బాలికల బంగారు బాల్యం?

బాలికల బంగారు బాల్యం?



బాలికల బంగారు బాల్యం?

ఆనందకరమైన బాల్యం శారీరక మానసిక వికాసాలకు మూలం. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ బాల్యాన్ని గడిపితేనే వారి భవిష్యత్తు బంగారు మయం అవుతుంది. ఆనందాన్ని అందరూ కోరుకుంటారు. నేడు ఎంతమంది పిల్లలు వారి బాల్యాన్ని ఆస్వాదించగలుగుతున్నారు? ఎందరు బాధలు లేకుండా బాల్యాన్ని దాటుతున్నారు? ఈ విషయాల్ని చర్చిద్దాం.


శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత శరవేగంగా దూసుకుపోతున్నాయో, అంతే వేగంగా మహిళలపై అదీ గాక మరీ ముక్కుపచ్చలారని బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటో? నేటి బాలికల స్థితికి వారి అభ్యున్నతికి కారణాలు అనేకం ఉన్నాయి.


మన భారత దేశంలోని ఏ మతం స్త్రీలకు స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు. స్త్రీని పని మనిషిని చేసి వంటింటికి పరిమితం చేసారు, పిల్లలు కనే యంత్రంగా భావించారు, స్త్రీని ఒక వ్యవసాయ పనిముట్టుని చేసారు, ఒక విలాస వస్తువుని చేసారు. ఈ క్రమంలో బాలికలు స్వేచ్ఛగా వారి సామర్థ్యంతో ఎదగడానికి వుండే అడ్డంకులు ఏమిటో వివరంగా చర్చిద్దాం.


బాలికలతో పోల్చినప్పుడు బాలుర పరిస్థితి చాలా మెరుగు అని చెప్పవచ్చు. బాలికల బంగారు బాల్యానికి అడ్డంకులను ఈ విధంగా విభజించవచ్చు.


  1. త ఆచారాలు
  2. కుల వ్యవస్థ
  3. పేదరికం
  4. లైంగిక దాడులు


పై నాలుగింటితో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాం..


మతం - బాలికల బంగారు బాల్యం


ఏ స్త్రీ కూడా స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అని చెప్పిన మతాలు స్త్రీలను సేవకులుగా బానిసలుగా, అవసరాలు తీర్చే ఆటబొమ్మలు గానే చూస్తున్నాయి. మతాలు వాటి ఆచారాల మాటున దాగివున్న ఆచరణలో ఎందరో బాలికలు తల్లి గర్భం నుండి బయటికి రాకుండానే స్వర్గం చేరారు. మతం వాటి ఆచారాల మూలంగానే పదేళ్ళకే భర్తతో పాటు చితిని చేరారు, విధవరాండ్లుగా మిగిలారు. జోగినిలుగా, భగినిలుగా, దేవదాసీలుగా, వేశ్యలుగా మార్చబడ్డారు. ఈ మతం వాటి ఆచారాల వల్లనే చదువుకోవాల్సిన బాల్యం బడికి దూరంగా గడిచింది. ఈ మతాల మారణ హోమం వల్లనే బాల బాలికల్లో లింగబేధాలు బలిష్టమయ్యాయి. మతమే బాలికల్ని సమాజం నుండి దూరంగా నెట్టివేసింది. చాలా సందర్భాల్లో మతం బాలికల బంగారు బాల్యానికి అడ్డంకి అని చెప్పాలి.


కులవ్యవస్థ - బాలికల ఎదుగుదల


భారత ప్రజల అత్యంత దురదృష్టం కులం. ఒక వ్యక్తి పుట్టకముందే తన సామాజిక స్థితి నిర్ణయించబడుతుంది. నూటికి తొంభై శాతం మంది తక్కువ కులం వారిగా చూడబడుతున్న తరుణంలో వేలయేళ్లుగా పాతుకుపోయిన కులవ్యవస్థ అగ్రకులాల వారికి వారు పాల్పడే దాడులకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుతుంది. మతంతో పాటు కులం కూడా బాలికలకు చిన్నవయసులోనే వివాహసలు చేసేందుకు కారణం అవుతున్నాయి. సహజంగానే పెరిగిన మహిళలపై చిన్నచూపు తక్కువ కుల మహిళలపై వివక్షకు కారణం అవుతుంది. కులవ్యవస్థ బాలికల ఎదుగుదలకు అవరోధమవుతుంది.


పేదరికం - బాలికల అభ్యున్నతి


ప్రపంచ దేశాలలో పేదరికం పిల్లల పాలిట శాపంగా మారింది. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పేదరికం ఆటంకంగా మారుతుంది. పేదరికం వల్ల సరియైన ఆహారం అందక బాలికలు అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ఉన్నత చదువులు చదువులు చడవలేకపోతున్నారు. ఇటు ఇంట్లోనూ, అటు సమాజంలోనూ చిన్నచూపు చూడబడుతున్న బాలికలు మతం మాటున విజృంభిస్తున్న కుల రక్కసి కోరల్లో చిక్కి పేదరికం ముంగిట తలొగ్గి, భూస్వామ్య పెట్టుబడి దారీ, పారిశ్రామిక వర్గ కర్కశత్వానికి బాలల బాల్యం తల్లిపాలకు కూడా దూరమవుతుంది.


