సోమన్న గేయాలు-సురేంద్ర భాష్యాలు (పుస్తక సమీక్ష)-జి.సురేంద్రనాథ,కర్నూలు

సోమన్న గేయాలు-సురేంద్ర భాష్యాలు (పుస్తక సమీక్ష)-జి.సురేంద్రనాథ,కర్నూలు

సోమన్న గేయాలు-సురేంద్ర భాష్యాలు
(పుస్తక సమీక్ష)

అభినయగేయాలు/పాటలు,కథలు అంటే పిల్లలు చెవికోసుకుంటారు.ఇది జగమెరిగిన సత్యమే!."పసి బిడ్డను నిదురబుచ్చే వేళ అమ్మ పాడే జోల పాట,గోరు ముద్దలతో బిడ్డకు బొజ్జ నింపే వేళ అమ్మ పాడే చందమామ రావే పాట సృష్టిలోనే అపురూపం,అమూల్యం,అమోఘం,అద్భుతం!!.దీన్ని బట్టి గీతాలకు/గేయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధమవుతుంది.బుడిబుడి నడకలతో బడికి వెళ్లే పిల్లలు తాము నేర్చుకున్న చిట్టి చిలుకమ్మ, చిట్టి చిట్టి మిరియాలు,బుజ్జి మేక"... అభినయ గేయాలు వారి ముద్దులొలికే జిహ్వ నుంచి వింటుంటే ఎవరికైనా మనసు పులకించిపోతుంది.గేయాలకు/అభినయ గేయాలకు అటూ దైనందిన జీవితంలో ఇటూ సాహిత్యంలో గణనీయమైన స్థానముంది.
    ఏ భాష సాహిత్యంలోనైనా బాలసాహిత్యం పునాది రాయి. దురదృష్టమేమంటే తెలుగులో ప్రౌఢ సాహిత్యంతో పోలిస్తే బాలసాహిత్యం చాలా తక్కువగా ఉందని ఒప్పుకోక తప్పదు.అందులో బాలగేయాలు అతితక్కువ. కథాపుస్తకాలు విరివిగా కనిపిస్తున్న బాలగేయాల పుస్తకాలు వ్రేళ్ళ మీదనే గణించవచ్చు.కాబట్టి బాలగేయాల పుస్తకాల సంఖ్య పెంచాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది.ఈ నేపథ్యంలో ,తన బాధ్యత నెరవేర్చుటలో  గద్వాల సోమన్న గారు ముందున్నారు.గణితోపాధ్యాయుడైనా తెలుగు భాషపై మమకారంతో వందలకొలది బాలగేయాలు రచించి,అనతి కాలంలో రమారమి 33 బాలసాహిత్యం పుస్తకాలకు తాను పురుడుపోయడం ఎంతైనా గర్వకారణం.వాట్సప్ సాహితీ వేదికల్లో,పలు పత్రికల్లో సదా తన రచనలతో కనిపించే సోమన్న గారు ఈ మధ్యనే మిత్రుల ద్వారా పరిచయం కావడం,తాను ముద్రించిన పొత్తాలను నాకు బహుకరించడం వెనువెంటనే జరిగి,"పాలు తేనెలు"బాలగేయాల వారి 33వ కొత్త పుస్తకానికి నా తొలి పలుకులకు నాంది పలికింది. సోమన్న గేయాలు ఆసాంతం చదివి,హృదయం ఉప్పొంగి,పల్లవించు తొలి రాగంలా అక్షర పావురాలై,తొలి పలుకులు నా పాళీలోంచి తుషార బిందువులై జాలువారాయి.
  గద్వాల గారి "పాలు తేనెలు" కొన్ని గేయామృత పంక్తులు జుర్రుకుందాం!:
"చక్కని చుక్కలు గృహమున పిల్లలు
మల్లెల మాలలు మెడలో పిల్లలు
వెన్నెల వన్నెలు చూడగ ముఖములు
తీగల మాదిరి  మెత్తని మనసులు

బాలల నవ్వులు పూసిన పువ్వులు
తావులు రువ్వే సుందర వనములు
చక్కెర రీతిని తీయని పలుకులు
కోకిల గానం వినగా స్వరములు"
 అని చక్కని చుక్కల్లాంటి పిల్లల గురించి చిక్కని తన గేయంలో చవి చూపించారు.
"తెల్లని మల్లెలు మాలగ మారెను
ఎల్లరి మనసులు ఇట్టే దోచెను
కల్లలు కీడని వద్దని చెప్పెను
చల్లని తలపులు ముద్దని తలచెను

ఉత్తమ పనులే గౌరవమిచ్చును
అత్తరు మాదిరి ఇల వ్యాపించును
కత్తెరలాంటివి కఠినపు మాటలు
తత్తరపాటుకు అవి గురిచేయును

కష్టం వచ్చిన వేదన చెందకు
నష్టం కలిగిన తప్పులు చేయకు
శ్రేష్టం పరోపకారం మరవకు
నిష్ఠను బ్రతుకున దూరం నెట్టకు 

అప్పులు పెరిగిన కలతలు తెచ్చును
ముప్పు బ్రతుకులో తప్పక వచ్చును
గొప్పలు కోసం అప్పులు చేయకు
తప్పని తెలిసి దానిలో  ఉండకు"
  అంటూ ప్రాశస్త్యమైన  'సూక్తి రత్నావళి' మన కళ్లెదుట ఉంచారు.

"పసి పిల్లల పలుకులు
తేనె వోలె మధురము
పాలు లాగ తలపులు
నవనీతం హృదయము

చిన్నారుల ముఖములు
వెన్నెలమ్మ హాసము
జాబిలమ్మ సొగసులు
చూడ ఇంద్ర చాపము

*పాలుతేనెలు* శ్రేష్టము
బాలల మనసుల రీతి
బలమైన ఆహారము
మదిలో జ్ఞాన జ్యోతి

వాటి రంగులు వేరు
మనిషి క్షేమం కోరు
*పాలుతేనెలు* ఉంటే
ఆరోగ్యం వెంటే!!"
 అని "పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మన హృదయాలను తీసుకెళ్లారు. ఇలా ఎన్నో బాలలకు ఉపయుక్తమయ్యే అంశాలపై ముగ్ధమనోహరమైన గేయాలు వ్రాశారు గద్వాల సోమన్న గారు.
   'ముందు మాట' కు అవకాశమిచ్చిన గద్వాల గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి కలం నుంచి మరెన్నో పుస్తకాలు వెలుబడాలని,వెలుగు చూడాలని కోరుతూ...

-SURENDRANATH GUNDALA ,
SUPERINTENDING ENGINEER (retd) ,PANCHAYAT RAJ 
DEPARTMENT ,
EX PRESIDENT 
APSCSTGOWA,KURNOOL 
PRESIDENT 
GLOBAL INFORM MAC,
ANDHRA PRADESH.

0/Post a Comment/Comments