*చైతన్యపు వెలుగు కావాలి నువ్వే* శ్రీలతరమేశ్

*చైతన్యపు వెలుగు కావాలి నువ్వే* శ్రీలతరమేశ్


*చెరిగిపోని పొద్దుపొడుపిక నాకే సొంతమైందని*
*ఉద్యమాల పురిటిగడ్డపై చెట్టూ పుట్టా పరిమళిస్తున్నాయి సంబరాలతో..*
కానీ..
ఎక్కడ వేసిన గొంగలి ఆక్కడనే ఉంది..

అందుకే..
*నీడనిచ్చే చెట్టోలే ఎదగాలి నువ్వు*
*పండ్లనిచ్చే ప్రతికొమ్మా రెమ్మా కావాలి నువ్వే..*

కర్పూర హారతిలా బతుకులను
ఆత్మబలిదానాలతో అర్పించే ఆ రోజులు మళ్ళీ రావద్దు..
తనయుల కొరకు తల్లడిల్లే
ఏ తల్లి కంట్లో కన్నీరు  ఒలకొద్దిక..

నిత్యం ఉదయించే సూర్యుడివై
జగతిన చైతన్యపు వెలుగు రేఖల్ని పరిచి
కోటి ఆశలతో క్రొంగొత్తగా ఊపిరి పోసుకున్న తెలంగాణలో..
నింగినేలంతా సంబరపడేలా
పొంగిపొర్లుతున్నా ఆత్మవిశ్వాసం నీ తోడు నడవగా..
పసిడి కాంతులు బతుకుల నిలుపుటకు
నీ ప్రతి కదలిక అభివృద్ధి వైపుగా ఉరకలెత్తాలి...
నీ ప్రతి అడుగు నిత్యనూతనమైన ఆణిముత్యాల్లా..
సాధించుకున్న తెలంగాణ తల్లికి తీరొక్క కంఠాభరణాలై మెరవాలి..

ఊడలమర్రివై ఉపాధి మార్గాలెన్నో సృష్టించి..
ఉవ్వెత్తున ఎగిసిపడి అలుపన్నది లేని సముద్ర కెరటమై సాగుతూ...
దోపిడీ విధానాలకు చరమగీతం పాడుతూ..
ఆకాశమంటి గొడుగు నువ్వే కావాలి..

*చెరిగిపోని పొద్దుపొడుపిక నాకే సొంతమైందని*
*ఉద్యమాల పురిటిగడ్డపై చెట్టూ పుట్టా పరిమళిస్తున్నాయి సంబరాలతో..*


*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్*

0/Post a Comment/Comments