మూఢత్వ గొలుసుతో...

మూఢత్వ గొలుసుతో...

 

మూఢత్వ గొలుసుతో...


దేశ కాల పరిస్థితులు ఏవైనా...

చిక్కని మూఢత్వగొలుసు

మనుషుల చుట్టూ బిగిసిపోతూ..

సమాజం విస్తుపోయేలా,

సంబంధీకుల సర్వ శక్తులనీ

పీల్చేస్తూ...

సంయమనం ఊసే లేదిక్కడ!

విడిదీయబోయే చిక్కులే...

మరింత ముడులు పడేసిన

మూర్ఖత్వ బలిమి!


దశాబ్దాలుగా మార్పులేని చోట

ఏ నీతిసూత్రం ఫినాయిలూ వదిలించబోని మురికి

విద్యావంతుల బుర్రలో సైతం

అశాస్త్రీయ వల్మీకపువరసలు

స్పష్టంగా వినపడే అవినీతి బుసలూ...,

కోర్కెల జడివానలో కుప్పకూలే యువత

దేశంలో భావితరాలకు ఏ సందేశం ఇస్తారో...

చేష్టలుడిగిన కుహనా మేధావులు!?


అనేక జీవితవిస్మయాలతో

అతలాకుతలమయ్యే

హృదయాల దీన ఘోష!

ఓ దైవమా..

అదృశ్య శక్తివై, మార్పుతీసుకొనిరా!

మా దిక్కుతోచనితనాన్ని

అవతలి వారిలో జవజీవాల్ని హరించే..

ప్రవర్తనల జడ్డితనాన్ని వదిలిస్తూ...,

నీ పరిపూర్ణ శాంతిమయ ధృక్కులతో

హాయినివ్వు తండ్రీ!!



✍️ఎం. వి. ఉమాదేవి

నెల్లూరు.

0/Post a Comment/Comments