ఎవరికి చదువు చెప్పావు?

ఎవరికి చదువు చెప్పావు?

 

ఎవరికి చదువు చెప్పావు?

    రెండు తరాలకు ముందు మాకు చదువేలేదు. ఎవరికి విద్య నేర్పావని నీ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం. నూటికి తొంభై శాతం ప్రజలను అంటారానివారిగా చేసి బానిసలుగా మలిచిన మతానికి వత్తాసు పలుకుతూ, ఏనాడూ బడిమొకం తెలియని బతుకులు మట్టికే అంకితమై పోతుంటే… ఆ మట్టిలో కలిసే వరకు నీ బతుకు ఇంతే, నీ తలరాత అంతే అని, అదే జీవితమని చెప్పినందుకు నిన్ను గురువుగా అంగీకరించాలా…

   ఎవరు గురువులు? ఎందరు విద్య నేర్చుకున్నారు? ఎవరికి విద్య నేర్పారు?  శంభుకుడి తలతో… ఏకలవ్యుడి వేలు నుండి, నేటి మంచి నీళ్ళ కుండ వరకు… విద్య, ఎవరి సొంతంగా ఉంది. కేవలం నూటికి ఐదు శాతంగా ఉన్న వాళ్ళ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా నడుస్తున్న రాజ్యంలో పేదవాళ్లకు నేటికీ ఉన్నత విద్య అందని ద్రాక్షే. 

   గురుశిష్య పరంపర… ఆశ్రమ వాస జీవితం… ఎవరికి విద్యను అందించిందో తెలియంది కాదు. విన్నందుకు చెవిలో సీసం, వల్లెవేసినందుకు నాలుక తెగ్గోసిన ఈ కసాయి లోకం సకల విద్యలకు నెలవు ఎలా అయ్యింది. మానభంగాలు, సజీవదహనాలు ఒక వర్గానికి వరంగా మారాయి.

     రెండు తరాలకు ముందు విద్య లేనేలేదు… అయ్యకు అరకొర సదువు… తాతకు అసలే తెలువదు. తెలిసిందల్లా పట్టెడన్నం కోసం పని చేయడం; ఒక్కపూట తిండి కోసం తిప్పలు. ఎట్టి బతుకులు. రాజ్యాంగ నిర్మాణమయ్యి ఏడు దశాబ్దాలు దాటినా, కష్టాల కడలి దాటాని జీవితాలు. రెండు వేల ఏళ్ళకు పూర్వమే…  నాగరిక దేశం ఎలా అయ్యింది…

    జంతు మూత్రాన్ని పవిత్రమని తాగుతూ… నిరంతరం ఈ సమాజం కోసం శ్రమించే వారి స్వేదాన్ని ద్వేషిస్తూ, మనిషిని మనిషిగా చూడని ఈ సమాజం ప్రపంచానికి ఎలా ఆదర్శమయ్యింది.

    లోక కళ్యాణం కోసమని చేసిన నరమేధాన్ని ఏమని సమర్థించుకుంటారు. బలవంతుల్ని చంపుతూ బలహీనుల్ని మచ్చిక చేసుకుంటూ, కలిసున్న వారిని తెగనరుక్కుంటూ మానవ విలువల్ని మచ్చుకు లేకుండాచేసి మనువాదాన్ని అందలమెక్కిస్తున్న ఈ ద్రోహుల్ని ఎవరు క్షమిస్తారు.

    దేశాన్ని ప్రేమించు. మేరా దేశ్ మహాన్ హై! దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్… అన్న అప్పారావు గారి మాటల్ని అలాగే వల్లెవెయ్… అన్ని సేవలు చేయించుకుని అంటరానివారని ఆమడదూరంలో ఉంచి, అధికారం కోసం అక్కున చేర్చుకుని, చేజిక్కాక ఆమడదూరంలో ఉంచి… విభజించి పాలిస్తూ, సుర వంచన కర్మ సిద్ధాంతాన్ని వల్లిస్తూ, మీ పుట్టుకే సేవకోసం అని నమ్మబలుకుతూ… నేటికి కూడా బానిస భావజాలాన్ని మెదళ్లలో నింపగలిగే కపట సామర్థ్యం ముందు మనువాద సమాజం ప్రచారం చేసే ఏ అసుర శక్తి సాటిరాదు.

     మనువాదాన్ని ధిక్కరించి మనుషుల్ని మనుషులుగా చూడగలిగిన కొందరు రాజులు, జాతీయ భావాన్ని పెంపొందించుకొని… మానవ హక్కుల్ని అమలుపరుస్తూ, సమానత్వాన్ని పాటిస్తున్న బ్రిటిష్ వారి పుణ్యమా అని ఆధునిక విద్యా వ్యవస్థ ప్రారంభమైనా; స్థానిక కర్కశ నిరంకుశ పెత్తందార్ల పుణ్యాన బడి మొకం చూసేవారు కరువయ్యారు.

   పేదోడి బళ్ళో పథకాల ప్రకటనకు కొదవలేదు… అమలు అసలేలేదు. కొదవలేని బడులు కొన్నైనా బాగుండు… అణగారినవాడు చదివితే అందలమెక్కించాలిగా,  అదిఎవరికైనా ఎందుకిష్టముంటుంది. క్లర్కులు కావాల్సినవారు కలెక్టర్లు ఐతే ఎవరు సహిస్తారు. తప్పదు కాబట్టి భరిస్తున్నారు. లేదంటే అంబేద్కర్ తయారుచేసిన ఆయుధం దహించివేస్తుందని తెలుసు.

     స్వాతంత్ర్యానంతరం మారిన అధికార మార్పిడి తరువాత వారి పుట్టినరోజుల్ని చావుల్ని పండగల్ని చేసి తరాలు మారినా వారి ప్రభావం తగ్గకుండా చెరగనిముద్ర వేసుకున్నారు. మనుషుల్ని మనుషులుగా చూడని ఒక మతానికి వత్తాసు పలికే, ఒక మతం మనుగడకోసం పనిచేసిన వ్యక్తి, మానవతా విలువలులేని కేవలం ఒక మతాన్ని నూతన ఒరవడితో ప్రచారం చేసిన వ్యక్తి పుట్టినరోజు ఎలా ఉపాధ్యాయ దినోత్సవం? ఇలాంటి భావదాస్యంలో ఉన్నన్నినాళ్ళు ఎన్ని తరాలు మారినా నీ తలరాత మారదు.


- రాజేంద్ర

  9010137504

0/Post a Comment/Comments