*చుక్కల దారుల్లో..*

*చుక్కల దారుల్లో..*

      ఇందుకూరుపేట వాస్తవ్యురాలైన 'చుక్కల దారుల్లో' బాలగేయాలు గ్రంధకర్త ఎం.వి.ఉమాదేవి గారు తెలుగు బాలసాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు.తన గ్రంథంలో గల బాల గేయాలను అలతి అలతి పదాలను అందంగా తీర్చిదిద్దిన తీరుతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి.ఈ గ్రంథమందు వివిధ అంశాలలో ఎంతో చక్కగా ఒదిగిపోయిన పదాలతో ఉమాదేవి గారి సృజనను ప్రశంసించకుండా ఉండలేము. ప్రత్యేకంగా పిల్లల కోసం రాసిన సాహిత్యంలో భాషాను పిల్లల స్థాయికి అవలీలగా పాడుకునేలా రాయడం జరిగింది.ఒక్కో అంశానికి ఒక్కో బొమ్మను చూస్తూ గేయాన్ని పాడుకుంటూ ఉంటే ఆ పిల్లలకు మనసులో ఎంతగా హత్తుకు పోతాయో ఈగ్రంథమును చదివిన పాఠకులకు ఇట్టే అర్థం అవుతుంది. చిత్ర అవగాహనతో పాటు పిల్లల మనస్తత్వం తెలిసిన ఎం.వి.ఉమాదేవి గారు ఊహ తెలిసిన ప్రాయం నుండే తల్లి జోల పాట నుండి లయ,సాహిత్యం అర్థం చేసుకున్న శిశువులు తాము ఎదిగే క్రమంలో పాట,గేయం వైపుకు ఆకర్షితులై సమకాలీన విషయాలతో పాటుగా సాంప్రదాయ గేయాలతో ఇంకా ఇతరత్రా ఎన్నో విషయాలతో భావపరమైన,భాషాపరమైన బేధాలతో ఎదుగుదలను చూడవచ్చని తన మాటలో చెప్పడం జరిగింది.ఇంకా ఈ చుక్కల దారుల్లో బాల గేయాలకు ముందుమాట రాసినటువంటి బాల సాహిత్యవేత్త గద్వాల సోమన్న గారు తమ అభిప్రాయాన్ని చెబుతూ సుతిమెత్తగా,సూటిగా భావాలను గుప్పించడంలో ఉమాదేవి గారు దిట్ట అని,బాల గేయాల హారాల అల్లికలో ఆమెకు ఆమే సాటి అని,నాణానికుండే బొమ్మా బొరుసులా  ఒకవైపు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సాహిత్య సృజన చేయడం అభినందనీయ విషయమని తన ముందుమాటలో తెలపడం జరిగింది.

    ఇక 'చుక్కల దారుల్లో' గ్రంథంలోని గేయాలను పరిశీలిస్తే అమ్మ మాటలు తేనె ఊటలు అంటూ ఉమాదేవి గారు తన గ్రంథం అయినటువంటి చుక్కల దారుల్లోలో మొదటి గేయంను తల్లి గురించి అమ్మ మాటలు అనే శీర్షికలో చక్కటి గేయాలను పొందుపరిచారు. ఇక్కడ అమ్మ మాటలను తేనెల ఊటలు అనే చక్కని పోలికతో ఆరంభించారు.ఇందులో అమ్మను గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా... అమ్మ గురించి ఆమె చేసే పనులన్నింటి గురించి, ప్రేమ,ఆప్యాయతలను చక్కటి గేయాలతో పాడుకోవడానికి సులభరీతిలో అందించారు.పక్షుల గురించి తెలుపుతూ ఎగిరే పక్షులు ఎంతో అందం అంటూనే వివిధ రకాల పక్షుల గురించి చెప్తూ గేయాలలో పండును కొరికే చిలకమ్మా... అంటూ చెట్టు మీద ఉన్న చిలకమ్మను పండును పదచిత్రాల ద్వారా మనకు చూపించారు.మనస్సు అనే అంశంతో అల్లిన గేయాలను పరిశీలిస్తే సర్వం మనసే అని అంటూనే మనసు వేడుక మధురమైనదని/ మనసు మిత్రుని సమము/ అలాగే మనసు కవితల స్వర్గము/ మనసు గీతా మార్గము అంటూ చక్కని భావయుక్తమైన గీతాలాపన చేసే విధమైనవి ఉన్నాయి.ఇంకా ప్రభుత్వ బడి,దర్జీ పలుకవే మా రామచిలుక,పాపాయి పూలజడ,గొర్రె పిల్ల ఇలా ఒక అంశంలో మించిన గేయాలు మరొక అంశం పై అలవోకగా రాసిన గేయాలను ఉమాదేవి గారి చుక్కల దారుల్లో గ్రంథమందు మనం చూడవచ్చు.

     జిట్టి రేగిపళ్ళు గురించిన గేయంలో రే రే రేగుపళ్ళు! పులుపు తీపి! చెట్టుకింద చేరు! ఒక్క ఊపు ఊపూ.. అంటూ రేగు పండ్ల చెట్టు కింద చేరిన తన చిన్ననాటి జ్ఞాపకాలనెన్నింటినో మోసుకొచ్చారు.అలాగే రేగు పళ్ళు ఉపయోగాలను తెలుపుతూనే ఉడతా ఉడతా హూత్ అంటూ మరొక అంశంలో ఉడుతను గురించి దాని ఆహారపు అలవాట్లను గురించి చెప్తూనే నాటి రామాయణంలో ఉడుత సాయంను గుర్తు చేశారు.చలాకి గుర్రం,తువ్వాయి,బాపూజీ,నెమలి,పోలియో చుక్కలు,గాడిద, కుందేలు,రైలు,తాబేలమ్మా తాబేలు,మా బడి, పాలపిట్ట,గడ్డిపూలు,సైకిల్,డాల్ఫిన్ చేపలు,తాటి చెట్టు,అరుగుల ఇల్లు, దోమలు,కోతులు మన తాతలు,రాళ్ల జుంకీలు,చేదబావి,పెన్ను పెన్సిల్,పుస్తకం,సీతాకోకచిలుక,గిజిగాడు,వానజల్లు,మట్టి గణపతి,ఉషోదయం,కనురెప్పలు,తిరగలి ఇలా 110 అంశాలపై ఉమాదేవి గారు తనదైన శైలిలో అలతి అలతి పదాలతో అందమైన గేయాలను ఏరి కోరి చుక్కల దారుల్లో గ్రంథమందు పొందుపరిచారు.గేయాలు అన్నీ కూడా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా పాడుకునేలా సులభ రీతిలో ఉన్నాయి.

     పుస్తకంలోని ప్రతి గేయంలోనూ గ్రంథకర్త తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో ప్రతి గేయాన్ని మెరిపించారు. పిల్లల కొరకు రాసిన ఈ గ్రంథం ఎందరెందరో సాహిత్యకారుల పాఠకుల మెప్పు పొందుతుందనడంలో సందేహం లేదు.పిల్లల మనసు,వారి మనస్తత్వాన్ని బాగా తెలిసిన ఉమాదేవి గారు చక్కని పుస్తకాన్నీ అందించారు.ఈ సందర్భంగా గ్రంధకర్తకు కృతజ్ఞతలు.ఇంకా ఇలాంటి మరెన్నో గ్రంథాలు తమ నుండి రావాలని కోరుకుంటూ అభినందనలతో...

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments