలో సామాజిక రుగ్మతలపై తను కవనాస్త్రం వదిలి పెడుతూ నా కల నిజమౌతుందా? అంటూ తనకు తనే ప్రశ్నించుకుంటూ ప్రేరణ కల్పించారు కవి.
"మృత్యు ముఖద్వారాలు" అను కవితలో "కాలం నిర్మించిన కత్తుల వంతెనలు నోళ్ళు తెరిచి నాలుక చాస్తుంది" అంటూ వాహన చోదకులు మద్యం సేవించి నిర్లక్ష్యపు వేగంతో ప్రమాదానికి గురై చనిపోతున్నారని రేపటి మన భారత నిర్మాతలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు కవి.
"వెన్నెలంత చల్లనిది" అను కవితలో
"కారు చీకట్లను చీల్చే కిరణం కలతలను రూపుమాపే పవిత్ర స్నేహం
వెన్నెలంత చల్లనిది" అంటూ స్నేహం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు దృశ్యీకరించారు. ఇక ఓడిపోవడానికి సిద్ధంగా లేను...? అను కవితలో
సంక్షేమానికి చేయూత నిచ్చేవారిని
నీళ్ళలో చేపలా జనంలోని నేతను
గెలిపిస్తా! నా ఓటును వజ్రాయుధం చేస్తా...! అంటూ
ఎవరైతే సమాజ క్షేమాన్ని కోరి సంక్షేమానికి చేయూతనిస్తారో ఊసరవెల్లి నాయకులకు స్వస్తిపలికి... సిద్ధాంతానికి కట్టుబడి నిలుస్తారో వారిని నేను నా ఓటు అనే ఆయుధంతో గెలిపిస్తా నంటూ నిక్కచ్చిగా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతారు కవి.
“విప్లవసూర్యుడు "చే""" అను కవితలో ఉద్యమ తొలిపొద్దు సూర్యుడు చరిత్ర మరవని మరో ప్రపంచ వీరుడు చేగువేరా జోహార్.... జోహార్....! అంటూ చేగువేరా ధైర్య సాహసాలను, అతని ఉద్యమ తీరును, త్యాగనిరతిని కొనియాడుతూ జోహార్లు తెలిపారు కవి.
చైతన్యం కానంత కాలం... అను కవితలో
"తప్పించబడిందో తెలియదు గాని
జీవన విధానం దుర్భరం
చైతన్యం కానంత కాలం
కోలుకోలేని కోమాలోనే దేహ సమాజం! అంటూ ప్రస్తుత పరిస్థితులను ఎంతో చక్కగా వివరించారు కవి లెనిన్ శ్రీనివాస్,
“నూరేళ్ళ చరిత్ర" అను కవితలో
మార్మోగిన వందేమాతర నినాదం
మరఫిరంగుల మార్మోత
కనురెప్ప పాటులో విరుచుకు పడ్డ
మరణమృదంగం - రక్తసిక్తమైన మైదానం! అంటూ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగి 100 సం॥ నిండిన సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేసారు కవి.
తపించే శ్వాసనన్నా...! అను కవితలో
"కలతలలో కన్నీళ్ళల్లో
కలవరింతల్లో పలవరింతల్లో జయాపజయాలలో
చేయూత నాన్న ఓదార్పు నాన్న” అంటూ
నాన్న యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లుగా దృశ్యీకరించారు కవి.
"జయహో ప్రజా పోరాటాలు...!" అను కవితలో
'న్యాయం కోసం తపించే
కలాలు కవాతు మాత్రం.
త్యాగాల గానమై పల్లవిస్తుంది.
జయహో ప్రజాపోరాటాలంటూ సిరా చేసి రాస్తూనే ఉన్నాయ్... అంటూ చిందిన రక్తపు చుక్కలు సిరాగా చేసి కవుల కలాలు రాస్తూనే ఉ న్నాయంటూ కవి కలం కున్న పోరాట పటిమను కొనియాడారు కవి.
చిందిన రక్తపు చుక్కలు
"రక్తపు అడుగులు...!" అను కవితలో
"సంకలో చంటిది
చేతిలో సంచి
చెప్పులు కూడా లేని కాళ్ళు
నడినెత్తిన నిప్పులు కురిపించే సూర్యుడు
దారిపొడవున్నా రక్తపు అడుగుల ముద్రలు... అంటూ
కరోనా కాలంలో వలస కూలీలకు కూలి దొరకక ఇంటిదారి పట్టిన సందర్భంలో పిల్లా జెల్లా అంతా దారిపొడవున పడ్డ బాధ, రైళ్ళ పట్టాలపై ప్రాణాలు కోల్పోవడం వంటి విషాదకర సంఘటనలపై మానవత్వం పరిమళించిన ఒక కవిగా ఎంతో హృద్యంగా కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు.
ఇవి కాకుండా నీవు తోడుంటే చాలు, భ్రమల్లో బ్రతుకు, మానవతకు సవాల్, ఓఅరుణ పతాకమా, మస్థిష్కంతో చూడు తదితర కవితలు సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన చైతన్యబాణాలు. ఇవి వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఉద్యమస్ఫూర్తిని ఎప్పటికప్పుడు వదలకుండా, వస్తుశిల్పం సామాగ్రిని ఇంకా విస్తృతం చేసుకుంటూ, ప్రయోజనకరమైన కవిత్వం ఇంకా మీ కలం నుండి రావాలని, చక్కని చిక్కని భావాలతో మీ ముందుకు వచ్చిన "కలలు చెదిరిన కళ్ళు" లిఖిత కవితా సంపుటి చదవదగిన గ్రంథం అని తెలియజేస్తూ పాఠకులకు మంచి రచన అందించిన |ప్రజాకవి లెనిన్ శ్రీనివాస్ గారిని ప్రశంసిస్తూ వారి కలం నుండి మరెన్నో రచనలు జాలువారాలని మనసా, వాచా కోరుకుంటున్నాను.
ప్రతులకు :
లెనిన్ శ్రీనివాస్
సాహితీరం
కాచిరాజుగూడెం (పోస్టు & మం.)
ఖమ్మం - గాంధీచౌక్ - 507 003
సెల్ నెం. 9959852154