మార్పు (చిట్టి కథ)
+++++++++++++
బలబద్రపురంలో బంగారయ్య అనే షావుకారు ఉండేవాడు. ఒక కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి సంవత్సరం పూర్తి కాకముందే మూడు కోట్లు ఏర్పాటు చేసి గొప్ప ధనవంతుడిగా మారాడు. రామయ్య అనే బీదవానికి తన కొట్టులో ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఒకరోజు అనుకోకుండా బంగారయ్య ఇంట్లో ఓ రాత్రి దొంగలు పడి బీరువాలో దాచిన పది తులాల బంగారు నగలు, ఓ లక్ష యాభై వేల నగదు దొంగిలించుటపోయారు. బీరువా తాళం చేతులు పెట్టే చోటు ఒక్క రామయ్యకు తనకు మాత్రమే తెలుసు. కాన రామయ్యనే దొంగతనం చేశాడని తలంచి షావుకారు అతన్ని పోలీసులకు పట్టించాడు. దాంతో రామయ్య జైలు పాలయ్యాడు. రామయ్య భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. చేయని దొంగతనానికి దొంగగా ముద్రపడిన రామయ్యను నేరం రుజువు కానందున కోర్టు నిర్దోషిగా భావించి అతన్ని విడుదల చేసింది.
విడుదలైన రామయ్య గ్రామం చేరుకున్నాడు. కానీ గ్రామస్తులంతా అతన్ని దోషిగానే చూస్తున్నారు. ఒంటరైనా తనకు బ్రతికే భారమైంది. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేక భార్య గ్రామం కు పోదామని నిశ్చయించుకుని ఓ రాత్రి తెల్లవారుజామున ఆ గ్రామం విడిచి తాను అంగడి వీధిలో నుండి నడుచుకుంటూ పోతుండగా ఎవరో కొంతమంది ముసుగులు ధరించి బంగారయ్య ప్రధాను కొట్టు ముందు తచ్చాడటం గమనించాడు. వారు కొట్టు తాళాలను పగలగొట్టడం చూసి వెంటనే ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ళ లోని వారందరినీ తలుపు కొట్టి నిద్రలేపి సమాచారం వారికి అందించాడు. జనమంతా కొట్టు దగ్గరికి వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసులు, షావుకారు బంగారయ్య ఉండడం చూసి వారి దగ్గరికి వెళ్లారు. వచ్చిన జనాన్ని కొట్టు చుట్టుపక్కల కాపలాగా పెట్టి పోలీసులు కొట్టు లోపలికి ప్రవేశించి ఆ ముసుగు దొంగలను పట్టుకున్నారు. వారికి బేడీలు వేసి బయటకు తీసుకు వచ్చారు. అప్పుడు బంగారయ్య" మా కొట్లో దొంగలు పడ్డారని విషయం మీకు ఎలా తెలిసింది అని పోలీసులను ప్రశ్నించగా, రామయ్య ఫోన్ చేసిన విషయం మాకు తెలిపినందున మేము వచ్చి వెంటనే ఈ ముసుగు దొంగలను పట్టుకున్నాం. మరి మీరేంటి? మేము వచ్చిన తక్షణమే మీరు కూడా మీ కొట్టు కాడికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది అనగా నాకు రామయ్య ఫోన్ చేశారని బంగారయ్య చెప్పాడు. విషయం సంపూర్తిగా తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు రామయ్యను తెగ మెచ్చుకున్నారు.
పోలీసులు ముసుగు దొంగలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. వారిని నయానో భ యానో ఒప్పించి దొంగలించిన వాటిని అస్తగతం చేసుకున్నారు. గతంలోనూ బంగారయ్య ఇల్లును మేమే దోచామనీ, ఇప్పుడు కూడా ఈ దొంగతనం చేసింది మేమేయని, బీరువాలో ఉన్న పదితులాల బంగారు నగలు , లక్ష యాభై వేల నగదు దొంగిలించామని ఒప్పుకున్నారు. డబ్బులు అన్ని ఖర్చయిపోయాయని, బంగారు నగలు మాత్రం గ్రామంలోని కంసాలి కృష్ణయ్యకు ఇచ్చామని చెప్పారు. వెంటనే పోలీసులు కంసాలి దగ్గరికి వెళ్లి నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పరీక్షించి చూడగా ఐదు తులాల చంద్రహారం లాకెట్లో బంగారయ్య ఫోటో ఉన్నది. అంతే కాకుండా హారంపై పేరు వ్రాయబడి ఉన్నది. తక్కిన ఐదు తులాల బంగారు గాజులు. వాటి పైన బంగారయ్య భార్య తండ్రిగారైన రంగరాజు పేరు ఉన్నది.
వెంటనే పోలీసులు వాటిని స్థానిక కోర్టులో జడ్జి సమక్షంలో బంగారయ్యకు అప్పగించారు. అంతేకాకుండా దొంగలను పట్టించిన రామయ్యను పిలిపించి కోర్టులోనే జడ్జి గారితో అతనికి ఓ ప్రశంసా పత్రం, పదివేల నగదు బహుమతి ఇప్పించారు. నగలను తీసుకున్న బంగారయ్య జరిగిన నిజం తెలుసుకొని నన్ను క్షమించమని రామయ్యను ప్రజల సమక్షంలోని కోరాడు. నిజం తెలియక నే తప్పు చేశానని, ఇప్పుడు నిజం తెలుసుకొని నేను మారిపోయానని ఒప్పుకొని రామయ్యను ఆలింగనం చేసుకొని మన్నించమని వేడుకున్నాడు బంగారయ్య. బంగారయ్యలో వచ్చిన మార్పును గమనించిన ప్రజలు అతన్ని, రామయ్యను వేనోళ్ళ పొగిడారు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.