లింగం- శివలింగం.(వ్యాసం). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

లింగం- శివలింగం.(వ్యాసం). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

లింగం-శివలింగం. (వ్యాసం)
----------&&&&&-----------------
శివలింగాన్ని ఆరాధించే భక్తులు మొదట లింగం అంటే ఏమిటో చక్కగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం లేని ఆరాధన, జ్ఞానము లేని భక్తి సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. కావున ముందు లింగం అంటే ఏమిటో శ్రవణం చేయాలి.
       లింగం అనుపదంలో రెండు బీజాక్షరములు ఉన్నవి. మొదటిది "లిం"అనే బీజాక్షరం. రెండవది గం"అనే బీజాక్షరం. మన కంటికి కనిపించక ఆవ్యక్తంగా ఉన్న దైవాన్ని "లిం"అంటారు. వ్యక్తం చేసే చిహ్నాన్ని "గం "అంటారు . అవ్యక్తం గా ఉన్న దైవాన్ని వ్యక్తం చేసే చిహ్నమే లింగం, శివలింగం అంటే.
"లయనా లింగ ముచ్యతే"నీలం చేసుకునేది ఏదో దానిని లింగమని అంటారు.
"లీయతే గమ్యతే ఇతి లింగం నిష్క్రమణా ప్రవేశన మిత్యాకాశన్న లింగం"
లయమై, ఆలయమై జనన మరణాలకు ఏది కారణమై ఉన్నదో దానిని లింగమని అంటారు.
"లీయతే ఇతిలింగం"
సర్వం దేనిలో లయిస్తుందో అదే లింగం. మన మనసు దేనియందు లయిస్తే, జీవుడు సాక్షాత్తు శివుడిగా ప్రకాశిస్తాడో ఆ పరంధామమే లింగం. ప్రాణం దేని యందు లయిస్తే. జీవుడు ఆత్మసాక్షాత్కారం పొంది, బ్రహ్మానంద సుఖాన్ని అనుభూతిగా పొందుతాడో ఆ పరమపదమే లింగం.
"శివశక్త్యోశ్చ చిహస్య మేలనం లింగ ముచ్యతే"
శివశక్తులన్నీ మమేకమై ఏక రసంగా గోచరింపజేసే చిహ్నమే లింగం.
సూర్యుడు, వెలుగు వేరు కాదు. అలాగే చంద్రుడు, వెన్నెల వేరు కాదు. అదేవిధంగా శివుడు ,శక్తి వేరు కాదు. సూర్యుడు నుండి వెలుగును, చంద్రుని నుండి వెన్నెల ను విభజింపలేము. అదేవిధంగా శివుడిని, శక్తిని విభజింపలేము. అందుకే శివ మహాపురాణం
పీఠమంబామయం సర్వం శివలింగం  చ చిన్మయం.
యథా దేవి ముమామంకే ధృత్వాతిష్ఠతి శంకరమ్.
తథా లింగ మిథునం పీఠం ధృత్వాతిష్టతి సంతతమ్.
ఏవంస్తాప్య మహాలింగం పూజయే దుపచారకైః.
     పీఠం దేవి స్వరూపం. లింగం చిన్మయ స్వరూపం. శంకరుడు పార్వతిని సదా తన అంకంపై ధరించినట్లు లింగం కూడా సదా పీఠంతో కూడి ఉండాలి. లింగాన్ని ఈ విధంగా స్థాపించి పూజించవలెనని తెలిపినది.
శివలింగములలో రెండు భాగాలు .1). లింగం.      2) పీఠిక.
పీఠికనే వేదికయని, పానవట్టమని అంటారు. లింగం పరబ్రహ్మానికి సంకేతమైతే, పీఠిక పరాశక్తికి సంకేతం. అగ్ని యందు దహన శక్తి అంతర్గతంగా ఏ విధంగా ఉంటుందో, శక్తి కూడా ఆ విధంగా శివుడిలో ఉంటుంది. అగ్ని నుండి దహన శక్తిని వేరు చేయడం అసాధ్యం, అసంభవం. అదేవిధంగా శివుడు నుండి శక్తిని వేరు చేయడం అసాధ్యం ,ఆ సంభవం. ఈ జ్ఞానాన్ని బహిర్గతం చేయడం కోసమే పానవట్టం తో సహా లింగాన్ని పూజిస్తారు. అందుకే స్కంద పురాణం
ఆకాశం లింగ మిత్యాహుః పృథ్వి తస్య పీఠికాః 
ఆకాశము లింగంగా, భూమియే వేదికగా బ్రాహ్మండాన్ని ఆవరించిన మహా దైవమే శివుడు.
ప్రతి ప్రాణిలో ప్రకాశించే పరబ్రహ్మమే లింగం. సర్వ జీవుల జీవశక్తియే లింగం. సమస్త చరాచర ప్రపంచానికి ఆధారమే లింగం. సమస్త చరాచర ప్రపంచాన్ని నడిపించే శక్తియే లింగం. అఖిల లోకముల వ్యాపించిన మహా దైవమే లింగం.
లింగం అంటే అనంతమైన దివ్య తేజస్సు. సూర్యుడిని ,చంద్రుడునీ, నక్షత్రాలను, అగ్నిని ప్రకాశింపజేసే మహా తేజస్సు. కాబట్టి లింగం అంటే అనంతమైన, స్వయంప్రకాశమైన దివ్య తేజస్సు. లింగం అంటే మూలధైవం. లింగం అంటే ఆది దైవం. లింగం అంటే అనాది దైవం. ఇట్టి మహా దైవాన్ని మనం నిత్యం పూజిద్దాం, సేవిద్దాం. ఫలితంగా మోక్షాన్ని సాధిద్దాం.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments