వచనకవిత

వచనకవిత

శీర్షిక:మా తుజే సలామ్!
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
**********************

ఓ భరతమాత!
నీ కోసం నా అవయవాలన్నీ 
ముక్కలు ముక్కలైనా,
ఈ మట్టిలో కలిసిపోయి విచ్చుకున్న పువ్వునై గుభాళిస్తా!
నీ నదుల్లో నీటినై పారనీ నన్ను,
నీ పొలాల్లో సస్యమై గాలికి కదలనీ నన్ను,
నా ఒంట్లోని ప్రతి నెత్తుటి చుక్కతో  నీ నుదుట తిలకం దిద్దనీ!
ఇదే నా హృదయ నివేదన!
తలలు తెగిపడ్డా,
శత్రువును నిలువరించే అదృష్టం నాకు ఇచ్చావు.
తూటాలు ఛిద్రం చేసినా,
శరీరమంతా కాలిపోయినా,
ఆఖరికి ప్రాణాలే పోయినా,
తల్లీ! నీ ఒడిలో హాయిగా నిద్రిస్తా!
సరిహద్దుల వెంబడి పయనం సాగిస్తూ,
గడ్డకట్టించే మంచును సంతోషంగా అనుభవిస్తూ,
నీకై కాపలా కాస్తా!
ఎంతటి అదృష్టం నాది
ఓ మాతృభూమి!
నీ ఒడిలో శాశ్వత నిద్ర దొరకడం!
నీ రక్షణకై నా ఈ మేను కవచమై నిలుస్తుంది.
ఈ మట్టిలో వీరమరణం 
నా జీవన సార్థక్యమే.
నా అణువణువునా నీ రూపమే నిండగా,
నీకై శ్వాస ఆనందంగా విడుస్తా!

0/Post a Comment/Comments