శ్రీ గురుభ్యోనమః
ఆషాఢ అమావాస్య:
ఆషాఢ మాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది.
పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానస పుత్రి పేరు అచ్ఛోద. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృ తర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతన పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది.
సేకరణ.ఉమాశేషారావు వైద్య
9440408080