మా'నవ' సేవయే మా'ధవ' సేవ -రాజేంద్ర, 9010137504.

మా'నవ' సేవయే మా'ధవ' సేవ -రాజేంద్ర, 9010137504.

మా'నవ' సేవయే మా'ధవ' సేవ




మనిషిని మనిషిగా చూడని ఈ దేశంలో మనిషంటే ఎవరు? మానవులంటే ఎవరు? దేవుడు ఒక్కడే అనే మత పునాది నిర్మిత ఈ లోకంలో మాధవుడంటే ఎవరు? ఏ మతస్థులు ఆ మతానికి చెందిన దేవున్ని, దేవుడొక్కడే! ఆ దేవుడు మాదేవుడే అనే ప్రచారంలో అనుక్షణం నిమగ్నమై వుంటరు. తదనుగుణంగా ప్రణాళికా రచన చేస్తూనే ఉంటరు. ఆ కోవలోదే "మానవ సేవయే మాధవ సేవ".


మానవ సేవయే మాధవ సేవ! మానవులంటే మనుషులని; మాధవుడంటే దేవుడనీ అర్ధమవుతుంది. ఎడ్లను, గొడ్లను, పందుల్నీ పూజించే ఉదారత కలిగినోళ్లు తోటి మనుషుల్ని తాకడమే పాపమంటూ, మైలపడుతామంటూ సమాజంలో తొభై శాతం మందిని అంటరానివారిని చేసి, అస్పృశ్యులంటూ హీనంగా చూసే సమాజంలో మనుషులంటే ఎవరు? 


మనిషిమనిషికీ ఇంటిఇంటికీ రకరకాల పేర్లతో కొలువైవున్న దేవుళ్ళు ఒక్కరా, ఇద్దరా? లెక్కకు మిక్కిలిగాఉన్న రూపాల్లో దేవుడంటే ఎవరు? వైష్ణవులు, శైవులు మాదేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అని కొట్టుకసచ్చిన ఈ నేలలో దేవుడంటే ఎవరు? త్రిమూర్తులు ముగ్గురే దేవుళ్ళనీ, దేవుళ్ళు ముక్కోటి మూడుకోట్లు అనీ, దేవుళ్ళు సురా ముప్పైమూడు కోట్లనీ తెలుస్తున్న విభజనలో దేవుడంటే ఎవరు? అందరూ అన్నీ… కనిపించిన చెట్టూచేమ, రాయీరప్ప అన్నిటినీ దేవుళ్ళుగా భావించే క్రమంలో దేవుడంటే ఎవరు? మానవ సేవయే మాధవసేవ అనడంలో అంతరార్థమేంటి?


మానవ సేవయే మాధవసేవ అనే దాంట్లో మానవులు అంటే కేవలం సమాజంలో అస్పృశ్యులుగా వున్న తొంభై శాతం మంది కాకుండా, పదిశాతంగా ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారే అనే విషయం తెలుస్తుంది. పై వాక్యంలో ఇంకో పదం మాధవుడు. మాధవుడు అనే పదం దేవుడు అనే అర్థంలో చెబుతున్నారు. మాధవుడు అనే పేరు విష్ణువుకు ఉన్న మరోపేరు. అంటే విష్ణువుకు సేవచేస్తే దేవుడికి సేవచేసినట్టే అనే భావజాలాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడం కోసం జరుగుతున్న అతిపెద్ద ప్రయత్నంగా ఈ సేవను అభివర్ణించాలి. మిగతా దేవుళ్ళని పూజించే సాంప్రదాయకుల ఆచారాల్ని వెలివేసి, కనుమరుగుచేసి మహమ్మదీయ, క్రైస్తవ మతాల్లోలాగా దేవుడొక్కడే ఆ దేవుడు విష్ణువు ఒక్కడే! అనిచెప్పే ప్రయత్నం పెద్దఎత్తున జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అనే అంశంపై జరిగిన ఈ చర్చలో అవగతమయ్యే స్పష్టమైన విషయాలు రెండు. మొదటిది మానవులు అంటే అగ్రవర్ణాలు. రెండవది మాధవుడు అంటే విష్ణువు. ఇప్పుడు ఏది మానవ సేవ? ఏది మాధవ సేవ? అనే అంశాల్ని గురించి చర్చించుకుందాం. 


