10th - SA Exam Telugu సారాంశాలు

10th - SA Exam Telugu సారాంశాలు

 

1.  దానశీలము

       శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.

     అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది. 

        ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.

     ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.

2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

 సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

   లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.

     మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు  ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.

   నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు. వీరు వేలూరి శివరామశాస్త్రి గారి శిష్యులు. సామల సదాశివ, కోడూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులు. అంబటిపూడి వారి ఒకకావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం పరిషత్ నిర్వహించే పరీక్షల సిలబస్ లో ఉండేవి.

               పలుకుబడి, నుడికారం, జాతీయాలను ఉర్దూలో రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చు. టక్సాలీ అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ ఎక్కువ. డిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు.

         సదాశివ గా ఊరిలో మరాఠీపు రోహితుడు మొదట 'మీకండ్లకు నీళ్లు పెట్టుకోండి"అంటాడు. "కళ్ల నీళ్లు పెట్టుకోండి"అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీ నోటివెంట అచ్చ  తెనుగు నుడి వినిపిస్తుంది. ముస్లిం స్త్రీలు ఇల్లుదాటి వెళ్ళని వాళ్లు మాట్లాడేది శుద్ధమైన భాష రాజమహల్లలోఉండే బేగములు మాట్లాడేది శుద్ధమైన భాష. ఈ ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అంటారు. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.

 వరంగల్లో పెద్ద కాలోజి వర్ధంతి సభలో సదాశివ పాల్గొన్నాడు. పెద్ద కాలోజీ కవి. ఇతని కలంపేరు షాద్. వర్ధంతి సభలో చిన్నపాటి కవి సమ్మేళనం జరిగేది. గాయకులు షాద్ గజల్లు పాడేవారు. సదాశివ గారు సభకు వెళ్ళే సరికి సాహితీ మిత్ర మండలి వాళ్ళు కవితా గానం చేస్తున్నారు. సభకు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు వేరే భాష పదాల జోలికి పోకుండా వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. తర్వాత సామల తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలోనే మాట్లాడాడు.

   సామల సదాశివ వార్తా పత్రికల్లో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాశాడు. తర్వాత యాది రాశాడు. యాదిలో వచ్చిన వ్యాసాలను చదివి గుంటూరు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ మెచ్చుకునేవాడు. ఆంధ్రవాళ్ళు మెచ్చుకోవడం గొప్పేకదా.

   సదాశివ తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతివెంకన్నను కూడా చూడలేదు. కారా మాస్టారు గారి ఆజ్ఞతో మూడు రోజులు విశాఖ శ్రీకాకుళం వెళ్ళివచ్చాడు. సదాశివ తెలుగు పంతులు ఉర్దూ మరాఠీ పిల్లలు వ్యవహారిక భాషలోనే చదువుకునేవారు. ఒక టీవీ చానల్లో "తెలుగేరాయండి. తెలుగులోనే మాట్లాడండి" అని చెపుతున్నప్పుడు... అది విన్నప్పుడల్లా ఏతెలుగు? ఎక్కడితెలుగు? అని రెండు ప్రశ్నలు వేసుకునేవాడు.

  ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతడు శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్లమీద కూర్చుండి ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి మాట్లాడు కుంటుంటే వాటిని శ్రద్ధగా విని ప్రజలపలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. తఖీమీర్ నాది ప్రజా కవిత అన్నాడట.

 తఖీమీర్ గారి ఒక షేర్

 ‘గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్

పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సేహై’

  ఇందులో ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. “ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని పై షేర్ యొక్క అర్థం.”

 ఈ విధంగా సామల సదాశివగారు ఆయా ప్రాంతాల తెలుగును ఆయా ప్రాంతాలలోని భాషా సేవకులను, అభిమానులను గుర్తుచేసుకుంటూ ఉర్దూ భాషపై తనకు గల అభిమానాన్ని, పట్టును ప్రస్తావిస్తూ సాగించిన రచనే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం.

3. వీర తెలంగాణ

         తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా  ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 

         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 

      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.


4. కొత్తబాట

   అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింప బడ్డాయి.


   'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు. అక్క పయనమై బండెక్కి బయలు దేరింది. వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు.  అక్క  ఎంత సేపటికీ  మాట్లాడపోయే  సరికి

ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.


  చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి  తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.


  కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది.  ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.


   గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ  పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే  గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.


   బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.

కొత్తబాట పాఠం ప్రకారం 

మారుతున్న సమాజంలో...

  • ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని. 
  • కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
  • చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
  • ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
  • రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
  • మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
  • ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
  • పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
  • దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
  • ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
  • మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
  • పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
  • యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు. 

ముగింపు

  ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం. 

5. నగర గీతం

    అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరువ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయగారా జలపాతం హోరులా అనిపిస్తాయి. నిజానికి అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకుపోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. 


   అమ్మ ఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్దపట్నంలో తలదాచుకోడానికి కాసింత స్థలం కూడా దొరకదు పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.


   నగరంలో ప్రతిమనిషీ చదవవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. నగరంలోని మనిషి వెనుక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడుకవి.


   నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై సందడి చేస్తుంటరు. వారి మాటల్లోంచి చదువులసారం పుప్పొడిలా రాలుతుంది.


    నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంయానుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం, దారిద్ర్యం పక్కన్నేసమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో విభిన్నమనస్తత్త్వాలతో కలసిపోయి కకలంతో నిండి ఉంటుంది. ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోడానికి అనువైన సమయందొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవాళ్ళు, ఆటోరిక్షాల్లో వెళ్ళేవాళ్ళు, ఆటోరిక్షాల్లో తిరిగే వాళ్ళు, వాళ్ళు ఆటోరిక్షాల్లో తిరిగే వాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు.


    నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అన్ని వైపులా ప్రమాదాలుపొంచి వుంటాయి. నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి వుంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. 


  వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి 

ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.


    ప్రయోగశాలలో ఏవేవో రాసాయన ద్రవాలు, ఆమ్లాలు వుంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవాళ్ళు ఉపాది దొరకకపోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచిచూస్తుంటారు. 


  ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధిగాదు. కాలుష్యం కలవర పెట్టినా, ట్రాఫిక్ జామ్ లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగిపోనియ్యని, చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.


6. భాగ్యోదయం


   కృష్ణస్వామి ముదిరాజ్ రచించిన రచించిన భాగ్యోదయంలో భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో చేసిన సామాజిక సేవ ను సంక్షిప్తంగా వివరించడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ 1888లో జన్మించాడు.


   ధర్మ శాస్త్రాలు చరిత్ర ను బాగా అధ్యయనం చేసి సమాజంలో ఉండే కుల వ్యవస్థ దాని నిజ స్వరూపాన్ని అవగతం చేసుకుని, అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు చేపట్టాడు.


   ఏమీ ఆశించకుండా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల తో పని చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేసాడు. నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం వలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయ మయ్యాయి.


   సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో వివరించి చెప్పి తాగుడు మాన్పించాడు.


  ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిలభారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చి, అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేసాడు.

  

 1925 లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది-హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకుల తో సమంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది.


   1931 జనాభా లెక్కలు సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆదిహిందువులు గా నమోదు చేయించాడు.


   భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. తనను జీవితాంతం సామాజిక సేవ వైపు నడిపించింది. అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది.

0/Post a Comment/Comments