ఓటు హక్కు. (తేటగీతి పద్యములు )టి. వి. యెల్. గాయత్రి.

ఓటు హక్కు. (తేటగీతి పద్యములు )టి. వి. యెల్. గాయత్రి.


ఓట్లు పొందగోరి ప్రజకు నోట్లుపంచి
మద్యపానంబునన్ ముంచి మాయచేసి
దుష్టులౌ నాయకుల్ బహు దోషములను
జేయు చుందురు హీనులై సిగ్గు! సిగ్గు!/

ఉచిత పథకంబులని జెప్పి యుబ్బవేసి
బొబ్బ వెట్టుచు ప్రజలను మోసపుచ్చి
గద్దె నెక్కిన పిమ్మట ఘనముగాను
పాలకులురారొకరుకూడ ప్రజల కడకు!/

లంచ గొండులై నిత్యము వంచనమెయి
దోచుకొందురీ ప్రజలను దొంగలవలె
నీతి ధర్మముల్ దప్పిన నేతలిపుడు
రాజ్య మేలుచుండగరాదు రాదుశాంతి./

ప్రజలు చైతన్య వంతులై వరలుచుండి
శాంతి సౌఖ్యముల్ కోరుచు జాతికొఱకె
యోటు వజ్రాయుధముకేల నొడిసిపట్టి
తఱుమవలయునీదుష్టంపుదండునిపుడు.//

జాతి మనుగడ కోసమై జనముకదిలి
సజ్జనాళిని గుర్తించి శ్రద్ధపట్టి
యోట్లు వేయుచు గెలిపించి నుత్తములకు
పట్టమున్ గట్టి నిల్పిన ప్రగతి కలుగు.//


0/Post a Comment/Comments