మాధవ సేవ:


మాధవ సేవ అంటే దేవుడికి సేవ చేయడం. సేవించడం అంటే పూజించడం. ఏయే రకంగా సేవలు చేస్తాము?  ఎందుకు చేస్తాము? దేవుడికి ఎందుకు పూజలు చేస్తాము అనేది చాలా విస్పష్టమైన విషయం. ముక్తి మోక్షం లభించాలని కొందరు. తెలిసో తెలియకో చేసిన పాపాలు తొలిగి పుణ్యం రావాలని కొందరు. చనిపోయాక స్వర్గలోకాలు ప్రాప్తించాలని కొందరు. మన జీవితాలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో తొణికిసలాడాలని, మనతోపాటు అందరూ బాగుండాలని లోక కల్యాణాన్ని ఆశించి కొందరు, దేవుడు అనే వారి నమ్మకానికి పూజలు చేయడం జరుగుతుంది. మానవుడికి సేవచేస్తే పైవన్నీ దొరుకుతాయి లేదా ప్రాప్తిస్తాయి అని, మానవ సేవయే మాధవ సేవ అనే వాక్యంయొక్క వివరణ.


దేవుడిని ఎలా పూజస్తారు? లేదా దేవుడికి ఎలా సేవచేస్తారు? అందరూ అన్ని పనులు కేవలం లాభాన్ని మాత్రమే ఆశించి చేయరు. కానీ ఏదో ఓరూపంలో ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. దేవుడు అంతటా ఉంటాడు, ఇందు గలడు అందు లేడు అనే సందేహం వద్దు. దేవుడు సర్వాంతర్యామి అని అంటారు. నాలుగు గోడలమధ్య బంధించి గుడి అంటారు. అక్కడ మొదలవుతుంది తంతు ప్రతీది పైసతోనే ముడిపడి ఉంటది. ఈ క్రమంలో దేవాలయాలను అచ్చమైన వ్యాపార కేంద్రాలుగా గుర్తించక తప్పదు. రకరకాల అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు మొదలైన ఎన్నోతంతులు. ఇవన్ని జరపడం వల్ల చేకూరే ప్రతిఫలం మానవ సేవ వల్ల కూడా లభిస్తుంది అనే అర్థం అవగతం. ముందే చెప్పుకున్నట్టుగా మానవులంటే అగ్రవర్ణాల ప్రజలు. మరీ విశదంగా చెప్పుకోవాలంటే, మానవులంటే త్రివర్ణాలలో మొదటివారైన బ్రాహ్మణులుగా అభివర్ణించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులు భూసురులు. భూమిపైన దేవుళ్ళు. వారిని సేవిస్తే, వారికి సేవచేస్తే దేవుడికి చేసినట్టే. ఎన్ని తరాలు మారినా, ఎంత విజ్ఞానాన్ని పోగుచేసుకున్నా ప్రజలను కట్టుబానిసలను చేసుకునే వారికుట్ర అలుపెరుగడంలేదు.


ఎవడు మనిషంటే?


ఇంతకు ముందు మానవులు అంటే భూసురులు అని చెప్పుకున్నాం. మానవుడు అంటే మనువు వలన జన్మించినవాడు అని నిఘంటు అర్థం. అనేక సంఘ సంస్కరణల పోరాట ఫలితంగా అంటారానివారిగా సమాజం నుండి గెంటివేయబడినవారు మానవులు అంటే మనుషులు అని, అందరిలానే మనం కూడా మనుషులమే అనే స్పృహలోకి వచ్చారు. నిజానికి మనుషులు ఎవరు?


నీవు ఒళ్ళు కప్పుకోవాడినికి వస్త్రాన్ని 

తయారు చేసిన వాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీవు తొడుక్కోవడానికి గుడ్డల్ని 

కుట్టిన వాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీ కాళ్ళు కందకుండా జంతు చర్మాన్ని ఒలిచి 

చెప్పులు చేసిన వాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీకు భోజనం పెట్టడం కోసం ఆరుగాలం కష్టపడి 

పంటలు పండించే వాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీవు నివసించడానికి మట్టిపిసికి ఇటుకచేసి 

ఇల్లు కట్టినవాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీకు కావాల్సిన ప్రతీ దాన్ని కళాత్మకంగా 

తయారు చేసి ఇచ్చేవాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

నీవు బతకడానికి దేవాలయాలు నిర్మించి ఇచ్చి 

నీకు బతుకుదెరువు నిచ్చినవాడు గొప్పవాడా కాదా; ఇంకెవరు

ఎవడు మనిషంటే? పై గొప్ప పనులు చేసేవాళ్ళా 

తిన్న దరగక అరుగుమీద కిళ్లీ ఏసుకుని పనికిమాలిన ముచ్చట్లు చెప్పేటోడా


మనిషంటే గొప్పవాడా లేక తన స్వార్థం కోసం మనుషుల్ని విడదీసి కులాల్ని సృష్టించి మనిషికి మనిషిని దూరం చేసినోడా. మనిషంటే ఎవడు? నిరంతరం ఈ సమాజ పురోగతికి పాటుపడుతూ, ఈ సమాజపు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేవాడు. మనిషంటే ప్రజల్ని విద్యకు దూరం చేసి అజ్ఞానంలోకి నెట్టేవాడు కాడు. మనిషంటే ఈ సమాజ చైతన్యానికి మూలస్థంభమైనవాడు. మనిషంటే ఈ సమాజ పురోభివృద్ధికి నిరంతరం శ్రమించేవాడు. 


మానవ సేవ: 


మనకోసం మన ఎదుగుదలకోసం జీవితాల్ని త్యాగం చేసే మనుషులకు సేవచేయడం మనందరి కర్తవ్యం. పేదరికాన్ని లెక్కచేయకుండా, తినడాని పట్టెడు మెతుకులు లేకున్నా సమాజంలో గుర్తింపును హోదాను ఆశించకుండా నిస్వార్థంగా ఈ ప్రపంచానికి భోజనం పెట్టె మనుషులకు సేవచేయడం మన అదృష్టం. ఎంత ఎదిగినా సరే తోటి మనుషులకు ఎప్పటికప్పుడు తోచినసాయం చేస్తూ జీవించడంలో ఉన్న గొప్ప సంతోషం దేనిలో ఉండదు. మనం సంఘ జీవులం. సినారె గారు చెప్పినట్టు 'మనుషులు పదుగురు కుడితే ఊరవుతుంది'. ఆ పదుగురు ఒకరికొకరు సహాయపడుతూ జీవిస్తే ఈ జీవితం సార్థకమవుతుంది. కష్టాల్లో ఉన్న వారికెవ్వరికైనా సరే తప్పకుండా సహాయం చేయాలి.


(చివరగా మా'నవ' సేవయే మా'ధవ' సేవ లోని నవ ధవ సేవ ఈ మూడింటి అర్థాలతో నిర్వచించుకుందాం. నవ = నూతన, దురద, స్తోత్రము; ధవ = భయపెట్టువాడు, రాజు, ధూర్తుడు; సేవ = ఆరాధన, ఉడిగము, చాకిరి, దాస్యము; భయపెట్టు దూర్తున్ని నిత్యనూతనంగా ఆరాధిస్తూ బానిసవలె ఊడిగము చేయడం.)


  • మాసు రాజేందర్, టీచర్, 

ఎస్.ఏ. తెలుగు, జెడ్.పి.హెచ్.ఎస్. రాయపర్తి, 

మం. నడికూడ, హనుమకొండ జిల్లా.

0/Post a Comment/Comments