తీగకు కాయ బరువౌతోందా...?

తీగకు కాయ బరువౌతోందా...?

      మాతృదినోత్సవం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని ప్రేమలు కురిపిస్తూ కవితలు,కథలు అభినందనలు కుమ్మరిస్తారు.ఒకప్పుడు గోరు ముద్దలు తినిపిస్తూ జోల పాటలతో లాలించిన అనురాగమూర్తి నేడు కంటికి కనబడడంలేదు.కొన్ని సంఘటనలను చూస్తే తల్లి అనే పదానికి పర్యాయ పదమైనా వెతుకుదామంటే కరువుగానే కనబడుతుంది.
     సృష్టికి మూలం తల్లిదండ్రులు వారు వేసిన బాటలోనే పిల్లలు పయనిస్తారు.ఆ విషయాన్ని మరచిన కల్మషమైన మాతృప్రేమ నేడు అడుగడుగున దర్శనమిస్తూ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తోంది.పెరిగిన నగరీకరణ,పెరిగిన పాశ్చాత్య ధోరణులు నేటి మహిళలను అమితంగా ఆకర్షిస్తూ కుటుంబ బాధ్యతల నుండి దూరంగా ఉంచుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్చినమై చిన్న కుటుంబాలు అధికమై సంపాదనే లక్ష్యంగా ఉండి పిల్లలకు తల్లి ప్రేమను పంచాల్సిన కొంతమంది మాతృ దేవతలు పిల్లలను దూరం పెట్టి తల్లి ప్రేమంటేనే తెలియకుండాపెంచుతున్నారు.పిల్లలకు గోరుముద్దలు తినిపించాల్సిన తల్లులు పబ్బుల్లో,క్లబ్బుల్లో చిందేస్తున్నారంటే ఆశ్చర్యం లేని పరిస్థితి నేడు దాపురించింది. మరికొందరైతే మానవత్వం మరిచి మాతృత్వం విలువ అంటేనే తెలియదంటూ దాటవేస్తున్నారు.స్వార్థంతో అందం చెడుతుందని పిల్లల్ని కనకుండా ఉండే వాళ్ళు కొందరైతే కన్నాక కూడా ఆలనాపాలనా మరచిన తల్లులెందరో ఉన్నారు.జంతువుల్లో ఉన్నా మాతృహృదయం నేటి సమాజంలోని మనుషిలో లోపించిందా అన్న తీరు కనబడుతోంది.జాతి వైర్యం మరిచి ఆవులు పందులకు పాలు పడుతున్నాయి,కుక్కలు గొర్రెలకు పాలు పడుతున్నాయి.కానీ తన కడుపున పుట్టిన పిల్లలకు మాత్రం పాలు పట్టుటకు ససేమిరా అంటున్నారు కొంతమంది తల్లులు.
      వివాహం కాగానే ఒకప్పుడు పిల్లలకై ఎదురుచూసేవారు. కాస్త ఆలస్యం అయితే వారు తిరగని గోపురం, ఆసుపత్రి ఉండేది కాదు. కానీ నేడు కళ్లు తెరవని పసికూనలను కూడా చిదిమేసే తల్లులు ఎక్కువయ్యారు.జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలంటూ పిల్లలు వారి సరదా జీవితానికి అడ్డం అనుకునే ప్రబుద్ధులు ఎక్కువయ్యారు.ఇక పురిటి నొప్పుల బాధ తెలియకుండానే పిల్లల్నిపురిటిలోనే అంత మయ్యేలా చెత్త కుప్పల్లో పడవేసి మాతృ హృదయానికి మచ్చలు తెస్తున్న వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. అమ్మ ఒడే ఆది గురువుగా మేధావులెందరినో తయారు చేసిన తల్లులు ఎందరో ఒకప్పుడు కానీ.. నేడు అన్నీ చదువులు చదువుకున్న అమ్మ తన పిల్లలకు చదువులు చెప్పుకోడానికి నామోషీగా ఫీలవుతోంది.తన పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించే క్రమంలో తన స్టేటస్ ను మాత్రం బయట తెలియ చెప్తోంది గొప్పగా.పిల్లలకు పసి ప్రాయం నుండే ట్యూషన్స్,హాస్టల్స్ పేరిట దూరంగా పెట్టి కనీసం తల్లి ప్రేమను సైతం పంచకుండా బిల్డప్ లకు పోతోంది మాతృహృదయం. మా పిల్లలకు సంవత్సరానికి ఇన్ని లక్షలకు పైగా ఫీజు కట్టి చదువు చెప్పిస్తున్నామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది నేటి తల్లి.
        ఇక కొంతమంది తల్లులు చివరకు పిల్లలపై కరుణ ఆప్యాయతలను మరిచి అస్తమానం టీవీ సీరియల్ చూస్తూ సెల్ఫోన్తో తేలియాడుతూ పిల్లలను దగ్గరకు రానీయకుండా కఠినమైన ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు.ఇలా ఆడంబరాలని అధికంగా ప్రదర్శించే నేటి తల్లి హృదయంలో పిల్లల మంచిచెడ్డలకు స్థానం లేకుండా పోతోంది.దీనితో మారుతున్న సమాజంలో మత్తుమందులు,మద్యం ఇంకా ఎన్నెన్నో చిన్న వయసులోనే పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నాయి.పిల్లల జీవితం చింద్రం అయ్యాక అప్పుడు తల్లి మనసు నిద్ర లేస్తోంది.దీంతో తన పిల్లలే తనపై కక్ష కడుతున్నారు.తల్లికే రక్షణ లేకుండా పోతోంది.నోటికొచ్చినట్లుగా ధూషించే పిల్లలు కొందరైతే కడతేర్చిన వారు కూడా కొందరున్నారు.ఇదంతా గ్రహించని నేటి తల్లి
తన వైఫల్యమే,తన బాధ్యత రాహిత్యమే ఇంతటికీ కారణమని తెలుసుకున్న క్షణాన బోరుమంటూ విలపిస్తోంది జరగాల్సిన నష్టం అంతా జరిగాక.ఈ పరిస్థితి అంతా తీగకు కాయ బరువౌతుంది అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి.మొక్కగా ఉన్నప్పుడు మలచని మాతృహృదయం మ్రానైనాక మాత్రం ఇంకేం చేస్తుంది చూస్తూ ఉండడం తప్ప.తన పిల్లల్ని తానే తప్పు పడుతోంది.కానీ తనను తానే తన పెంపకాన్ని తప్పు పట్టుకుంటున్నా అనే విషయాన్ని మాత్రం గ్రహించ లేకుండా పోతోంది.
    ఇప్పటికైనా కొంతమంది తల్లులు కళ్ళు తెరిచి తమ పిల్లలను సక్రమమైన దారిలో పెట్టుటకు తమ స్వార్థాన్ని కొంత వీడి పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సఫలీకృతం కావాలి. మాతృ దినోత్సవానికి సార్ధకతను తీసుకురావాలి. అప్పుడే సమాజంలోని తల్లులందరికీ కూడా ఒక గొప్ప స్థానం లభించినట్లు అవుతుంది.

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments