అన్విక హాస్టల్ -డా. కందేపి రాణీప్రసాద్

అన్విక హాస్టల్ -డా. కందేపి రాణీప్రసాద్

అన్విక హాస్టల్
డా.. కందేపి రాణీప్రసాద్

ఏమండీ రెండు రోజుల్లో దసరా శలవులు ఇస్తారు కదా ! హైదరాబాదు ఎప్పుడు వెళతారు ? పాపను ఎప్పుడు తీసుకువస్తారు? అంటూ మాధురి ప్రశ్నల వర్షం కురిపించింది
"అరే! వరుసుగా అడుగుతూనే ఉంటావా! రేపు వెళదాం అనుకుంటున్నాను. ఎల్లుండికి తీసుకుని వస్తాను నువ్వు పాపకు ఇష్టమైనవన్నీ చేసిపెట్టు" అన్నాడు రవి
అలాగేనండీ! చూస్తుండండీ మీరు వచ్చేసరికి ఎన్ని వంటకాలు రెడీ చేస్తానో! అక్కడ హాస్టల్ తిండి తిని పిల్ల ఎలా ఉన్నదో ఏమో! 6వ తరగతికే హైదరాబాద్ లో చదవాలి అంటిరి. ఇంటర్ కు వచ్చాక ఎలాగూ హాస్టల్లో వేయక తప్పదు కదా! మీరేమో ఇప్పుడే తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. ఏంటో నా ప్రాణం అంతా దాని దగ్గరే ఉన్నది నిట్టూరిస్తూ అన్నది మాధురి
అందరూ ఒకటో తరగతికే హాస్టల్లో వేస్తున్నారు. బాగా చదవాలని పెద్ద స్కూల్లో వేస్తున్నారు. ఆరవ తరగతి కి కూడా హైదరాబాద్ లో వెయ్యకపోతే చదువెలా వస్తుంది. నీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు టైమయిపోతోంది. నేను బయటికి పోతున్నా తలుపేసుకే అంటూ రవి బయటకు వెళ్ళాడు.
అనుకున్నట్లుగానే తెల్ల వారి స్కూలు వాళ్ళకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాక మరునాడు హైదరాబాద్ వెళ్ళాడు. అన్వికను తీసుకుని ఇంటికి వచ్చాడు. పిల్లను చూసి మాధురి తెగ సంబర పడింది.
"ఇంత నల్లగా అయిపోయావు. ఈ రోజు నేనే నలుగుపెట్టి శుభ్రంగా స్నానం చేయిస్తాను. తలంతా ముబ్బులా అయిందేమిటి. తలను అలా గోక్కుంటున్నా వేమిటి. తల మీద కుండా స్నానం చేయిస్తామ పద" ఆన్నది మాధురి.
"అమ్మా నా తలంతా, వళ్ళంతా దురద పెడుతూ రోజు గోక్కుంటూనే ఉన్నాను. ఒంటి మీద, తలలో పుండ్లు పడుతున్నాయి. మంట పెడుతున్నది". అన్నది దిగులుగా అన్విక.
మాధురి అన్విక తలను పరీక్ష పెట్టి చూసింది తలనిందా పేలు పారుతున్నాయి. అక్కడక్కడా పుండ్లు పడి ఉన్నాయి. "అయ్యో అన్వికా! ఇదేమిటే ఇన్ని పేలు పడ్డాయి, నిద్రేలా పడుతోందే. ఏ రోజూ నీతలలో పేలు వచ్చిందే లేదు. నువ్వసలు పేలను చూశావా ఎప్పుడైనా" మాధురి ఒకింత బాధతో అన్నది.
అన్విక కు స్నానం చేయిస్తున్నపుడు ఒంటి మీద పుండ్లను గమనించింది . చంకల్లో, గజ్జల్లో పుండ్లు, పచ్చాయి. ఒంటి మీద అక్కడక్కడా ఎర్రని పొక్కులు వచ్చాయి. అన్వికను అలా చూడగానే మాధురికి కళ్ళమెట నీళ్ళు తిరిగాయి. తలంతా బాగా రుద్ది రుద్ది స్నానం చేయించింది.
భర్త ఆఫీసు నుంచి రాగాన్నే మాధురి తన కోపాన్నంతా వెళ్ళగక్కింది. "పిల్లకు వళ్ళంతా చక్కగా రుద్దుకుని స్నానం చేయటం రాకపోయె. తల దువ్వుకోవటం కూడా సరిగా రాని పిల్ల. అక్కడ మిగతా పిల్లల తలలో పేలు దీనికి వచ్చాయి. పిల్ల ఎంత కష్టపడుతున్నదో చూరావా"
రవి కూడా అంతే కోపంగా అన్నాడు "అక్కడ నీ కూతురు ఒక్కతే ఉన్నదా ! మందల మంది పిల్లలు ఉన్నారు. పనులు రావు అని చెప్పటం కాదు. పనులు చేయటం నేర్చుకోవాలి. పెద్ద చదువులు చదవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఊరికే వచ్చేస్తాయా"
రవి మాటలకు మాధురి కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. కోపంగా ఉన్నపుడు మాటా మాటా పెరగడం తప్ప జరిగే ప్రయోజనం ఏమీ లేదు.
