ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
అంగడిలో సరుకై...
అమ్మ కానివైనావా...
చీకటిలో నీవు...
చిటారు కొమ్మపై...
మిఠాయి పొట్లమై...
నోటుకై నోరు ఊరిస్తున్నావా...!
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
నడి బజారులో...
నగ్న చిత్రమై నిలిచావా...
అంబేద్కర్ రాజ్యాంగం... ఆదమర్చినావా...
అర్ధ బలం నిన్ను...
కీలుబొమ్మ చేసిందా..
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
మద్యం మత్తులోన మాయమైపోయావా...
అంగ బలంలో నీవు...
ఆగమైనావా...
ఓటుకు నోటు వలలో
చేప పిల్ల వయ్యవా...
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
భూస్వాముల రాజ్యంలో
బానిస సంకెళ్లలో
బందీవై...
బాంచన్ కాల్మొక్త అంటూ...
కన్నీరే మిగిలిందా?
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
పేదల రక్తం పీల్చే...
జలగకు చుట్టమై...
దర్జాగా...
సింహాసన మెక్కావా...
నీ రాజసం ఇప్పుడు...
బిచ్చగత్తె...
నడిరోడ్డుపై...
నవ్వుల పాలయ్యిందా...
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
రూపాయి కట్ట లాగా...
గాలిలోన కవ్విస్తూ...
గాలిపటం లాంటి...
జీవితాలే ...
గెలుపు గుర్రాలై...
నీకు ఓటేస్తూ...
మారని గొర్రెల గుంపే నీకు...
విజయ బాట వేసినాయి...
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
దశాబ్దాల చరితగల...
ఈ భారత దేశంలో...
గెలుపు నిర్ణయించే నోటు.. పాముకాటుల మారి...
ప్రజల సొమ్ము దోచే...
బహిరంగ దొంగలకు...
దోచుకునే లైసెన్స్ అయి నిలిచినాది...
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
కామన్ సెన్స్ లేక...
కామన్ మ్యాన్ ఇప్పుడు... తాత్కాలిక లబ్ది...
లోబపు ఊబిలో...
జీవన్ జీవన్మరణ స్థితిలో...
బతుకు ఎల్లదీస్తుండు...
ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
బుద్ధి జీవులారా...
మేధావులారా...
కదలిరండి ఏకంగా...
చైతన్య నింపగా...
ప్రజాస్వామ్య రక్షణలో... పాలుపంచుకుందాము...
రాజ్యాంగ విలువలను...
దశదిశలా చాటుదాం...
అంబేద్కర్ ఆశయాలు...
నినదించా కదులుదాం...!
_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ )ఖమ్మం
చరవాణి: 70 32 50 46 46