అతనొక చైతన్యం

అతనొక చైతన్యం

(కాళోజీ జన్మదినం సందర్భంగా)

నిరాడంబరతకు నిలువెత్తు రూపమైనా
నిగ్గదీసి అడిగే దమ్మున్న కలంధారి...
ఉన్నోడు ఊడ్చుకుపోతుంటే
బోసినోటి నుండి పన్ను ఆశించేడి
వెర్రితనాన్ని వెలివేయమన్న గొంతుకది...

ఎడతెగక సాగిన అక్షరజీవనం
జీవనదియై పారుతూ
నీ...నా...బేధం లేకుండా
సమభావంగా సాగిన నది...
కన్నీటి వెతలలో వెతికిన ఎన్నెన్నో కలలు
బతుకు చిత్రంను చూపిన వైనం
చెమ్మగిల్లిన కన్నులతో
కమ్మలెన్నో చదివి
గుప్పెడు భావాలలో ఆయువునింపిన నిరాడంబర భూషణం..

యాసభాసల కొరకు అక్షర తూటాలనిసిరి
కొంపలార్పిన జాతిని కాలం రాగానే తరిమి తరిమి
కాటేయాలన్న తెగువ గలిగిన దైర్యగొంతుకది..

గాడితప్పనీయ్యని పలుకుబళ్ళ స్వరం
చైతన్య వీచికలా ప్రభంజనమై
వేగుచుక్కోలే వెలుతురు దారులుజూపి
ఒంపులు తిరిగిన వాక్యాలనీ
వాగులోలే పరిగెత్తించిన చైతన్యం..
తన కలం గళం ప్రశ్నించగా
గుండెలనిండా మెదిలే
గుప్పెడు భావాలు...
కదలికలెన్నో తెచ్చెను మెదళ్లలో...

అక్షర కెరటాలకు పురుడోసుకున్న పుటలు
పునీతమైన అడుగుజాడలలో
వెలుగురేఖలు దశదిశలా నిండగా
తెరిచిన పుస్తకమంటి అతని జీవితం
అందరికీ ఆదర్శం..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments