ఆర్తితో పిలిచే కవిత్వవాహిని హరగోపాల్ గారి "చెలిమెలు"
కవిత్వం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని, అలాగే వైవిధ్య భరితమైన రచన పదికాలాల పాటు వివిధ సామాజికవర్గాలనూ ఆకట్టుకుంటుందనీ భావించే వారు హరగోపాల్ గారి కవితలు చదివితే ఆ భావనలకు అబ్బురపడుతారు. పాఠకుడు స్వేచ్చాయుత పరిసరాలలో తన జ్ఞానం మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులు కవితాక్షరాలుగా భావిస్తాడు. కవి భావన అర్థమైతేనే అది సాధ్యం అవుతుంది. సుకవి సొంత అభిప్రాయం పాఠకుల నెత్తినరుద్దాలని చూడడు. తన ఆలోచనా విధానాన్ని సైతం విమర్శాయుతంగానే చూస్తాడు. సామాజిక లోపాలకు స్పందన, ఆవేదన, ఆలోచన, నిర్వేదం, నిశ్చయం అయ్యాక కూడా ఇంకా ఏదో తక్కువయిందని తపన పడేవారే అనుభూతి కవిత్వం వ్రాయగలరు. అటువంటి కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
"ఒక్కటే ముక్క "అంటూ మొదలైన కవితలో ఆసక్తి కలిగించే విధంగా..,
ఒకముక్క చింపి/మొగులు మీద రాసుకుంటా నీ పాటని/ఒక నదిని చుట్టు కొని/జలపాతం కొంగులో దాస్తా/అంటూ మొదలైన కవితలో.. గుంపులో ఒక ఫ్లకార్డునయి నేను/నీ చూపు వాలుతుందో లేదో ఈ వాన నీటికొమ్మ మీద/ఆరుద్ర పురుగునయి మొలకెత్తుతా..! పచ్చి మట్టి వాసనై ముట్టు కుంటా/అంటున్నారు కవి.
*ఒఖ్ఖ రొజు" శీర్షిక కింద,
రెక్కలల్లార్చుకుంటు ఈ రాత్రి/చీకటిని కొంచెం చలితో కలిపి కప్పుకుంది/అనడం సహజంగా ఉంది. శిశిర దృశ్యం ఇదే.
వెన్నెలొలికిన కొండల్ని, గుట్టల్ని, చెట్లని, నీళ్ళని మట్టిని, పిండి/మనుషులెత్తుకుంటుo టరు/ఒకరాత్రి కోసం చలువ చేసిన మనసుల్ని/
తీసి మూసిన తలుపులు తెరిచి, ఎదురు చూస్తున్న వాడే రావడం... కంటి దీపాలతో వెలిగే గది/గుడిసె పూలపొద కావడం చాలా బాగుంది!
అలాగే కవితల్ని ఆకాశపు చుక్కలుగా వెన్నెల కుప్పలో వర్ణించారు! అడి వంతా పచ్చటి ధ్యానం..
ఒక పాట తీయని స్పర్శ... తొవ్వల నాటే నడకన్నారు! నదిని నీళ్లతో పూదిచ్చినట్టు.. /అపుడపుడు నీ కవిత్వాన్ని నీకే కవితగ తప్ప/ఏం చెయ్య గలుగుత ఇచ్చిన మనసును /తడి ఆరకుండా తడుపుకునుడు తప్ప/అనేశారు కవి!
మట్టిలో మొలకలుగా నన్నెత్తుకున్నొడా అనడం కొత్తగా ఉంది. *కలగా*అనే చిన్న కవిత "చిప్ప మంతదీపాన్ని/ముడుపు కట్టుకున్న పూరిల్లు/వాకిట్లకు సానుపు వెలుగు/బొంత కట్టుకున్న యాదులన్నీ/సగం సగం పంచుకున్నయి/దిక్కులు తొలుచుకున్న మనల్ని!*"అని కథనే చెప్పారు. *ఒక్కటి చాలు* శీర్షికలో కూలిన కలలు కండ్ల నుండి రాలి పోతయి/బుక్క బుక్క కూ పానం కుతికె దిగదు/అయితే ఏంది?
ప్రేమ మొగులు ఒక రాత్రి వచ్చినాచాలు/కడమ వన్ని లెక్కనా..!"అనడం బాగుంది.
రైతు కష్టం గురించి *రేపటి పొద్దుకు*శీర్షిక లో... మోట బొక్కేన నిండా ఎక్కిళ్లే/దోనె నిండుతది , దొయ్య పారుతది/గుండె పగిలిన పొలం మీద కాల్వ నీళ్ల లెక్క/తడారిన మాట పెగిలి/పలకరించనియ్యి పచ్చి పెయ్యి మౌనాల్ని/ఆరుద్ర పురుగుల లెక్క/అగుపడితే సాలు మనసు నిండి పాయె!" ఈ భావన లో యాస ప్రాణమైంది .
*సాగుతున్న యాత్ర* కవిత లో "సంభాషణలు మాటల్లోనే నిదురపోవు /నిజం కాని కలలు/కానీ,ముట్టుకున్నంత మురిపాలు/అనడం సహజంగా ఉంది.*రెక్కలు*వచనం లో
"అప్పటి దాకా అల్లుకున్న ఆత్మీయ లతా నికుంజాలు/గోటితో గిల్లేసినట్టుంది రాత్రి/... పాదాలింకా పిట్ట గూళ్ళ లోనే/గాలి పొట్లంలోనే ఇష్ట మోహన వంశీ గీతాలు/కొమ్మనుంచి రాల్చిన పువ్వుల దోసిట్లో/కొన్ని కలయికల కాలం/అంటూ హృద్యoగా వ్రాశారు. *నది* శీర్షిక ద్వారా.."నది రెండు చెక్కిళ్ళు/నవ్వులతో ఎరుపెక్కిన దరులు/తీగెలుగా అలలు మీటి/పాడే నది ఆత్మీయ గీతం!"అనడం కళ్ళకు కట్టినట్లు చూపించారు.*దాటిపోయే వేళ*దివ్య మైన భావాల వ్యక్తీకరణ."ఎంత బతికానో/ఎలా బతికానో/కలయికలన్నీ, క్షణ క్షణ స్మరణీయాలే/కళ్ల మీద అద్దిన లాక్షణిక వీక్షణాలన్ని/..., బ్రతుకంతా ముద్రించిన మానవీయ స్మృతులన్నీ../ఒకసారే యెగ్జిట్ లేని దారి నాలోకి తెచ్చిన నువ్వు/ఒక్కసారి క్షణానoతమైన చల్లని తడివి!" అని అనుభూతి లో ముంచారు
*ఇన్ సెర్చ్ ఆఫ్...*కవిత లో "మనసొక సొరకాయ బుర్ర/ఒంపు కున్నన్ని నీళ్ళు/చెలిమె మొలిచిన రాతి గది/ఆదిమ కాలం నుండి చెక్కిన మాటలు/గురి తప్పని గాత్ర స్పర్శ!"అనేది బాగుంది.*పతoగి* శీర్షిక లో"ఎప్పటి కప్పుడు /ఆశల చితుకులేరి ఆ పూట వెలిగించే/ఆకలి పొయ్యి మీద ఉడికే ప్రాణం/ఆవిరయి ఆకాశము లో/రాసుకున్న కన్నీటి పుస్తకం/అన్నారు కవి. ఇంకా ఈ పుస్తకము లో అనేక గాఢమైన కవితలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. కొద్ది యాసలో హృద్య మైనభావాలూ, వస్తు ప్రతీక లు అందంగా ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజు హరగోపాల్ గారి కలం నుండి ఊరిన ఈ అక్షర *చెలిమెలు*. పాఠకులను ఎంతగానో అలరిస్తాయి. చరిత్ర కారునిగా, బాలసాహిత్యo కృషీవలుని గా వీరికి కాళోజీ అవార్డు సముచిత సత్కారం. రచన సాహితీ వేదిక లో వీరి సాహిత్య ప్రస్థానం మరింత ఉజ్వలంగా సాగాలని కోరుకుంటూ..
సమీక్షకులు
ఎం. వి. ఉమాదేవి,
బాసర.
7842368534
ప్రతులకు:
నవ తెలంగాణా పబ్లిషింగ్ హౌస్, బ్రాంచ్ లు.
ప్రజాశక్తి బుక్ హౌస్, బ్రాంచ్ లు.
ఎం. వి. ఉమాదేవి,
బాసర.
7842368534
ప్రతులకు:
నవ తెలంగాణా పబ్లిషింగ్ హౌస్, బ్రాంచ్ లు.
ప్రజాశక్తి బుక్ హౌస్, బ్రాంచ్ లు.