*అట్ల బతుకమ్మ(ఐదవరోజు)*శ్రీలతరమేశ్.

*అట్ల బతుకమ్మ(ఐదవరోజు)*శ్రీలతరమేశ్.

పుత్తడీ బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

పచ్చని వనమంతా ఉయ్యాలో..
పొంగి పరవశిస్తోంది ఉయ్యాలో..

తంగేడు గునుగు ఉయ్యాలో..
తామర కలువలు ఉయ్యాలో..

మందార గుమ్మడి ఉయ్యాలో..
రాశిగా పోసిరీ ఉయ్యాలో..

వరుస వరుస పెరిగి ఉయ్యాలో..
సింగిడి రంగులయే ఉయ్యాలో..

పుత్తడి బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

సింగిడి రంగులే ఉయ్యాలో
సిరిగరిగిన పువ్వులే ఉయ్యాలో..

ఆపువ్వు ఈపువ్వు ఉయ్యాలో..
గుడిగోపురమాయే ఉయ్యాలో..

శిఖరాగ్రమున ఉయ్యాలో..
గౌరమ్మ నిలిచింది ఉయ్యాలో..

కోమలాంగులంత గూడి ఉయ్యాలో..
కొలువ వచ్చారమ్మ ఉయ్యాలో..

ఇక హంసలా నడకలే ఉయ్యాలో..
నెమలి నాట్యాలే ఉయ్యాలో..

అలలై పొంగినే ఉయ్యాలో..
అలుగోలే దూకేనే ఉయ్యాలో..

పుత్తడి బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

పొంగిపొర్లుతున్నదమ్మ ఉయ్యాలో..
భక్తిపారవశ్యము నిఃడుగా  ఉయ్యాలో..

ముక్కోటిదేవతలు ఉయ్యాలో..
కొలువుకెక్కేనమ్మా ఉయ్యాలో..

కొండంత సంబరాన్ని ఉయ్యాలో..
రెప్పవాల్చకుండా చూస్తే ఉయ్యాలో..

ఇంపైన పాటలు ఉయ్యాలో..
మనసైన ఆటలూ ఉయ్యాలో..

పుత్తడి బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

ఆనంద సాగరాన ఉయ్యాలో..
పిల్లలంతా చేరే ఉయ్యాలో..

నింగి తొంగిచూడవట్టే ఉయ్యాలో..
నేల సంతసించ వట్టే ఉయ్యాలో..

ఊరి చెరువు చూడు ఉయ్యాలో..
బతుకమ్మలతో నిండె ఉయ్యాలో..

బతుకమ్మలతో నిండే ఉయ్యాలో..
పూల ముగ్గులేసినట్లు ఉయ్యాలో..

పుత్తడి బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

ముత్తైదువులంతా ఉయ్యాలో..
గౌరమ్మను పంచుకునే ఉయ్యాలో..

అట్లవాయినాలు ఉయ్యాలో..
ఆరగింపు వేళ ఉయ్యాలో..

ఆడపడుచులంతా ఉయ్యాలో..
ఆప్యాయత పంచే ఉయ్యాలో..

ఆనందనదిలా ఉయ్యాలో..
సాగి పోతున్నరమ్మ ఉయ్యాలో..

పుత్తడి బొమ్మకు ఉయ్యాలో..
పువ్వుల పూజలు ఉయ్యాలో..

బతుకు నిలుపు తల్లికీ ఉయ్యాలో..
మంగళ హారతులు ఉయ్యాలో..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments