*జ్ఞాన జ్యోతులకు వందనం*(హుజురాబాద్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా..

*జ్ఞాన జ్యోతులకు వందనం*(హుజురాబాద్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా..

అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి..
ముప్తై వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది
స్నేహపరిమళాలతో ఆనందంగా...

పసి ప్రాయపు జీవన ఉషోదయపు వాకిళ్ళలో
జ్ఞాన బీజాలెన్నో చల్లుతూ
అక్షరాల ఆలింగనంతో
నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు
కుసుమ వందనాలు..

మనసు పొరల్లో దాగిన ఆ పాత మధురజ్ఞాపకాలను తడిమి చూస్తే..
ఆర్థికాన్ని అవపోసన పట్టి
ఆ సారాన్ని  మా జీవితాల్లోకి  ఒంపి..
ఆదాయ వ్యయాలనే కాదు
అత్యుత్తమంగా జీవించాలనే ఆత్మస్థైర్యాన్నిచ్చిన
గురువు మహేందరుడికి వందనములు..

బ్రతుకును సన్మార్గంలో పయనింప చేయుటకు
సమాజాన్ని పరిచయం చేస్తూ..
హక్కులను,బాధ్యతలను నేర్పుగా చెప్పి
చెక్కు చెదరని తన దరహాసాన్ని నేటికీని పదిలపరుచుకున్న
గురువు రామమూర్తికి నమస్సులు...

నాడు రాజ్యమేలిన రాజును తలపిస్తూ
కాలగర్భంలో కలిసిన అద్భుతాలెన్నింటినో..
అత్యద్భుతమైన వాక్చాతుర్యంతో
నాటి చారిత్రక వైభవాలను 
దృశ్యీకరణ చేయించిన గురువు రాంకిషన్ కు వందనములు...

అతను పాఠం చెపుతుంటే
సుద్దముక్క నాట్యమాడిన నల్లబల్ల కూడా మురిసిపోతుంది
కొండనద్దమందు గొప్పగా చూపు
గురువు రాజయ్యకు వందనములు...

కమ్మటి స్వర మాధుర్యంతో
పద్యమునెత్తుకున్న తీరు
పాఠమంటే ఇదియేనని..
తెలుగంటే ప్రీతియనిపించి
వినువీధులెంటా..
కనబడకుండా సాగిపోయిన
గురువు సారంగపాణికి ప్రణామాలు...

తాను చెప్పిన చరిత్ర గతులు
కథలు కథలుగా
ఇప్పటికీ కనుల ముందు కదలాడించి..
అందనంత దూరానికి
అనంత మేఘాల చాటుకు వెళ్ళిపోయిన
గురువు వాసుదేవుడికి నమస్సులు...

మమకారపు తెలుగును
మదీయ స్వరంతో
మనసుకు హత్తుకునేలా 
తెలుగుభాష తియ్యదనాన్ని 
రుచి చూపిన గురువు జనార్దనుడికి ప్రణామాలు...

ఆంగ్లపదాలనెంతో అణుకువగా ఒడిసిపట్టి
ఆప్యాయతకు నిలువుటద్దంపట్టి
మెలకువలతో సులభరీతి బోధకుడుగా
గురువు లక్ష్మణాచారికి వందనములు..

ఇంకా..
నాటి జ్ఞాన క్షేత్ర సారథులు
శాతవాహన కళాశాల అధిపతులు
గోపాల్ రెడ్డి,మల్లారావు ,నందన్ గురువర్యులందరికీ అభివందనాలు..

అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి..
అందుకే..
ముప్పై వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు
ఆహ్వానిస్తోంది స్నేహపరిమళాలతో ఆనందంగా...

నింగినేల సాక్షిగా
నీడలా నడిచే మన సోపతి
స్నేహ రాగమందు పల్లవి చరణాలుగా..
అంతరాలెరగని ఆకాశంలా..
స్నేహహస్తమే కొండంత దైర్యంగా..
కల్మషమంటని జగానా
సంబరాలెన్నో కాకెంగిలి తోడుగా..
సాగిపోయే అపూర్వ బంధమై.
ఎన్నటికీ వాడని సుమాల హారమై మెరియగా..
ఇక కరిగేటి కాలం ఒడిలో
చెరగని జ్ఞాపకాల నీడల్లో..
అలనాటి శ్రీకృష్ణ కుచేల బంధమే కదా..

అందుకే..
ఈ సంతోషపు సమయాన
నేడు కొన్ని రంగు రంగుల సీతాకోక చిలుకలు
తాము సేవించిన అక్షరామృతాన్ని
జ్ఞాపకాల ఒడిలో తీపి ఊటలుగా ఆస్వాదిస్తున్నాయి..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments