తెలుగు ‌సాహితీ వనంలో విరబూసిన వనజము

తెలుగు ‌సాహితీ వనంలో విరబూసిన వనజము

 *తెలుగు ‌సాహితీ వనంలో విరబూసిన వనజము*


తెలుగు సాహితీ ప్రక్రియలలో శతకానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు.అన్ని ప్రక్రియలు ఒక ఎత్తు అయితే శతకం ఒక ఎత్తు అని చెప్పవచ్చు. పదిహేడవ శతాబ్దంలో "విశ్వదాభిరామ వినురవేమ" అను మకుటంతో వెలువడిన వెమన్న పద్యాలు పాఠకులకు, భాష అభిమానుల నోట‌ మైమరపించాయి. ఆ కాలం నుండి ‌ఈ కాలం వరకు బహుళ ప్రాచుర్యం పొంది "నభూతో న భవిష్యత్ "అనే విధంగా ఈ రోజున సామాన్య నీతులను ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.శతక పద్యాలు విద్యార్థులకు బాహ్య పఠనానికి, అంతర పఠనానికి, ఉచ్చారణ పటిమను, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. 


తెలుగు భాషా సాహిత్యానికి తన వంతు కృషి చేస్తూ 

అమ్మ చదువుల తల్లి 

సరస్వతీ మెడలో  అక్షరాలతో అభిషేకం చేసిన సరస్వతీ పుత్రిక,మణిపూసల కవి భూషణ్, సాహితీ కిరణం శ్రీమతి వల్లంభట్ల  వనజా సంతోష్ గారు రంగారెడ్డి జిల్లాలోని అడ్లురులో  కీ.శే  శ్రీ, వల్లంభట్ల శివరామ్ శర్మ , శ్రీమతి, పుప్పలత దంపతులకు జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి

ఎం.ఏ తెలుగు సాహిత్యంలో పట్టభద్రులై  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా బోథ్ యందు తెలుగు ఉపన్యాసకులుగా సేవలందిస్తున్నారు. వృత్తి రీత్యా తెలుగు భాష ఉపన్యాసకులుగా విద్యార్థులకు సామర్థ్యధార విద్యను బోధిస్తూ, ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ బాసర క్షేత్రంలో కొలువైన మాతా శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహంతో శతకం లిఖిస్తూ  ప్రేరణ పొందినారు. తెలుగు సాహితీ క్షేత్రంలో

తన వంతు పాత్రను పోషిస్తూ చదువులకు మూల గురువైన చదువుల తల్లి శ్రీ సరస్వతీ మాతా పూజ చేసి తన తొలి వాణీ శతక రచన ప్రారంభించడం గొప్ప విషయం.వీరి సాహితీ సేవలను గుర్తించిన బోజ్జ ఫౌండేషన్ వారు విశిష్ట సేవా జ్యోతి పురస్కారంతో సత్కరించింది.


ప్రముఖ నిష్యామ కర్మ యోగి, తెలుగు భాష పండితులు, సుప్రసిద్ద శివ భక్తుడుగా ప్రసిద్ధ చెందిన, తన తండ్రి శ్రీ, వల్లంభట్ల శివరామ్ శర్మ గారి సంస్కారంలో పుట్టి పెరిగిన వనజా  గురువులనుంచి క్రమశిక్షణ, నడవడికను అలవర్చుకున్నారు.తను బోధిస్తున్న  భోధన భాష తెలుగుకు ఒక ఉన్నతమైన గౌరవం, గొప్ప స్థానాన్ని ఇవ్వాలని గట్టి సంకల్పంతో సమాజ శ్రేయస్సు కోసమే శతక పద్యాలు తీసుకొని ఆధ్యాత్మిక చింతన, సామాజిక అంశాలు,  మానవతా దృక్పథం, మాతృ భాష ఔన్నత్యం,మహానీయుల దేశభక్తి మొదలగు అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని ఛందోబద్ధమైన "వాణీ శతకము" ఎంతో ఉత్సాహంతో రచించారు. ఇది వల్లంభట్ల వనజా గారి తొలి రచన కావడం విశేషం.


తెలుగు సాహితీ వనంలో విరబూసిన వనజము తెలుగు పద్యం పట్ల తనకున్న అభిమానాన్ని పెంచుకొని, తెలంగాణ తెలుగు కళానిలయం భైంసా సముహంలో చేరి కవి సత్యపాల్ రెడ్డి మార్గ నిర్దేశంతో, 

పద్య గురువు మడిపల్లి భద్రయ్య గారి పర్యవేక్షణలో,

కవి వడ్ల నరసింహాచారి ప్రోత్సాహంతో  శతకం లిఖించడం ఆరంభించారు.


*పుస్తకంబె నిండు పున్నమి వెన్నెల*

*పుస్తకంబె దివ్య భుక్తి ముక్తి*

*పుస్తకంబె నీకు పూర్ణ జ్జాన మొసంగు*

*పుస్తకంబె హస్త భూషణంబు*

అను తొలి పద్యం పుస్తకాన్నే అంశంగా తీసుకొని లిఖించడం కొస మెరుపు.


తెలుగు భాషాభిమానులకు, విద్యార్థులకు, పాఠకులకు మంచి భక్తి, యుక్తి, జ్ఞానం అందజేయాలనే ధృడ నిశ్చయంతో  మాతా సరస్వతీ యొక్క ఆశీస్సులతో గొప్ప ప్రయత్నంలో భాగంగా 

"ఆటవెలది" పద్యాలను తీసుకుని *పుస్తకాంచిత కర!పూజ్య!వాణి!* అను మకుటంతో నేటి ఆధునిక కాలంలో సమాజంలో పతనమౌతున్న దైవభక్తి, దేశ భక్తి, ‌గురుభక్తి,

నీతి నియమాలు, ప్రేమ,దయ, విలువలను భావి తరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ వాణీ శతకాన్ని

 రూపొందించడం గర్వించదగ్గ విషయం. ఆటవెలది పద్య ఛందస్సులో మొత్తం 108 పద్యాలు రచించి ఆణిముత్యాల్లాంటి పద్యాలను

 ఏర్చి కూర్చి అల్లారు.‌ఎంతో చక్కని పదజాలంతో అందమైన బొమ్మలతో ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని పద్యాలు ఒక్కొక్కటి

"శుద్ధ పాలకోవా"వంటిది అని చెప్పవచ్చును.

*ఒకటి రెండు పద్యాలను పరిశీలిద్దాం:-*

1)

విద్య చేత మలుపు విద్య చేత గెలుపు 

విద్య లేని యెడల విలువ లేదు 

విద్య చేత భవిత విద్య చేత ఘనత 

పుస్తకాంచిత కర !పూజ్య! వాణి!

ఓ పూజ్య! వాణి ! జీవితంలో ప్రతి మలుపు గెలుపుకు ముఖ్య కారణం విద్య మాత్రమే. అటువంటి విద్యానభ్యాసించడం  వలన సమాజములో గౌరవం లభించును చదువు లేకుంటే  విలువ లేదని భావం. 

2)

అమ్మ కన్న మిన్న అవని నేమున్నది

అమ్మ యేను మనకు ఆది గురువు 

అమ్మ కన్న మనకు దైవ మేదియు లేదు 

పుస్తకాంచిత కర!పూజ్య!వాణి!

ఓ పూజ్య! వాణి !ఈ జగత్తులో అమ్మ కంటే గొప్ప అవని లేదు.అమ్మయే మనకు తొలి గురువు, అమ్మకు మించిన దైవం కూడా లేదు అని భావం 

3)

పచ్చనైన చెట్లు ప్రగతికి మెట్లగు 

ప్రాణ వాయు విచ్చు ప్రాణులకును 

చెట్లు నరికి వేసి చేటు చేయగ నేల? 

పుస్తకాంచిత కర! పూజ్య! వాణి!

ఓ పూజ్య !వాణి !మనిషికి ప్రాణవాయువు ఇచ్చే చెట్లు మన ప్రగతికి మెట్లు వంటింది.అటువంటి చెట్లు నరకడం వలన కీడు సంభవించును అని భావము


వీరి పదపొందిక రచనా శైలి చాలా బాగుంది. పదబంధాలు పెనవేసుకున్న అనేక పద్యాలు పాఠకులకు, భాషాభిమానులకు, విద్యార్థులకు చక్కగా, సరళంగా చదువుకోవడానికి వీలుగా వుంది.ఈ పుస్తకాన్ని జ్ఞానానికి జ్యోతి అయిన అమ్మ సరస్వతీ దేవికి అంకితం ఇవ్వడం, వీరి కృషికి వీణావాణీ వారి అనుగ్రహము సదా ఆశీర్వాదంతో

 సాధనలో తోడునీడ ఫలప్రదము కావాలని ఆకాంక్షిస్తూ.....


*వెల:-₹=50/-*

*ప్రతులకు*

వల్లంభట్ల వనజా 

తెలుగు ఉపన్యాసకులు

ప్రభుత్వ జూనియర్ కళాశాల బోథ్ ఆదిలాబాద్ జిల్లా 504304

చరవాణి సంఖ్య:-8333037850.


*సమీక్షకులు*

రాథోడ్ శ్రావణ్ 

కవి, రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా,9491467715.

0/Post a Comment/Comments