మధ్యాహ్నం అన్నాలు తిన్న తర్వాత అన్వికను కూర్చోబెట్టుకొని  తల దువ్వ సాగింది . పేల దువ్వెన తెచ్చి తలను దువ్వింది. పేలన్నీ కింద పడసాగాయి. వాటన్నింటిని గోళ్ళతో చంపేసింది. చాలా వరకు పేలన్నీ పోయాయి. ఇంకా అక్కడక్కడా ఉంటాయి. వాటినీ వదిలిస్తే కానీ కుదరదు. లేదంటే మళ్ళీ పిల్లల్ని పెట్టేస్తాయి.
"అవ్వికా రేపు పేల షాంపూను పెడతాను. మొత్తం చచ్చిపోతాయి. సాయంత్రం డాక్టరు దగ్గరకు వెళదాం సరేనా" అంటూ మాధురి పిల్లతో చెపుతూ భర్తకు కూడా చెప్పింది.
"ఏమండీ! సాయంత్రం అన్వికను డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాలి. ఒళ్ళంతా ఎర్రపొక్కులు పుండ్లు ఉన్నాయి"
"సరే మాధురీ సాయంత్రం తీసికెళతానులే" అన్నాడు రవి.
సాయంత్రం డాక్టరు వద్దకు వెళ్ళారు. మాధురి, రవి, అన్వికను డాక్టరుకు చూపించారు. డాక్టరు చూసిన వెంటనే "అమ్మాయి హాస్టల్ లో ఉంటోందా" అని ప్రశ్నించాడు. అవునండి" అని సమాధానం చెప్తూనే భార్యాభర్తలిరువురూ ఆశ్చర్యపోతారు
"అమ్మా! ఇవి హాస్టళ్ళలో ఉండే పిల్లలకు ఎక్కువగా వస్తాయి . అపరిశుభ్ర వాతావరణంలో ఒకరి నుంచిఒకరికి అంటుకునే అంటు వ్యాధులు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా హాస్టళ్ళలో ఉండే వారికే వ్యాపిస్తూ ఉంటాయి ఎవరి బట్టలు వారు దూరంగా పెట్టుకోవాలి. లేదంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సంక్రమిస్తూనే ఉంటాయి". అన్నాడు డాక్టరు
మాధురి భర్త వంక కొరకొరా చూసింది. "చూశావ డాక్టరు కూడా నామాటే చెబుతున్నాడు. అన్న బావం ఉంది ఆ చూపులో.  అవునండీ".
ఆ స్కూలుకు చాలా మంచి పేరుంది సార్! అక్కడ చదివితే ఐఐటి గ్యారంటీగా వస్తుందట సర్ " అంటూ రవి నసుగుతూ చెప్పాడు.
చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. ఇప్పటి నుంచే అంత ఒత్తిడి ఎందుకు. ఐనా ఈ విషయాలు మీ ఇష్టం కానీ ఈ చర్మ వ్యాధికి మందులు రాసిస్తాను, వాడండి. పిల్ల వేసుకునే బట్టలు, దుప్పట్లు వేడి నీళ్ళలో ఉడికించి వాడండి. ఈ ఆయింట్ మెంటు ఒళ్ళంతా పూయండి. ఇంట్లో కొన్ని రోజులు అమ్మాయిని మిగతా పిల్లలకు దూరంగా పడుకోబెట్టండి' అంటూ ప్రిస్క్రిప్షన్ రాయడంలో మునిగిపోయాడు
"సర్, రేపటికి తగ్గిపోతుందా! ఎల్లుండి స్కూల్లో వదిలి పెట్టాలి " అంటూ రవి ఆదుర్దాగా అడిగాడు". 
చూడండి జబ్బులు రావడం సులభం తగ్గాలంటే టైమ్ పడుతుంది అందులో చర్మసమస్యలు త్వరగా తగ్గవు. వారం పది రోజులు పట్టవచ్చు నేను చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి . మీకు వీలైతే పాపను ఇంట్లో ఉంచి చదివించుకోండి" అని ప్రిజరెష్ణన్ చేతికిచ్చాడు.
డాక్టరుకు నమస్కారం పెట్టేసి బయటకు వచ్చారు ముగ్గురూ. ఇంటికి వెళ్ళాక అన్విక హాస్టల్లో జరిగే విషయాలన్నీ అమ్మా నాన్నలకు చెప్పింది. రౌడీ పిల్లలు ఎలా బెదిరిస్తారో చెప్పింది. వాళ్ళ హోం వర్కులు కూడా తన చేత బలవంతంగా రాయిస్తారని చెప్పింది. తను తెచ్చుకున్న చిరు తిళ్ళు కూడా వాళ్ళే అనేస్తారనే ఎన్నో విషయాలు చెప్పింది. 
ఇవన్నీ విన్నాక రవి మనసు కరిగిపోయింది. "నువ్వు ఇక్కడే చదువు కుందువు గానీ హాస్టల్ కు వద్దులే తల్లీ" అన్నాడు రవి. మాధురి కి సంతోషం ఎక్కువై కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. తన్వికను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నది.
 

0/Post a Comment/Comments