గురివింద గింజలు
డా.. కందేపి రాణీప్రసాద్.
బంగారాన్ని తూకం వేయడానికి ఉపయోగించే గురివింద గింజలు గురించి తెలుసుకుందాం. దీని గురించి ఎన్నో సామెతలున్నాయి పద్యాలున్నాయి. గురివింద గింజ తన పైనున్న ఎరుపే గానీ కిందనున్న నలుపెరగదు అనే సామెత ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తుంది. తన లోపల గురించి వదిలేసి మిడిసిపడే వాళ్ళను గురించి ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళింట్లో 'గురిగింజెత్తు బంగారమన్నాలేదు' అంటూ పేదరికాన్ని ఎత్తి చెప్పేటప్పుడు అంటారు. అసలు ఈ గురివింద గింజ ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది తెలుసుకుందాము.
గురివింద మొక్క 'ఫాబేసి' కుటుంబానికి చెందిన మొక్క. దీని యొక్క శాస్త్రీయ నామం " ఏ బ్రస్ ప్రికటోరియస్"! దీనిని ఇంగ్లీషులో 'జేక్విరిటి' లేదా 'ఇండియన్ లికోరైస్' అంటారు. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి గానీ విషపూరితమైనవి. ఇవి ప్రస్తుతం మూడు రంగులలో లభ్యమవుతున్నాయి. ఎరుపు రంగు అంటే మనకందరకూ తెలిసిన విషయమే. ఈ గురివింద గింజలు తెలుపు, నలుపు రంగులలో కూడా లభిస్తాయి. బఠాణి విత్తనాలు కాయల్లో కాసినట్లుగా ఈ గురివింద గింజలు కూడా కాయల్లో కాస్తాయి. ఇది కూడా బఠాణి వాలే తీగ జాతి మొక్కే. ఎదో ఒక ఆధారాన్ని ఎంచుకుని పైకి ఎగబాకుతుంది. దీని ఆకులూ చింతాకుల వాలే చిన్నగా ఉంటాయి. దీర్ఘవృత్తాకారంలో ఉండే చిన్న పత్రకాలు కలిగి ఉంటాయి. దీని పువ్వులు కెంపు ఎంగులో ఉంటాయి. ఎర్రని ఎరుపు రంగుతో మెరుస్తూ నున్నగా ఉండే విత్తనాలకు నల్లని మచ్చ కూడా ఉంటుంది. ఈ ఫలాలను ద్విదారక ఫలాలు అంటారు. వీటి ఆకులను ఔషదంగా వాడతారట.
పూర్వం రోజుల్లో బంగారు ఆభరణాలు తయారుచేసే వారి దగ్గర ఈ గురివింద గింజలు ఉండేవి. అప్పట్లో గ్రాములు, మిల్లీ గ్రాములు అంటూ తూకం వేసేవారు కాదు. ఈ గురివింద గింజలతోనే బంగారాన్ని తూకం వేసేవారు. అసలు ఎవరైనా ఈ గురివింద గింజల్ని స్వర్ణకారుల వద్దే చూసేవారు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రతి గురివింద గింజా ఒకే బరువును కలిగి ఉండటం.
ఇది చూడటానికి చిన్న మొక్కలా కనిపిస్తుంది. తీగలు మాత్రం పైకి పాక్కుంటూ వెళతాయి. అలాగే పేర్లు కూడా భూమి లోపలకు బాగా పాతుకుని పోతాయి. ఈ చెట్టును పికేయాలంటే ఓ పట్టాన రాదు అంతే అంత బలంగా భూమిలోకి పాతుకుపోతాయి. ఈ చెట్లను పశువులు, జంతువులూ తినవు. ఈ చెట్లకు తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించవు. ఇది బాగా వేగంగా పెరుగుతుంది.
గురివింద గింజలు చాలా గట్టిగా ఉంటాయి. త్వరగా పగలవు. ఈ గింజల్ని తింటే పికారాన్ని వాంతుల్ని కలగజేస్తాయి. ఇవి కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకా మూర్చను కూడా కలుగ చేయవచ్చు. గింజలు విషపూరితం అంటారు గానీ ఆకులూ, వేర్లలో మాత్రం ఔషద గుణాలున్నాయని, వాటిని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వాడతారని చెబుతారు. ఈ గింజలతో గిరిజనులు కళాకృతులు చేస్తారు ముఖ్యంగా ఇవి ఎర్రగా పగడాల వలె ఉంటాయి కాబట్టి వీటిని దండలుగా గుచ్చుకుని మెడలో ధరిస్తారు. రుద్రాక్షలను మనం మెడలో మాలగా ధరించినట్లుగా ఆదివాసీ స్త్రీలు ఈ గురివింద గింజలు దండలను ధరిస్తారు. నేనైతే బండి గురివింద గింజలతో బొమ్మలు తయారు చేశాను. నాకీ గింజలు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో దొరికాయి. బండి గురివింద గింజలు కూడా అచ్చం ఇలాగె ఉంటాయి. కానీ నల్ల మచ్చ మాత్రం ఉండదు. ముదురు ఎరుపు రంగుతో కేంపుల్ని పోలి ఉంటాయి.
బండి గురివింద చెట్టు కూడా ఫాబేసి కుటుంబానికి చెందినటువంటిదే. కానీ దీని జాతి మాత్రం వేరుగా ఉంటుంది. దీని మొక్క శాస్త్రీయ నామం" ఎడినాంతెర పాదోనినా " అంటారు. ఇది పెద్దగా పెరుగుతుంది. దాదాపు 20 మీటర్ల ఎత్తు పెరిగే చెట్టు. వీటి ఆకులు కోలగా పొడవుగా నున్నగా ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. దీని కాండం, బెరడు కూడా ముదురు గోధమ రంగులో ఉంటుంది. దీని ఆకులు గురివింద ఆకుల్లా ఒకదాని ఎదురుగా మరొకటి ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి వస్తుంది. దీని పూవులు పసుపు రంగులో సన్నని కాడకు చుట్టూ గుత్తులుగా పూస్తాయి. కాయలు ఎండిన తర్వాత వంకర్లు తిరిగి పగిలిపోతాయి. కాయలు గుత్తులుగా ఉండటం వలన పగిలిన కాయల్లో నుంచి ఎర్రగా ఉండే విత్తులు రత్నాల వలె తొంగి చూస్తుంటాయి. ఈ బండి గురివింద గింజలు ముదురు ఎరుపు రంగులో ఉండి గుండ్రని టాబ్లెట్ల వాలే కనిపిస్తాయి. ఈ గింజలకు మెరుపు ఉండదు. నల్లని మచ్చ ఉండదు. గురివింద గింజలు పూర్తి గుండ్రంగా ఉండవు. కొద్దిగా దోసకాయ ఆకారంలో ఉండి బాగా నున్నగా ఉండి మెరుస్తుంటాయి. గురివింద గింజలు కింది భాగం నల్లగా ఉంటుంది. ఈ రెండు రకాల మధ్య తేడాలు ఇదే.
ప్రస్తుతం అన్ని చెట్లలాగానే అడవుల్లో గురివింద చెట్లు కూడా కనుమరుగై పోతున్నాయి. నగరాలలో నివసించే వారికీ వీటిని చూసే అవకాశమే లేదు. ఈ తరానికైతే గురివింద గింజ పేరు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బంగారు దుకాణాలలో వీటిని వాడటం లేదు. బండి గురివింద చెట్లను చాలా పార్కులలో పెంచుతున్నారు కానీ గురివింద చెట్లు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. పూర్వ కాలాలలో గురివింద గింజలపై పాటలు కూడా పాడుకునేవారు. జానపదుల సాహిత్యంలో మాత్రమే వీటి ప్రస్తావన కనిపిస్తుంది. ఇవీ గురివింద గింజల యొక్క విశేషాలు.