లైంగిక దాడులు - బాలికలు


లైంగిక దాడులు భారతదేశంలో కొత్తేమీ కాదు. సంస్కృతీ సంప్రదాయాల పేరిట, వేలయేళ్లుగా పురుషాధిక్య సమాజం తన శారీక వాంఛలకు స్త్రీని బలిపశువును చేస్తూనే ఉన్నది. అనాది నుండి నేటికీ తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ పసిపిల్లలపై జరుపబడే అఘాయిత్యాలు వారిని బడికి దూరం చేస్తున్నాయి. సమాజం నుండి వేలివేస్తున్నాయి. ఆత్మన్యూనత భావంలోకి నెట్టివేస్తున్నాయి.


ఐక్యరాజ్య సమితి ఏర్పాటు - బాలల వికాసం


ఏదేశంలో చూసినా బాలల పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యూనిసెఫ్ ఏర్పాటు చేయబడింది. యూనిసెఫ్ ఏర్పాటుతో బాలల సంక్షేమంపై ప్రపంచదేశాలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. వనరుల సమీకరణతో పాటు వారి రక్షణకు అనేక చట్టాలను రూపొందించి, వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బాలల బంగారు బాల్యానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.


భారతదేశం - బాలల అభ్యున్నతి


స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ రాణి పాలన మొదలుకాక ముందు భారత దేశంలోని పరిస్థితులు వ్యక్తి జీవనానికి ఏమాత్రం అనుకులంగాలేవు. జంతువులకు వుండే విలువ కూడా మనుషులకు ఉండేది కాదు. ఇక అమ్మాయిల పరిస్థితి చెప్పనవరమే లేదు. అధ్వాన్నం. నిత్యం అగ్రవర్ణాల చేతుల్లో బలికావడమే.


రెండవ ప్రపంచయుధ్ధం ముగింపు తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, భారత స్వాతంత్ర్యం దాదాపుగా ఒకే చారిత్రకాంశానికి చెందినవి. స్వతంత్ర భారతంలో  ఏర్పాటు చేసుకున్న రాజ్యాగం తర్వాతనే ఈ దేశ ప్రజలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభించాయని చెప్పాలి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ లక్ష్యాలు దేశంలోని ప్రజలందరినీ మనుషులుగా గుర్తించాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి నేటి వరకు బాలల సంక్షేమం కోసం వారి సమగ్ర అభివృధ్ధికోసం ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి.


భారత దేశంలో బాలికల భవిష్యత్తు 


భారత దేశంలో బాలికల భవిష్యత్తు బంగారుమయం కావడానికి కొన్ని సూచనలు:


  • రాజ్యాంగం కుల, మత, లింగ, వర్ణ బేధాలు లేవని చెబుతున్నా అది అమలు చేయుటలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతుందనే చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పిల్లలకు కల్పించబడ్డ రాజ్యాంగ రక్షణలను పటిష్టంగా అమలుపరచాలి.
  • బాలికల రక్షణ కోసం ఫోక్సో లాంటి అనేక చట్టాలు తీసుకువచ్చినా వాటి అమలులో అవి నీరు కారిపోతున్నవి అని ప్రచారంలో ఉన్నది. ఏ ఒక్క దోషి కూడా తప్పించుకోకుండా చట్టాలు దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

  • గర్భస్థ శిశు మరణాలు, బాల్యవివాహాలు ఆపడం, పౌష్టికాహారలోపం, ఉచిత నిర్బంధ విద్య, లైంగిక దాడులు మొదలైన వాటిని సమాజం నుండి పారద్రోలుటకు నిరంతరం ప్రభుత్వాలు కృషిచేస్తున్నవి. అయిననూ ఈ అవాంఛనీయ సంఘటనలు ఆగటంలేదు. వీటి ఆపేందుకు ఈ లోపాల సరిచేసేందుకు ప్రత్యేక భృందాలను ఏర్పాటుచేసి సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి.
  • మత పరమైన, కుల పరమైన వివక్షను తొలగించేందుకు ఎంతో కృషి జరుగుతుంది. దాన్ని మరింత వేగవంతం చేసి సమాజంలోని వివక్షలను రూపుమాపే ప్రయత్నం ముమ్మరం చేయాలి. మానవ విలువల్ని పెంపొందించేందుకు కృషి చేయాలి.
  • పేదరికానికి కారణాలు ఏవైనా సరే పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి సమగ్రమైన సంక్షేమ పథకాలను తీసుకురావాలి. అదేవిధంగా వాటి అమలులో కఠినంగా వ్యవరించి దేశప్రజలందరి జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలి.


పై సూచనలతో పాటు సమకాలీన సంఘటనల భూమికగా ప్రాధాన్యతాంశాలను పరిగణలోకి తీసుకుని రాజ్యాంగ యంత్రాంగం మరియు పౌర యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించినట్టైతే భారతదేశంతో పాటు ప్రపంచ బాలలు కూడా విశ్వవేధికపై అద్భుతాలను సృష్టిస్తారు. స్త్రీని దేవతగా కొలిచే ఈ దేశంలో బాలికలకు రక్షణ లేకపోడం బాధాకరం. బాలికల ఎదుగుదలకు మన సంస్కృతీ సంప్రదాయాలే కారణమవడం శోచనీయం. ఈ పరిస్థితి నుండి త్వరలోనే మనం బయటపడతామని ఆశిద్దాం.

ఎం. రాజేందర్, ఎస్.ఏ తెలుగు,

జెడ్.పీ.ఎస్.ఎస్. రాయపర్తి, మం: నడికూడ, జిల్లా: హనుమకొండ.

0/Post a Comment/Comments